ముఖ్యమంత్రిగా మల్లారెడ్డి..!! మనసులో మాట బయటపెట్టిన మాజీ మంత్రి

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనసులో మాట బయపెట్టారు. శాసనసభ లాబీల్లో మీడియా చిట్ చాట్ లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.;

Update: 2026-03-23 13:30 GMT

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి తన మనసులో మాట బయపెట్టారు. శాసనసభ లాబీల్లో మీడియా చిట్ చాట్ లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు తనకు సినిమా అవకాశాలు వస్తే ఎలాంటి పాత్రలలో నటిస్తానన్న అంశంపైనా మల్లారెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తనను తాను సోషల్ మీడియా స్టార్ గా చెప్పుకునే మల్లారెడ్డి నిత్యం ట్రెండింగులో ఉండేలా చూసుకునేలా నడుచుకుంటుంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవకే వస్తాయని అంటున్నారు.

కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, సోషల్ మీడియాలో ఒక "ట్రెండింగ్ స్టార్"గా ఉండాలనేది మల్లారెడ్డి భావనగా చెబుతున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో "ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశానంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించి ఆశ్చర్యానికి గురిచేశారు. రెడ్డి సామాజికవర్గంలో రేవంత్ తప్ప పవర్ ఫుల్ నాయకుడు ఎవరూ లేరని రెడ్డి సంఘం సమావేశంలో తాను చెప్పానని, ఎవరు అవునన్నా, కాదన్నా నేను రేవంత్ రెడ్డి అన్నదమ్ములమేనని మల్లారెడ్డి అన్నారు.

అదేసమయంలో సినీ అవకాశాలపై మాట్లాడిన మాట్లాడిన మల్లారెడ్డి తనకు అవకాశం వస్తే ముఖ్యమంత్రి పాత్రలో నటించాలని ఉందని మనసులో మాటను బయటపెట్టారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయమని తనకు అవకాశం ఇచ్చారని, అయితే తాను తిరస్కరించినట్లు మల్లారెడ్డి వెల్లడించారు. ఇక రియల్ లైఫ్‌లో కాకపోయినా, రీల్ లైఫ్ లో ముఖ్యమంత్రి కావాలని ఉందంటూ మల్లారెడ్డి చెప్పగా, అక్కడే ఉన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చలోక్తులు విసిరి అందరినీ నవ్వించారు.

మల్లారెడ్డి వ్యాఖ్యలపై తలసాని స్పందిస్తూ ‘మల్లారెడ్డి నువ్వు విలన్ పాత్రకే సెట్ అవుతావు. నువ్వు సినిమాల్లో చేస్తే విలన్ పాత్రే చెయ్. విలన్ పాత్రకే ఎలివేషన్ ఎక్కువ’’ అంటూ హాస్యమాడారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఇటీవల మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో మల్లారెడ్డి డ్యాన్స్ చేయడం వైరల్ అయింది. మల్లారెడ్డి ఎప్పుడు మాట్లాడినా తనదైన మేనరిజమ్స్ తో మీమ్ క్రియేటర్లు, సోషల్ మీడియా యూజర్లకు వినోదాన్ని అందిస్తుంటారు.

గతంలో పాలు అమ్మినా, పూలు అమ్మినా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. మల్లారెడ్డి వీడియోలకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. దీంతో మల్లారెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారని, తన చేష్టలతో యువతను ఆకట్టుకుకోవడంతోపాటు తన విద్యాసంస్థల ప్రచారానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News