ప్రతి ఏటా భూమిలోకి కుంగిపోతున్న అతిపెద్ద నగరం.. నాసా డేటాలో విస్తుపోయే నిజాలు!
అది ఒక మహానగరం తన ఉనికిని కాపాడుకునేందుకు ఏకంగా భూమితోనే యుద్ధం చేస్తుంది.;
అది ఒక మహానగరం తన ఉనికిని కాపాడుకునేందుకు ఏకంగా భూమితోనే యుద్ధం చేస్తుంది. భూమితో యుద్ధం అంటే కొంత వింతగా ఉన్నా.. మెక్సికో నగరం ఎదుర్కొంటున్నది మాత్రం అత్యంత భయంకరమైన వాస్తవం. 2.2 కోట్ల జనాభా నివసిస్తున్న ఈ నగరం, తన పునాదుల్లోనే ఉన్న బలహీనత కారణంగా ఇప్పుడు వినాశనం వైపు అడుగులు వేస్తోంది.
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా గుర్తింపు సంపాదించకున్న మెక్సికో ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి బలికానుంది. నాసా ఉపగ్రహ డేటా విశ్లేషణ ప్రకారం., ఈ నగరం ఏటా సుమారు 10 అంగుళాల (25 సెం.మీ) మేర భూమిలోకి కుంగిపోతుంది. అంతరిక్షం నుంచి కూడా ఈ నగరం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు, మానవాళి ప్రకృతి వనరులను ఎంత దారుణంగా వినియోగిస్తున్నాయో చాటిచెబుతున్నాయి.
పునాదుల్లోనే అసలు రహస్యం..
మెక్సికో నగరం కుంగిపోవడానికి ప్రధాన కారణం అది నిర్మించబడిన ప్రదేశం. సుమారు 3,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నగరం, ఒక ప్రాచీన సరస్సు అడుగున ఉన్న మెత్తటి మట్టిపై నిర్మితమైంది. శతాబ్దాల క్రితం ఇక్కడ వీధులు కాలువలుగా ఉండేవంటే ఆ మట్టి ఎంతటి నీటి స్వభావాన్ని కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చు. మట్టి నైజం వల్ల నగరం ఎప్పుడూ కాస్త నేలలోకి కుంగిపోతూనే ఉండేది.
భూగర్భ జలాల విచ్చలవిడి వినియోగం
వందేళ్లుగా పెరుగుతున్న జనాభా అవసరాలు ఈ సమస్యను మరింత తీవ్రం చేశాయి. నగర అవసరాల కోసం భూగర్భ జలాలను విపరీతంగా తోడడంతో, భూమి పొరల్లోని నీటి నిల్వలు కుంచించుకుపోయాయి. నీరు ఖాళీ అయిన ప్రదేశాల్లో నేల గట్టిపడడంతో, నగరం కుంగే వేగం గణనీయంగా పెరిగింది.
దెబ్బతింటున్న చారిత్రక సంపద
అసమానంగా కుంగిపోవడం వల్ల నగరం భౌతిక రూపురేఖలు మారుతున్నాయి. 1573లో నిర్మించిన సుప్రసిద్ధ 'మెట్రోపాలిటన్ కేథడ్రల్' ఇప్పటికే ఒక పక్కకు వంగిపోయి పతనావస్థకు చేరుకుంది. భవనాలు సైతం పగుళ్లతో నిండిపోవడమే కాకుండా, భూగర్భంలో ఉన్న డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు సబ్వే నెట్‌వర్క్ ఒత్తిడికి ధ్వంసం అవుతున్నాయి.
నీటితో యుద్ధమేనా?
మెక్సికో నేషనల్ అటానమస్ యూనివర్సిటీ పరిశోధకుడు ఎన్రిక్ క్యాబ్రల్ ఈ విషయంపై ఇప్పటికే హెచ్చరించారు. ఇది కేవలం మౌలిక వసతుల సమస్య మాత్రమే కాదు.. మనుగడకు సంబంధించినది కూడా.. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడుతుంది. నీటి నిర్వహణలో తక్షణ మార్పులు చేయకపోతే, ఈ నగరం తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది.
మెక్సికో నగరం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ప్రపంచంలోని ఇతర నగరాలకు ఒక హెచ్చరిక. ప్రకృతి వనరులను, ముఖ్యంగా భూగర్భ జలాలను ఇష్టానుసారంగా వినియోగిస్తే భవిష్యత్తులో కలిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో నిరూపిస్తోంది.