మరో సారి MH370 కోసం వెతుకులాట.. ఈ సారి ఎలా శోధించబోతున్నారంటే?
MH370 కథలో అత్యంత కలవరపరిచే అంశం, అదృశ్యమైన వేగం. బీజింగ్ వైపు ప్రయాణం మొదలై కేవలం 40 నిమిషాల్లోనే విమానం రాడార్ నుంచి కనుమరుగైంది.;
ప్రపంచ విమానయాన చరిత్రలో అతి పెద్ద రహస్యం MH370 అదృశ్యం. 2014, మార్చి 8 ఉదయం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వైపు బయల్దేరిన బోయింగ్ 777 విమానం ఆకాశంలో కలిసిపోయిన రోజు నుంచి, దాని కథ ఒక బాధాకరమైన మిస్టరీగా మారిపోయింది. 239 మంది ప్రాణాలు ఒక్క క్షణంలో గుర్తుతెలియని శూన్యంలో కలసిపోయాయి. కుటుంబాలకు కన్నీళ్లు, ప్రపంచానికి ప్రశ్నలు, ప్రభుత్వాలకు అవమానం. 11 ఏళ్లు గడిచినా ఈ ప్రశ్న ఒక్కదానికైనా పూర్తి సమాధానం దొరకలేదు. ‘విమానం ఎక్కడికి పోయింది?’ ఇప్పుడు మలేషియా మరోసారి శోధన ప్రారంభించనున్నట్లు ప్రకటించడంతో, ఈ రహస్యం ఎప్పటికైనా వీడుతుందా? అన్న ఆశ తిరిగి చిగురించింది.
కలవరపరిచే అంశం..
MH370 కథలో అత్యంత కలవరపరిచే అంశం, అదృశ్యమైన వేగం. బీజింగ్ వైపు ప్రయాణం మొదలై కేవలం 40 నిమిషాల్లోనే విమానం రాడార్ నుంచి కనుమరుగైంది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా చివరిసారిగా చేసిన రేడియో మెసేజ్ ‘గుడ్ నైట్, మలేషియన్ త్రీ సెవెన్ జీరో’ రెండు దేశాల రాడార్ల మధ్య గ్యాప్‌లో మాయమైంది. కొద్ది నిమిషాలకే ట్రాన్స్‌పాండర్ ఆఫ్ అయింది. విమానం తిరిగి పశ్చిమ దిశగా తిరిగింది. అండమాన్ సముద్రం మీదుగా దక్షిణ దిశగా సాగే ఒక భయానక మార్గం రాడార్ డేటాలో కనిపించింది. ఆ తర్వాత? శూన్యం ఆవహించింది.
ఇది భారీ ఆపరేషన్..
MH370 ఎక్కడుందో కనుగొనేందుకు చాలా పరిశోధనలు జరిగాయి. ఇది ప్రపంచం ఎన్నడూ చూడని భారీ ఆపరేషన్. 120,000 చదరపు కిలోమీటర్ల సముద్రాన్ని ఆస్ట్రేలియా, చైనా, మలేషియా, ఇండియా, అమెరికా, జపాన్, సింగపూర్ తదితర దేశాలు కలిసి శోధించాయి. బిలియన్ల రూపాయలు ఖర్చుపెట్టాయి. అయినా దొరికింది ఒక్క రెక్క ముక్క (ఫ్లాపెరాన్) మాత్రమే, కొన్ని అనుమానాస్పద వస్తువులు మాత్రమే. అవి కూడా అసలు విమానం ప్రయాణికులవా అన్నది నిర్ధారణ కాలేదు. ఈ పరిస్థితుల్లో 2017లో సెర్చ్ ఆపరేషన్ నిలిపేశారు. నిశ్శబ్దం మొదలైంది.. బాధే మిగిలింది.
పైలట్ సూసైడ్ పై అనుమానాలు..
సమయం గడుస్తున్నా కొద్ది చర్చలు మొదలయ్యాయి. పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఒక వాదన. హైజాక్ అయ్యిందన్న మరో వాదన. టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల విమానం దక్షిణ సముద్రంలో కుప్పకూలిందని ఓ అంచనా. కానీ ఏ సిద్ధాంతానికి స్పష్టమైన ఆధారాలు లేవు. అందుకే MH370 ప్రపంచానికి పెద్ద రహస్యంగా మిగిలిపోయింది.
ఫ్యామిలీల కోణంలో చూస్తే ఈ ఘటన ఒక ముగియని దుఃఖం. విమానంలోని 239 మందిజ తల్లిదండ్రులు, పిల్లలు, జీవిత భాగస్వాములు, బంధువులు ఇప్పటికీ ‘ఏమైంది?’ అనేదానికి సమాధానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మృతదేహాలు లేవు. అంత్యక్రియలు లేవు. ఒక చుక్క కనీసం ఆధారం లేదు. వాళ్ల జీవితం ‘గతం’ నుంచి ముందుకు రాలేదు. మరోసారి శోధన మొదలవుతుందన్న వార్త వాళ్లకు కొంత ఆశ ఇచ్చింది. ఈ ‘ఔనో–కాదో’ అనుమానాల దశాబ్దానికి ఇది ఒక చిన్న వెలుగురేఖ.
ఓషియన్ ఇన్ఫినిటీ శోధన..
ఇప్పుడు మలేషియా ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం మళ్లీ అందరి దృష్టిని ఈ విమానం వైపు తిప్పింది. డిసెంబర్ 30 నుంచి అమెరికాకు చెందిన సముద్ర అన్వేషణ సంస్థ ఓషియన్ ఇన్ఫినిటీ (Ocean Infinity) మళ్లీ శోధన ప్రారంభిస్తోంది. ఈ సంస్థ అత్యాధునిక రోబోటిక్ సబ్‌మెరిన్లతో మరింత లోతైన ప్రాంతాలను పరిశీలించనుంది. 2018లో కూడా వీరు అన్వేషించారు. కానీ ఈసారి టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. కొత్త డేటా, కొత్త పద్ధతులు, కొత్త దృష్టికోణం ఇవన్నీ కలిసి శోధనను భిన్నంగా మార్చనున్నాయి.
ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. 11 సంవత్సరాల రహస్యం ఇప్పుడు పరిష్కారం అవుతుందా? దాదాపు 4–5 కిలోమీటర్ల లోతైన హిందూ మహాసముద్రం ఇప్పటికీ ఒక అంధకారపు లేబిరింత్ లాంటి ప్రదేశం. విమానం పూర్తిగా సముద్రంలో కలిసిపోయి ఉండొచ్చు. శకలాలు వేరుపడిపోయి ఉండొచ్చు. అయినా కూడా ప్రపంచం ఇంకా ఈ విమానం కోసం శోధించడం వదల్లేదు. ఎందుకంటే ఇది కేవలం ఒక విమానం కథ కాదు.. ఇది 239 మంది ప్రాణాల కథ. 239 కుటుంబాల కథ. నిజం తెలిసే వరకు ముగింపే లేదు.
ఈ సారి విజయవంతం కావాలని ఆశిద్దాం..
ఈ సారి అన్వేషణ విజయవంతం అయితే, విమానయాన చరిత్రలోనే అతి పెద్ద రహస్యానికి ముగింపు లభిస్తుంది. విజయం దొరకకపోతే? MH370 మిస్టరీ మరొక దశాబ్దం ప్రపంచాన్ని వెంటాడుతుంది. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఈ ప్రపంచం MH370 నిజం కనుగొనడం కోసం ఇంకా ఎన్నాళ్లైనా వేచి చూడడానికి సిద్ధంగా ఉంది.