జగన్ మావిగన్...విశాఖ సంగతేంటి ?

విశాఖ మన రాజధాని అని వైసీపీ అధినేత జగన్ గతంలో చెప్పారు. తాను 2024లో మరోసారి గెలిస్తే విశాఖ నుంచే ప్రమాణం చేస్తాను అని కూడా చెప్పారు.

Update: 2026-07-02 08:30 GMT

విశాఖ మన రాజధాని అని వైసీపీ అధినేత జగన్ గతంలో చెప్పారు. తాను 2024లో మరోసారి గెలిస్తే విశాఖ నుంచే ప్రమాణం చేస్తాను అని కూడా చెప్పారు. విశాఖలో అన్నీ ఉన్నాయి అది సహజసిద్ధమైన రాజధాని అని వైసీపీ నేతలు పలు మార్లు చెప్పుకొచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో చేదు ఫలితాలు దక్కిన తరువాత కానీ వైసీపీ నేతలకు తత్వం బోధపడలేదని అంటున్నారు. అందుకే కొన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉండి ఇపుడు దాదాపుగా టీడీపీ రూట్లోనే వెళ్తున్నారు అని అంటున్నారు. టీడీపీ కూడా అమరావతి రాజధాని అన్నది. విజయవాడ గుంటూరులకు దూరంగా కొత్త నగరం నిర్మించే పనిలో టీడీపీ ఉంది. అయితే వైసీపీ మాత్రం రెడీ మేడ్ గా మావిగన్ అని అంటోంది. అంటే విశాఖకు బదులుగా మావిగన్ తెచ్చినా రెడీ మేడ్ సిటీ విషయంలో మాత్రం వైసీపీ పక్కకు జరగలేదు అన్నది స్పష్టం అవుతోంది.

ఆశ పెట్టింది ఎవరు :

ఇక విశాఖ రాజధాని అన్నారు. బీచ్ రోడ్డులో రుషికొండ మీద టూరిజం రిసార్ట్స్ ని తొలగించి అక్కడ సీఎం క్యాంప్ ఆఫీసు అని నివాసం అని దాని పేరుతో భారీ భవనాలు కట్టారు. నాలుగు వందల కోట్ల రూపాయలు దాని కోసం ఖర్చు చేశారు. విశాఖలో సముద్రం ఉంది, రైల్ రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ ఉందని కూడా చెప్పారు. ఉత్తరాంధ్రా వెనకబాటుతనం అంతా పోయేలా విశాఖ క్యాపిటల్ ద్వారా అభివృద్ధి సాగుతుందని కూడా ప్రకటించారు. కానీ ఇపుడు విశాఖను వెనక్కి తీసుకున్నారు. ఆశ పెట్టి తగ్గిపోయారు అని అంటున్నారు. మరి దీని మీద ఉత్తరాంధ్రా వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చకు వస్తోంది.

మా ప్రాంతం బాగుపడొద్దా :

ఇక విశాఖ రాజధాని అన్నపుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి వారు గట్టిగా సమర్ధించారు. మా ప్రాంతం బాగు పడవద్దా అని కూడా ప్రశ్నించారు. మాకు రాజధాని వస్తూంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు అని కూడా విమర్శించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అలాగే బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా విశాఖ రాజధానికి జై కొట్టారు. మరి ఇపుడు వైసీపీ అయితే మావిగన్ అని తన రూట్ మార్చి ప్లేట్ తిప్పేసింది. దాంతో ఈ మాజీ మంత్రులు ఇంకా వైసీపీలోని కీలక నేతలు సీనియర్ నేతలు ఏమంటారు అని ప్రశ్నలు వస్తున్నాయి.

అసలైందే కరవు అందుకే :

అయితే మైసూర్ పాక్ లో మైసూర్ లేదని సెటైర్ ఉంది. అలాగే విశాఖ రాజధాని అని వైసీపీ నేతలు ఎంత గట్టిగా చెప్పినా మరెంత ఆర్భాటం చేసినా జనాల మద్దతు అయితే ఏ కోశానా లేదని తేలిపోయింది. విశాఖ రాజధాని అన్న తరువాతనే 2023లో ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ప్రజలు యువత ఉద్యోగులు విద్యావంతులు అంతా కలసి టీడీపీకే ఓటేశారు. ఆ తరువాత 2024లో విశాఖ జిల్లా మొత్తం ఒక్క సీటూ వైసీపీకి లేకుండా చేశారు. ఇంతే కాదు గత అయిదేళ్లలో వైసీపీ విశాఖ రాజధాని అని ఎంతగా చెప్పినా జనాల నుంచి పాజిటివ్ రియాక్షన్ అయితే పెద్దగా రాలేదని గుర్తు చేస్తున్నారు. అందుకే వైసీపీ కూడా తన నిర్ణయం మార్చేసుకుంది అని అంటున్నారు. అయితే చెప్పుకోవడానికి ఈ రీజన్ బాగుంది కానె విశాఖ సహా ఉత్తరాంధ్రా అభివృద్ధి మీద వైసీపీ చిత్తశుద్ధి ఇంతేనా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. మరి వైసీపీ ఏ విధంగా దీని మీద జనాలకు చెప్పుకుంటుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News