నేడే మిథున్ రెడ్డి అరెస్టు!? సిట్ నోటీసులతో ఢిల్లీ నుంచి విజయవాడకు వైసీపీ ఎంపీ..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-07-19 04:30 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అరెస్టు అనివార్యమైంది. గత మార్చి నుంచి సుప్రీంకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందిన మిథున్ రెడ్డి తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సిట్ ఎదుట లొంగిపోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. సుప్రీంకోర్టు సూచనతో హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి.. అక్కడ ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంలో ఊరట దక్కుతుందని ఆశించారు. అయితే రూ.3,200 కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్ అన్న ప్రభుత్వ ఆరోపణలు, అందుకు బలమైన ఆధారాలు చూపడంతో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఇక సుప్రీంకోర్టులో ఊరట దక్కకపోవడంతో బేషరతుగా లొంగిపోడానికి మిథున్ రెడ్డి సిద్ధమైనట్లు చెబుతున్నారు. అనంతరం బెయిల్ కోసం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించినందున విచారణకు రమ్మంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడ వెళ్లేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. ఈ రోజు ఉదయం 11.30 నిమిషాలకు ఆయన విజయవాడ చేరుకుంటారని, అనంతరం మధ్యాహ్నం న్యాయవాదులతో సిట్ కార్యాలయానికి వెళతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

లిక్కర్ స్కాంలో అంతిమ లబ్ధిదారు తర్వాత మిథున్ రెడ్డిదే కీలక పాత్రగా సిట్ చెబుతోంది. దీంతో ఆయన విచారణపై వైసీపీలో టెన్షన్ నెలకొంది. మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత సిట్ నెక్ట్స్ టాస్క్ ‘బిగ్ బాస్’ అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రోజు జరగబోయే పరిణామాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. మిథున్ రెడ్డి అరెస్టు అయితే వైసీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు. వైసీపీలో ఆయన పాత్ర అత్యంత కీలకం. మిథున్ రెడ్డి కుటుంబం వైసీపీకి ప్రాణవాయువు లాంటి రాయలసీమ రాజకీయాలను పర్యవేక్షిస్తుంది. మిథున్ రెడ్డి అరెస్టు అయితే ఆ ప్రభావం పార్టీపై తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన నిందితుల్లో ఎక్కువ మంది రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే. ఇక మాజీ సీఎం జగన్ కు కుడి, ఎడమ భుజాల్లాంటి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లిక్కర్ స్కాంలో ఇరుక్కోవడం వైసీపీ అధినేతకు ప్రమాద సంకేతంగా చెబుతున్నారు.

Tags:    

Similar News