మిస్ వరల్డ్ 2025: ఓరుగల్లుకు వచ్చే సుందరీమణులకు మెనూ ఇదే
కాకతీయుల కాలం నాటి చారిత్రక వేయిస్తంభాల గుడి.. వరంగల్ ఖిలా.. రామప్ప దేవాలయాల్ని సందర్శించనున్న సుందరీమణులకు.. అదిరే అతిధ్యాన్ని సిద్ధం చేస్తున్నారు.;
మిస్ వరల్డ్ 2025 పోటీలకు రంగం సిద్ధమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరో మెట్టుకు తీసుకెళ్లే ఈ పోటీల వేళ.. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సుందరీమణులను తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించేలా వారి షెడ్యూల్ ను సిద్ధం చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల పద్నాలుగున ఓరుగల్లుకు రెండు టీంలు వెళ్లనున్నాయి.
కాకతీయుల కాలం నాటి చారిత్రక వేయిస్తంభాల గుడి.. వరంగల్ ఖిలా.. రామప్ప దేవాలయాల్ని సందర్శించనున్న సుందరీమణులకు.. అదిరే అతిధ్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వారి కోసం ప్రత్యేక మెనూను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 75 రకాల వంటలను హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో సిద్ధం చేసేందుకు వీలుగా ఉన్నతాధికారులు ప్లాన్ చేశారు.
పచ్చి పులుసు.. నాటుకోడి కూర.. బోటి మటన్ సహా ఫ్రెంచ్ కోకావిన్ (చికెన్ మీద వైస్ పూసి నిప్పులపై కాల్చే వంటకం).. స్పానిష్ పైఎల్లా.. గ్రీన్ మొసాకో (గుడ్లు.. బంగాళదుంపలతో తయారు చేసే వంటకం) షినిజ్జల్ (మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటికి వైన్ పూసి సిద్ధం చేసే వంటకం).. ఇటాలియన్ పిజ్జా.. అమెరికా బర్గర్.. ఫ్రైడ్ చికెన్.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని వంటకాల్ని సిద్ధం చేస్తున్నారు.
ఈ నెల 14న వరంగల్ కు వచ్చే ప్రపంచ సుందరీమణుల టీంలోని కొందరికి డిన్నర్ లో భాగంగా వడ్డించే వంటకాల మెనూ. వీరికి వడ్డించే వంటకాల్ని తయారు చేసేందుకు వీలుగా ఐరోపా.. అమెరికాతో పాటు దేశంలోని పేరొందిన చెఫ్ లను పిలిపిస్తున్నారు. తెలంగాణ టూరిజం శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వీరి పర్యటన నేపథ్యంలో రామప్పలో పేరిణి ప్రదర్శన.. అతిధులను ఆకర్షించేలా లైటింగ్ తో పాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ మూడు ప్రాంతాల చారిత్రక.. సాంస్క్రతిక గొప్పదనాన్ని వివరించేందుకు వీలుగా ఇంగ్లిషు.. ఫ్రెంచ్.. జర్మన్.. ఇటాలియన్ భాషలు మాట్లాడే పది మంది గైడ్ లను కూడా నియమిస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.