‘మా ఊరి పేరే శాపమైంది మహాప్రభో’.. అసెంబ్లీలో ఎమ్మెల్యే హృదయవేదన

ఒక మనిషికి తన ఊరు అంటే గుర్తింపు.. తన పేరు తర్వాత చెప్పుకునేది తను పుట్టిన గ్రామం, ప్రదేశం పేరు. ఆ పేరు వినగానే గర్వంగా ఛాతి విరిచే అవకాశం ఉండాలి.;

Update: 2026-01-08 07:03 GMT

ఒక మనిషికి తన ఊరు అంటే గుర్తింపు.. తన పేరు తర్వాత చెప్పుకునేది తను పుట్టిన గ్రామం, ప్రదేశం పేరు. ఆ పేరు వినగానే గర్వంగా ఛాతి విరిచే అవకాశం ఉండాలి. కానీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి ఆ గర్వం ఉన్నా.. పేరు చెప్పుకోలేని స్థితి.. గుండెల్లో గుచ్చుకునే అవమానంగా ఉంది. తమ ఊరి పేరు చెప్పుకోవాల్సి వస్తే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే యువత అందరూ ఏళ్ల తరబడి మౌన వేదన అనుభవిస్తున్నారు. చివరకు ఆ వేదన తెలంగాణ అసెంబ్లీ వేదికపై మాటల రూపంలో బయటకు వచ్చింది.

శీతాకాల సమావేశంలో ఎమ్మెల్యే వినతి..

ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఆవేదన కనిపించింది. ‘ఆ ఊరి పేరు పలకడానికే ఇబ్బందిగా ఉంది. ఒకచోట చెప్పాల్సి వస్తే నవ్వులు, ఎగతాళి. అక్కడి ప్రజలు తమ ఊరి పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు అవమానాన్ని ఎదుర్కొంటున్నారు’ అంటూ చెప్పడంలోనే ఆయన గొంతు బరువెక్కింది. ఈ సమస్య కొత్తది కాదు. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఇదే బాధను మోస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు వచ్చినప్పుడు పత్రికలపై ఊరి పేరు రాయాల్సి వస్తే ఆ కుటుంబాలు రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. బయట ఊర్లకు వెళ్లినప్పుడు ‘మీ ఊరు ఏది?’ అన్న సాధారణ ప్రశ్న కూడా అవమానంగా మారుతోంది. అందుకే గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సామాజికంగా ఊరి పేరును మార్చుకున్నారు. నందిగూడ అని పిలుచుకుంటున్నారు. బోర్డులు, శుభకార్యాల పత్రికలు, స్థానిక కార్యక్రమాలన్నింటిలో అదే పేరు వాడుతున్నారు.

రికార్డుల్లో అదే.. కానీ పిలుచుకునేది వేరు..

కానీ, సమస్య అక్కడితో ముగిసిపోలేదు. ప్రభుత్వ రికార్డులు మాత్రం ఇంకా పాత పేరునే మోస్తున్నాయి. రెవెన్యూ పత్రాలు, ఆధార్ కార్డులు, ఇతర అధికారిక డాక్యుమెంట్లలో ఆ అసభ్య అర్థం వచ్చే పేరు అలాగే ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఆ పేరును పలకాల్సి రావడం గ్రామస్తులకు మరింత అవమానంగా మారుతోంది. ‘సామాజికంగా మేము పేరు మార్చుకున్నాం.. కానీ ప్రభుత్వమే మమ్మల్ని ఇంకా అదే పేరుతో గుర్తిస్తోంది’ అనే ఆవేదన ఎమ్మెల్యే మాటల్లో స్పష్టంగా వినిపించింది. అసెంబ్లీలో ఆ గ్రామం అసలు పేరు చెప్పాల్సిన సందర్భంలో ఎమ్మెల్యే హరీష్ బాబు కూడా తడబడ్డారు. చివరికి నేరుగా పలకలేక ఇంగ్లిష్ అక్షరాలతో స్పెల్లింగ్ చెప్పాల్సి వచ్చింది. ‘L-A-N-J-A Guda’ అని చెప్పగానే సభలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ పేరులోని అర్థం గ్రహించిన సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. అది కేవలం ఒక పదం కాదు.. ఒక గ్రామం మొత్తాన్ని అవమానించే ముద్ర అని అక్కడే అర్థమైంది.

ఎమ్మెల్యే పరస్పర చర్చ..

ఈ ప్రతిపాదన తర్వాత సభలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు పరస్పరం చర్చించుకుంటూ, ‘ఇది నిజంగా మారాల్సిన విషయం’ అన్న భావన వ్యక్తం చేసినట్లు కనిపించింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గ్రామానికి మద్దతు వెల్లువెత్తుతోంది. ‘ఊరి పేరుతో మనుషుల్ని అవమానించకూడదు’, ‘ఆడవారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పేర్లు కొనసాగించడం అన్యాయం’ అంటూ నెటిజన్లు గళమెత్తుతున్నారు. ఇక్కడ ప్రశ్న కేవలం ఒక గ్రామం పేరుకే పరిమితం కాదు. ఇది గుర్తింపు, గౌరవం, మానవీయతకు సంబంధించిన అంశం. చరిత్రలో ఎప్పుడో పెట్టిన పేర్లు కాలక్రమంలో అర్థాలు మారతాయి. అర్థాలు మారినప్పుడు, అవి మనుషుల జీవితాలను గాయపరుస్తున్నప్పుడు.. వాటిని సరిదిద్దే బాధ్యత ప్రభుత్వాలదే. గ్రామస్తులు ఎలాంటి రాజకీయ డిమాండ్లు చేయడం లేదు. అభివృద్ధి నిధులు కోరడం లేదు. ఒక్క పేరు మాత్రమే... తమను అవమానించని ఒక పేరు మాత్రమే కోరుతున్నారు.

‘నందిగూడ’గా పేరు మార్చడం ఈ గ్రామానికి కేవలం పరిపాలనా నిర్ణయం కాదు. అది అక్కడి మహిళలకు గౌరవం, పిల్లలకు ధైర్యం, యువతకు ఆత్మవిశ్వాసం ఇచ్చే మార్పు. అసెంబ్లీ వేదికపై వినిపించిన ఆ వేదన మాటలు.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంగా మారుతాయా? లేక మరోసారి ఫైళ్ల మధ్యే మిగిలిపోతాయా? అన్నది వేచి చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఒక ఊరి పేరు కూడా ఒక సమాజం గుండెల్లో ఎంత లోతైన గాయం చేస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Tags:    

Similar News