180 బాలికల్ని వేధించినోడి ఇంటిపైకి బుల్డోజర్ ఆపరేషన్

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 180 మంది బాలికల్ని మోసం చేసి.. వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసినోడి పాపం పండటం తెలిసిందే.;

Update: 2026-04-16 05:33 GMT

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 180 మంది బాలికల్ని మోసం చేసి.. వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసినోడి పాపం పండటం తెలిసిందే. ప్రేమ పేరుతో వల విసిరి.. అనంతరం వారిని లవ్ లోకి దించి.. లైంగిక వేధింపులతో పాటు.. బ్లాక్ మొయిల్ చర్యలకు పాల్పడుతూ ఎంతోమంది అమ్మాయిల జీవితాల్ని నరకప్రాయంగా మార్చాడు. వీడి ఉదంతం బయటకు రావటం.. వాటిపై చర్యలకు బీజేపీ ఎంపీ పట్టుబట్టటం తెలిసిందే. దీంతో.. అతడిపై చర్యలు చేపట్టిన అధికారులు.. అక్రమంగా కట్టిన అతగాడి ఇంటిపై సర్జికల్ స్ట్రైక్ చేపట్టారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

మహారాష్ట్రకు చెందిన తన్వీర్ అమాయక బాలికల్ని లక్ష్యంగా చేసుకునేవాడు. ప్రేమ పేరుతో తియ్యటి కబుర్లు చెప్పేవాడు. అతడి మాటల్ని నమ్మినోళ్లను నిలువుగా ముంచేసేవాడు. అంతేకాదు.. వారిని లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. అలా 180 మంది బాలికలను వేధింపులకు గురి చేశాడు. అతడి మాయమాటల్ని నమ్మిన బాలికల్ని ముంబయి.. ఫుణెలకు తీసుకెళ్లి వారిపై లైంగిక దాడులకు పాల్పడేవాడు. ఆ సందర్భంగా తీసే వీడియోలతో బ్లాక్ మొయిల్ చేసేవాడు. ఇది సరిపోదన్నట్లు.. కొందరి వీడియోలాను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి.. బ్లాక్ మొయిల్ చేసేవాడు. ఈ ఉదంతంపై కొందరు బాధిత బాలికల కుటుంబాల వారు.. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరిన సందర్భంలో స్థానిక బీజేపీ ఎంపీ స్పందించారు.

దీంతో.. పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన ఆయన. ఈ మాయగాడి మీద చర్యలు తీసుకోవాలన్నారు. వాడికి తగిన శాస్తి చేయకుంటే తాను నిరసనను చేపడతానని పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు. దీంతో స్పందించిన అధికారులు చర్యల్ని వేగవంతంగా చేశారు. అదే సమయంలో ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు బయటకు రావటంతో సంచలనంగా మారాయి. మీడియాలో.. సోషల్ మీడియాలో సదరు వ్యక్తి చేసిన దారుణాలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అతడికి తీవ్ర శిక్ష విధించాలన్న డిమాండ్ పెరిగింది.

ఇలాంటి వేళ.. మహారాష్ట్ర ప్రభుత్వం అతడి ఇంటిపై బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టింది. అతడి ఇంటికి సమీపంలోని అక్రమ కట్టడాలను సైతం స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఈ ‘సర్జికల్ స్ట్రైక్’ను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పర్యవేక్షణలో జరగటం గమనార్హం. అయితే.. అక్రమ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ గతంలోనే నిందితుడి కుటుంబానికి నోటీసులు జారీ చేయగా.. ఇంతవరకు స్పందించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలు చేపట్టినట్లు చెబుతున్నారు. అమాయక బాలికల కన్నీళ్లకు.. వేదనకు కారణమైనోడికి తగిన శాస్తి జరిగినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News