ఏడాదిన్నరలో ఏపీ సర్కారు అప్పు ఎంతంటే?

ఎన్నికల వేళ ‘సంపదను సృష్టిస్తాం’ అని కచ్ఛితంగా చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులే అప్పులు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.;

Update: 2025-12-03 04:00 GMT

ఎన్నికల వేళ ‘సంపదను సృష్టిస్తాం’ అని కచ్ఛితంగా చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులే అప్పులు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. సంపదను క్రియేట్ చేయకున్నా సరే.. అప్పుల లెక్కల విషయంలో అయినా కాస్తంత కేర్ ఫుల్ గా ఉంటే బాగుంటుంది. కానీ.. అలాంటిదేమీ కనిపించని పరిస్థితి ఏపీలో నెలకొంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎడాపెడాగా అప్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన తిప్పలు తమను వెంటాడుతున్నాయని.. అందుకే వాటిని తీర్చేందుకు తాము మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందన్న మాట కూటమి నేతలు చెబుతున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణలోని రేవంత సర్కారుకు ఎదురవుతుంది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే.

అప్పులు తీసుకురాకుండా ప్రభుత్వాల్ని నడపలేని పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే.. తీసుకునే అప్పుల విషయంలోనూ కాస్తంత జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో కూటమి సర్కారు కొలువు తీరి ఏడాదిన్నర అవుతుంది. ఈ ఏడాదిన్నర వ్యవధిలో కూటమి సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా రూ.2.66 లక్షల కోట్లుగా చెబుతున్నారు.

ఇందులో బడ్జెట్ అప్పులు రూ.1.54 లక్షల కోట్లు అయితే బడ్జెటేతర అప్పులు రూ.1.11 లక్షల కోట్లుగా చెబుతున్నారు. తాజాగా మరో రూ.3వేల కోట్లు అప్పు తీసుకోవటంతో ఈ లెక్కలన్నీ బయటకు వచ్చాయి. కాగ్ గణాంకాల్ని పరిగణలోకి తీసుకుంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.81,597 కోట్లు తీసుకోవగా.. 2025-26 ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే రూ.67,283 కోట్లు అప్పు తీసుకున్నట్లుగా తేలింది. నవంబరు 4న రూ.3వేల కోట్లు అప్పు తీసుకుంటే డిసెంబరు 2న మరో రూ.3వేల కోట్లు రుణాన్ని తీసుకున్నట్లుగా ఆర్ బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అంతకంతకూ తీసుకుంటున్న అప్పుల విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇందుకింత రుణాల్ని తీసుకురావాల్సి వస్తోంది? తీసుకున్న అప్పును ఏం చేస్తున్నారు? వేటికి ఖర్చు చేస్తున్నారు? అన్నది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఇటీవల స్పందించి.. తమ ప్రభుత్వం తీసుకున్న అప్పును ఎలా ఖర్చు పెడుతున్నాం? లాంటి అంశాల్ని అందరికి అర్థమయ్యేలా వివరించటం ద్వారా విమర్శల్ని అధిగమించటంతో పాటు ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. మరి.. సీఎం చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News