హైవేలపై కనిపించే మైలురాళ్ల రంగుల అర్థం ఏంటో తెలుసా?
చాలా రహదారులపై మీరు యెల్లో మైల్ స్టోన్ ని చూసి ఉంటారు. ఇది కేవలం జాతీయ రహదారులపై మాత్రమే కనిపిస్తుంది.;
ప్రతి రోజూ మనకు ఎన్నో కొత్త విషయాలు కనిపిస్తూనే ఉంటాయి. కొన్నింటిని మనం అస్సలు పట్టించుకోము. అయితే వాటి గురించి తెలిసినప్పుడు.. "ఇంతకు ముందు ఎందుకు గమనించలేదా అని ఆశ్చర్యపోతాము. మీరు ఎప్పుడైనా హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు పక్కన వేర్వేరు రంగుల రాళ్లను చూసే ఉంటారు. ఈ రాళ్లపై వివిధ వివరాలు రాసి ఉంటాయి. వీటినే మైలురాళ్లు అంటారు. అయితే ఈ రంగులకు అర్థం ఏమిటో తెలుసా.. ప్రతి రంగుకు ఓ అర్థం ఉంటుంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
యెల్లో మైల్ స్టోన్
చాలా రహదారులపై మీరు యెల్లో మైల్ స్టోన్ ని చూసి ఉంటారు. ఇది కేవలం జాతీయ రహదారులపై మాత్రమే కనిపిస్తుంది. ఇవి ఉంటే మీరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారని దీని అర్థం. ఈ రహదారులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. వీటి నిర్మాణం, మెయింటెనెన్స్ బాధ్యత నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉంటుంది.
బ్లాక్ లేదా వైట్ మైల్ స్టోన్
మీరు ఏదైనా పెద్ద నగరం లేదా జిల్లాలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ బ్లాక్ లేదా వైట్ కలర్ మైల్ స్టోన్స్ కనిపిస్తుంటాయి. ఈ రోడ్ల మెయింటెనెన్స్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటుంది.
గ్రీన్ కలర్ మైల్ స్టోన్
ఆకుపచ్చ రంగు మైలురాళ్ల మెయింటెనెన్స్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ రకమైన హైవేలు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లడానికి ఉపయోగపడతాయి. ఈ హైవేలో ఏదైనా సమస్య ఉంటే దానిని సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.
ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్
ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్ గ్రామాలలో కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ఈ కలర్ మైల్ స్టోన్ చూస్తారు. ఈ కలర్ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వేసిన రోడ్లను సూచిస్తుంది.