చైనా యాప్‌తో ఈ-రిక్షా స్టాప్… టెక్ మిస్‌యూజ్‌పై ఆందోళన!
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్‌తో టీవీలు, ఏసీలు, స్మార్ట్ గ్యాడ్జెట్స్‌ను కంట్రోల్ చేయడం మనకు తెలిసిందే.
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్‌తో టీవీలు, ఏసీలు, స్మార్ట్ గ్యాడ్జెట్స్‌ను కంట్రోల్ చేయడం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు కొందరు ఏకంగా రోడ్డుపై వెళ్లే ఈ-రిక్షాలను (ఎలక్ట్రిక్ ఆటోలను) తమ ఫోన్లతో కంట్రోల్ చేస్తూ ఆపేస్తున్నారు. చైనాకు చెందిన ఒక మొబైల్ యాప్‌ను వాడుతూ, బ్యాటరీ టెక్నాలజీలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాంక్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రోడ్డు మధ్యలోనే ఆగిపోతున్న రిక్షాలు:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. రోడ్డుపై నడుస్తున్న ఈ - రిక్షాలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి. డ్రైవర్లు ఎంత ప్రయత్నించినా అవి స్టార్ట్ అవ్వడం లేదు. అయితే, ఇది ఏదో రిపేర్ అనుకుంటే పొరపాటే. కొందరు ఆకతాయిలు పక్కనే నిలబడి ఒక చైనీస్ యాప్ ద్వారా ఆ రిక్షాల పవర్‌ను కట్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత డ్రైవర్లు కంగారు పడుతుంటే చూసి నవ్వుకుంటూ ప్రాంక్ వీడియోలు తీస్తున్నారు.
ఈ యాప్‌తో అసలు కథ:
ఈ దారుణానికి కొందరు 'BAT-BMS' అనే చైనీస్ యాప్‌ను వాడుతున్నారు. సాధారణంగా ఈ-రిక్షాలలో తక్కువ ధరకు దొరికే లిథియం, అయాన్ బ్యాటరీలను వాడుతుంటారు. ఈ బ్యాటరీల మేనేజ్‌మెంట్ సిస్టమ్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది.ఇక దీని ద్వారా బ్యాటరీ కండిషన్‌ను ఫోన్‌లో చూసుకోవచ్చు. అయితే, ఈ టెక్నాలజీలోని సెక్యూరిటీ లోపాలను కొందరు ఆకతాయిలు ఇప్పుడు తప్పుడు పనులకు వాడుకుంటున్నారు.
పాస్‌వర్డ్ లేకపోవడమే శాపం:
ఈ - రిక్షా యజమానులు చాలామంది తమ బ్యాటరీ బ్లూటూత్ ఫీచర్‌కు ఎలాంటి పాస్‌వర్డ్ సెట్ చేసుకోరు. దీనివల్ల ఆ రిక్షాకు కాస్త దగ్గరగా వెళ్లిన ఎవరైనా సరే.. తమ ఫోన్‌లోని బ్లూటూత్ ఆన్ చేసి, సదరు చైనా యాప్ ద్వారా బ్యాటరీని కనెక్ట్ చేసేస్తున్నారు. ఇక ఒక్కసారి కనెక్ట్ అయ్యాక యాప్ నుండి బ్యాటరీ పవర్‌ను ఆఫ్ చేయగానే.. నడుస్తున్న రిక్షా కాస్తా రోడ్డు మధ్యలోనే జామ్ అయిపోతోంది.
టెక్నాలజీ దుర్వినియోగంపై విమర్శలు:
కేవలం వ్యూస్ కోసం, లైకుల కోసం ఇలాంటి ప్రమాదకరమైన ప్రాంక్స్ చేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రోడ్డుపై వేగంగా వెళ్లే వాహనాలను ఇలా అకస్మాత్తుగా ఆపేయడం వల్ల వెనకాల వచ్చే వాహనాలు ఢీకొని పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి టెక్ మిస్‌యూజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే డ్రైవర్లు తమ బ్యాటరీలకు వెంటనే పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా దాన్ని వాడే విధానంలో ఙ్ఞానం ఉండాలి. ఇలాంటి ప్రాంక్స్ వల్ల అమాయక ఈ- రిక్షా డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినడమే కాకుండా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఈ- రిక్షా తయారీదారులు మరియు యజమానులు తమ బ్యాటరీ సెక్యూరిటీ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.