పవార్ ల మధ్య ముగిసిన వార్...బీజేపీ అలెర్ట్ !

మహారాష్ట్ర రాజకీయం అంటేనే ఎన్నో ట్విస్టులతో సాగుతూ వస్తుంది. ఈ మధ్యన చూస్తే శివసేనలో ఇద్దరు ఠాక్రే సోదరులూ ఒక్కటి అయిపోయారు.;

Update: 2026-01-10 06:30 GMT

మహారాష్ట్ర రాజకీయం అంటేనే ఎన్నో ట్విస్టులతో సాగుతూ వస్తుంది. ఈ మధ్యన చూస్తే శివసేనలో ఇద్దరు ఠాక్రే సోదరులూ ఒక్కటి అయిపోయారు. అలాగే పవర్ కుటుంబంలో విభేదాలు సమసిపోయాయి. మరాఠా యోధుడు ఎన్సీపీ వ్యవస్థాపకుడు అయిన శరద్ పవార్ తో ఆయన మేనల్లుడు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కలిసిపోయారు ఇదంతా స్థానిక ఎన్నికల పోరుతో జరుగుతున్న ముచ్చట. అయితే ఇది ఆరంభమే అని ముందు చాలా ఉండబోతోంది అన్న సంకేతాలు రావడమే ఈ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన పరిణామంగా చూడాల్సి ఉంది.

విభేదాలు లేవు :

తన నాయకత్వంలోని ఎన్సీపీకి అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి మధ్య విభేదాలు లేవని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు. పింప్రి చించ్వాడ్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కలసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకోవడంతో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని శరద్ పవార్ కుమార్తె ఎంపీ అయిన సుప్రియా సూలే కూడా స్పష్టం చేయడంతో పవార్ ల మధ్య వార్ కి ఎండ్ కార్డు పడిందని అంటున్నారు.

నాడు కత్తులు దూసుకున్నారు :

ఇదిలా ఉంటే సరిగ్గా రెండేళ్ళ క్రితం ఈ రెండు పార్టీలు కత్తులు దూసుకుని రాజకీయ రణక్షేత్రంలో ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. అలా అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో పోటీకి దిగితే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ డీలా పడింది. అయితే కాలం ఎపుడూ ఒకేలా ఉండదు కదా పైగా అంతా బంధువులు రక్త సంబంధీకులు. దాంతో ఇపుడు చేతులు కలిపారు. స్థానిక ఎన్నికలు కార్యకర్తల అభిప్రాయం అంటూ రెండు వైపుల నుంచి చెబుతున్నా బీజేపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ కొత్త ఎత్తుగడలలో భాగమే ఈ కలయిక అన్న ప్రచారం కూడా ఉంది అని అంటున్నారు.

బలాబలాలు ఇలా :

అయితే పవార్లు ఇద్దరూ కలసిపోయినా మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమికి వచ్చిన ప్రమాదం ఏదీ ఇప్పట్లో లేదు. ఎందుకంటే 2024 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా యుతి కూటమి మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ 233 స్థానాలను గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఇక ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి కేవలం 51 సీట్లు మాత్రమే దక్కాయి. ఇక మహా యుతి కూటమిలో బీజేపీకి సొంతంగానే 132 స్థానాలు దక్కాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ అయిన 145 కి కేవలం 13 సీట్ల తేడా మాత్రమే ఉంది. పైగా శివసేన (శిండే) పార్టీకి 57 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీకి 41 స్థానాలు లభించాయి.

ఈ లెక్క కనుక చూసుకుంటే మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కి ఆయన సీఎం సీటుకు వచ్చిన ఢోకా ఏమీ లేదని అంటున్నారు. కానీ ముందు ముందు మాత్రం ఎన్సీపీ ఒకటిగా మారి ప్రత్యర్థిగా అవతరిస్తే అపుడు విపక్షాల బలం పెరుగుతుంది. అది 2029 ఎన్నికల నాటికి బీజేపీకి ఎంపీ సీట్లను అధికంగా రాబట్టే విషయంలో ఇబ్బందులు తెస్తుంది అని అంటున్నారు. దాంతో పవార్ ల కలయిక మీద సయోధ్య మీద కమలం పార్టీ అలెర్ట్ గానే ఉంటోంది అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో.

Tags:    

Similar News