చంద్రబాబు, వైఎస్ అంత మంచి స్నేహితులా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల పొలిటికల్ జర్నీని ఈ సిరీస్‌లో చూపించారు.;
ఈ వారం థియేటర్లలో చెప్పుకోదగ్గ చిత్రాలేవీ రిలీజ్ కావట్లేదు. వచ్చే వారం వార్-2, కూలీ లాంటి భారీ చిత్రాలు రిలీజవుతుండడం.. ఈ వారం బాక్సాఫీస్‌ను ఖాళీగా వదిలేశారు. ఐతే ఇదే సమయంలో ఒక ఆసక్తికర వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని ప్రోమోలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఆ సిరీసే.. మయసభ. ప్రముఖ దర్వకుడు దేవాకట్టా రచన, దర్శకత్వంలో తెరకెక్కిన సిరీస్ ఇది. కిరణ్ జై కుమార్ అనే మరో దర్శకుడు కూడా దేవా కట్టాతో చేతులు కలిపాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల పొలిటికల్ జర్నీని ఈ సిరీస్‌లో చూపించారు. ఈ పాత్రలను ఆది పినిశెట్టి, చైతన్య రావు పోషించారు. ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, పరిటాల రవి, వంగవీటి రాధా, నాదెండ్ల మనోహర్ రావు.. ఇలా 70, 80, 90 దశకాల్లో చక్రం తిప్పిన అనేక మంది ముఖ్య నేతల పాత్రలు ఈ సిరీస్‌లో ఉన్నాయి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా సమతూకం పాటిస్తూ ఆయా పాత్రలకు ఎలివేషన్ ఇచ్చారు మేకర్స్.
ఐతే ఈ సిరీస్‌లో ఎక్కువ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. చంద్రబాబు, వైఎస్‌ల స్నేహం. నిజంగానే వీళ్లిద్దరూ పొలిటికల్ కెరీర్ ఆరంభంలో మిత్రులు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఐతే చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాక దారులు మారాయి. ఐతే మొదట్నుంచి ఒకరికొకరు బాగా సహకరించుకున్నట్లు.. ఒకరి వల్ల ఒకరు ఎదిగినట్లు.. వేరే పార్టీల్లోకి మారాక కూడా ఒకరికొకరు సహకరించుకున్నట్లు చూపించారీ సిరీస్‌లో. అందులో అంత వాస్తవం లేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. వైఎస్.. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అన్నట్లు చూపించడం.. చంద్రబాబుకు వైఎస్సే ఎన్టీఆర్ కూతురితో సంబంధం కుదిర్చినట్లు ప్రెజెంట్ చేయడాన్ని కూడా చాలామంది తప్పుబడుతున్నారు. కొంతమేర కల్పితాలు జోడించడం వరకు ఓకే కానీ.. ఇదంతా మరీ ఎగ్జాజరేషన్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.