తెలియదు.. గుర్తు లేదు.. మరచిపోయా.. మిథున్ రెడ్డి జవాబులివే..
ఏసీబీ కోర్టు అనుమతితో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంటల్ జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్న సిట్ పోలీసులు ఉదయం 10 గంటలకు విజయవాడ తీసుకువచ్చారు.;
వైసీపీ ఎంపీ, లిక్కర్ స్కాంలో ఏ4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు శుక్రవారం కస్టడీలో విచారించారు. ఏసీబీ కోర్టు అనుమతితో రెండు రోజుల కస్టడీకి తీసుకున్న మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తీసుకువచ్చారు. తొలిరోజు సుమారు 4 గంటల పాటు ఆయనను ప్రశ్నించగా, పోలీసుల విచారణలో తనకు లిక్కర్ స్కాంపై ఏమీ తెలియదని మిథున్ రెడ్డి వాదించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం ఉండదని ఆయన వివరణ ఇచ్చారంటున్నారు.
ఏసీబీ కోర్టు అనుమతితో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంటల్ జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్న సిట్ పోలీసులు ఉదయం 10 గంటలకు విజయవాడ తీసుకువచ్చారు. సిట్ కార్యాలయంలో మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదుల సమక్షంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విచారణ కొనసాగించారు. సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు కోర్టు అనుమతి ఉన్నప్పటికీ, మూడు గంటల ముందుగానే సిట్ తొలిరోజు విచారణ ముగించింది. దాదాపు 4 గంటల పాటు మిథున్ రెడ్డిని ప్రశ్నించిన పోలీసులు సుమారు 50 వరకు ప్రశ్నలు వేసినట్లు సమాచారం.
మద్యం పాలసీ రూపకల్పన, ముడుపుల పర్సెంటేజీ ఖరారు, ఆటోమెటిక్ మద్యం సరఫరా విధానం రద్దు చేసి మాన్యువల్ విధానం ప్రవేశపెట్టడం, ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ కు ఐఏఎస్ హోదా కల్పిస్తామని ఆశ చూపిన వవిషయంపై సిట్ ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అయితే సిట్ వేసిన అన్ని ప్రశ్నలకు తనకు తెలియదు, సంబంధం లేదన్న మాటలనే మిథున్ రెడ్డి చెప్పారంటున్నారు.
కాగా, మద్యం సరఫరాకు అనుసరిస్తున్న ఆలోమెటిక్ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాన్యువల్ గా మార్చారు. దీనివెనుక మొత్తం పాత్ర మిథున్ రెడ్డి దేనని సిట్ అనుమానిస్తోంది. దీనిపై వేసిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పలేదని అంటున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ కనస్ట్రక్షన్ కంపెనీలోకి డిస్టలరీస్ ఖాతాల నుంచి రూ.5 కోట్లు జమకావడంపైనా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అయితే అది ముడుపుల సొమ్ము కాదని, ఇతరత్రా లావాదేవీల వల్ల ఆ నగదు జమైందని, వెంటనే తిరిగి పంపామని బదులిచ్చినట్లు తెలుస్తోంది.
ఇక నగదు రూపంలో తీసుకున్న డబ్బు విషయంలోనూ 2019 ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికలకు పెరిగిన ఆస్తులపై ఎన్నికల అఫిడవిట్ చూపి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే సిట్ ప్రశ్నలకు మిథున్ రెడ్డి సరిగా సమాధానాలు చెప్పడం లేదని కథనాలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకువెళ్లి ఆయన కస్టడీని పెంచాలని పిటిషన్ వేయనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా శనివారం కూడా మిథున్ రెడ్డిని కస్టడీలో ప్రశ్నించనున్నారు.