రచ్చ రేపుతున్న పొలిటికల్ 'మార్కెట్' ..!
కూటమి సర్కారు ప్రకటించిన తాజా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.;
కూటమి సర్కారు ప్రకటించిన తాజా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా 30 మార్కె ట్ కమిటీ చైర్మన్ పదవులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. వీటిలో 25 పదువులను టీడీపీ దక్కించుకోగా, 4 జనసేనకు కేటాయించారు. 1 మాత్రమే బీజేపీకి ఇచ్చారు. ఇది క్షేత్రస్థాయి నాయకుల మాట ఎలా ఉన్నా.. అంతర్గతంగా మూడు పార్టీల్లోనూ కీలక నేతలు.. పెదవి విరుస్తున్నారు. పోరు పడుతున్నారు. ``మేం సిఫారసు చేసిన వారి పేర్లు కనిపించలేదు`` అని తూర్పు కు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే మీడియా ముందు వ్యాఖ్యానించారు.
ఇక, ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ, ప్రస్తుతం కీలక పొజిషన్‌లో ఉన్న నాయకుడు చేసిన సిఫారసులు కూడా.. బుట్టదాఖలయ్యాయన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటుండడంతో ఇక్కడ నాయకులు నియోజకవర్గంలో చక్రం తిప్పుతు న్నారు. ఈ క్రమంలోనే అన్నా మాకు ఏదైనా? అని అడగడంతో కీలకమైన నాలుగు స్థానాలకు సదరు నేత సిఫారసు చేశారు. అయితే.. ఆయన చెప్పిన వారిపేర్లు కూడా.. జాబితాలో కనిపించలేదు. మరోవైపు.. ఎమ్మెల్యేల సిఫారసుల్లో కొందరివి మాత్రమే తీసుకుని.. మెజారిటీ సభ్యులు పంపించిన పేర్లను చంద్రబాబు పక్కన పెట్టారన్న చర్చ కూడా సాగుతోంది.
ఏతావాతా ఎలా చూసుకున్నా.. కూటమిలోని కీలక పార్టీ టీడీపీలో నామినేటెడ్ పదవుల వ్యవహారం గతంలోనూ.. ఇప్పుడు కూడా.. చర్చకు దారితీసింది. వచ్చే స్థానిక ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని.. తమకు విలువ లేకపోతే ఎలా అని టీడీపీ తమ్ముళ్లు మూతిముడుస్తున్నారు. ఇదిలావుంటే.. జనసేనలోనూ.. కీలక నాయకులకు పదవులు దక్కడం లేదన్న చర్చ ఉంది. తాజా జాబితా ప్రకటించిన తర్వాత.. మంత్రి నాదెండ్ల మనోహర్ వద్దకు సుమారు పది మంది జనసేన నాయకులు క్యూ కట్టారు. మాకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దీనిపై ఆయన ఆలోచించి చెబుతానని.. హామీ ఇచ్చారు.
ఇక, బీజేపీ పరిస్థితి మరో విధంగా ఉంది. ఇప్పటికి మూడు సార్లు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తే.. ఒక్కసారి కూడా నలుగురికి ఇవ్వలేదన్న పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ.. ఒక్కొక్కరికి మాత్రమే పదవులు దక్కడం.. వారు అసలు ఎవరి ద్వారా ఈ పదవులు దక్కించుకుంటున్నారో కూడా తెలియకపోవడం కమల నాథుల మధ్య చర్చకు వస్తోంది. ఒక జిల్లాలో అయితే.. టీడీపీ నాయకుడికి బీజేపీ జాబితాలో పదవి ఇచ్చారని కమలం పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. మార్కెట్ కమిటీ పదవుల కేటాయింపు బాగానే ఉన్నా.. ఎక్కడొ కొడుతున్న తేడా పార్టీల మధ్య చర్చకు వస్తోంది.