నాకు-కాంగ్రెస్ నేతలకు మధ్య గ్యాప్‌లేదు: మీనాక్షి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పార్టీ నేతలకు.. తనకు మధ్య రాజకీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎలాంటి గ్యాప్ లేదన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పార్టీ నేతలకు.. తనకు మధ్య రాజకీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎలాంటి గ్యాప్ లేదన్నారు. ఎలాంటి వివాదం కూడా లేదని తెలిపారు. ప్రస్తుతం తనపైనా.. పార్టీ నాయకులపైనా జరుగుతున్నవి బీజేపీ కుట్రలేనని తెలిపారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరఫున మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ లోని పాలమూరులో ఆమెపై కేసు ఉందని, దీనిని పేర్కొనలేదనే ఆరోపిస్తూ.. నామినేషన్‌ను తిరస్కరించారు.
దీనిపై నటరాజన్ సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాటం చేశారు. కానీ, ఫలించలేదు. అయితే.. మధ్యప్రదేశ్‌లోని ఎన్నికల అదికారులకు తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులే కొందరు.. మీనాక్షిపై ఫిర్యాదులు చేశారని.. వారు ఇచ్చిన సమాచారంతోనే మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీలో పదవులు ఆశించిన వారు.. మీనాక్షి వైఖరితో విసిగిపోయి.. ఆమెపై ఇలా ఉప్పందించారని కూడా కొందరు నేతలు చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలపై తాజాగా స్పందించిన మీనాక్షి.. తనపై కాంగ్రెస్ నేతలు ఎవరూ ఫిర్యాదులు చేయలేదన్నారు.
బీజేపీ చెబుతున్నవన్నీ కట్టుకథలని.. కాంగ్రెస్ నేతలకు, తనకు మధ్య ఎలాంటి రాజకీయ పరమైన గ్యాప్ లేదన్నారు. తనపై ఎవరికీ కోపం లేదన్నారు. మధ్యప్రదేశ్‌తన సొంత రాష్ట్రమని.. అక్కడి నుంచి పోటీ చేసి.. రాజ్యసభలో అడుగు పెట్టాలన్నదే తన అభిలాష అని పేర్కొన్నారు. తెలంగాణలోనే కాదు.. మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులే తనపై కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘాన్ని వాడుకుని కుట్రలు చేశారని ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందన్న ఆమె.. దీనికి బీజేపీనే కారణమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ నుంచి ఎవరినైనా రాజీనామా చేయించి.. ఆ స్థానంలో మీనాక్షిని తిరిగి రాజ్యసభకు పంపిస్తామని కొందరు చేస్తున్న ప్రచారాన్ని మీనాక్షి ఖండించారు. ఆ వాదనలో పసలేదన్నారు. ఇప్పటికే రాజ్యసభ సీట్లు పూర్తయ్యాయని, తన కోసం ఎవరూ రాజీనామా చేయాలనితాను కోరుకోవడం లేదన్నారు. జరిగిన దానిలో బాధ ఉన్నా.. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం జరుగుతుందన్నారు. తాను ఎప్పటికైనా మధ్య ప్రదేశ్ నుంచే రాజ్యసభలో అడుగు పెడతానని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎవరికీ అన్యాయం చేయనని ఆమె చెప్పడం గమనార్హం.