రూ.600 కోట్ల సామ్రాజ్యం.. రూ.30 కోట్ల 'మరక'.. విజయ్ సీఎంపోస్టు ఉంటుందా? ఊడుతుందా?
ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు రూ.30 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను విజయ్ కావాలనే తొక్కిపెట్టారంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.
కోలీవుడ్ రారాజు నుంచి రాజకీయనాయకుడిగా మారిన విజయ్ నెత్తిన ఇప్పుడు న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోందా? లేక చట్టం ముందర ఆయనకు ఊరట లభించనుందా? తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘సీఎం విజయ్ ఆస్తుల దాచివేత కేసు' ఇప్పుడు తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది. సుమారు రూ.600 కోట్ల భారీ ఆస్తులను ప్రకటించిన చోట.. మరో రూ.30 కోట్లను 'మరిచిపోవడం' ఉద్దేశపూర్వక కుట్రనా? లేక సాంకేతిక పొరపాటా? అనే కీలకమైన అంశంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆరోపణల నిప్పు.. రూ.30 కోట్ల ఆస్తుల గల్లంతు
ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు రూ.30 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను విజయ్ కావాలనే తొక్కిపెట్టారంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఈ తీవ్రమైన ఉల్లంఘన ఆధారంగా ఆయన ఎన్నికనే రద్దు చేయాలని బలంగా డిమాండ్ చేశారు. రూ.600 కోట్లను బహిరంగంగా వెల్లడించిన అభ్యర్థి ఈ రూ.30 కోట్లను ఎందుకు దాచాల్సి వచ్చింది? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది.
'సీఏ' పొరపాటా? పక్కా వ్యూహమా?
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీఎం విజయ్ తరఫు న్యాయవాదులు తమ రక్షణ గోడను నిర్మించుకున్నారు. ఏళ్ల తరబడి చిత్రపరిశ్రమలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తికి అనేక ఆర్థిక లావాదేవీలు ఉంటాయని.. ఈ వివరాలను సిద్ధం చేసే క్రమంలో ఆడిటర్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) స్థాయిలో జరిగిన పొరపాటు వల్లే ఆ వివరాలు మిస్ అయ్యాయని వాదించారు. ప్రతి అభ్యర్థి స్వయంగా కూర్చుని అఫిడవిట్ రాసుకోలేడనే అంశాన్ని కోర్టు సైతం విశ్లేషించింది. కేవలం సాంకేతిక విఫలాన్ని "ఉద్దేశపూర్వక దాచివేత"గా పరిగణించవచ్చా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైంది.
హైకోర్టు సంధించిన అసలు ప్రశ్న.. ఓటరు తీర్పు మారేనా?
ఈ కేసు విచారణలో మద్రాస్ హైకోర్టు లేవనెత్తిన ప్రధాన తార్కిక ప్రశ్న ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. "రూ.600 కోట్ల ఆస్తులను బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి.. మరో రూ.30 కోట్లను కావాలనే దాచిపెట్టాడని ఎలా నిర్ధారిస్తాం? అంతేకాకుండా రూ.600 కోట్లు ఉన్నాయని తెలిసిన తర్వాత ఓటు వేయాలని భావించిన ఓటరు, ఈ రూ.30 కోట్ల వివరాలు లేవనే కారణంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియలో వివరాల వెల్లడి వెనుక ప్రధాన ఉద్దేశం ఓటరుకు స్పష్టతనివ్వడమే అయినప్పుడు ప్రతి చిన్న పొరపాటును ఆసరాగా చేసుకుని ఒక ఎన్నికను రద్దు చేయడం చట్టబద్ధంగా సాధ్యమేనా? అన్నది కోర్టు లేవనెత్తిన ప్రధాన సందేహం.
న్యాయపరమైన ఉచ్చు దాటేనా?
అఫిడవిట్‌లో సమాచారం లేకపోవడం ఒక్కటే సరిపోదని అది "కావాలనే చేసిన కుట్ర" అని నిరూపించాల్సి ఉంటుందా? ఆ గల్లంతైన సమాచారం నిజంగానే ఓటర్ల తీర్పును ప్రభావితం చేసేంత తీవ్రమైనదా? అనే అంశాలపైనే ఇప్పుడు విజయ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
స్టార్ హీరోగా తిరుగులేని ప్రజాదరణ పొంది.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌కు ఇది అత్యంత కీలకమైన పరీక్ష. ఈ కేసు కేవలం విజయ్ వ్యక్తిగత ఆస్తుల వివాదంగా మిగిలిపోకుండా.. భవిష్యత్తులో ఎన్నికల అఫిడవిట్లలో జరిగే పొరపాట్లు.. ఉద్దేశపూర్వక దాచివేతల మధ్య గీతను గీసే ఒక సంచలన తీర్పుకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.