అమెరికా కలలకు భారీ షాక్.. హెచ్1బీ వీసాలపై ఉక్కుపాదం

ప్రస్తుతం ఉన్న అమెరికా నిబంధనల ప్రకారం హెచ్1బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలపై గరిష్ఠంగా 35,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉండేది.

Update: 2026-10-08 07:31 GMT

తరతరాలుగా సముద్రాలు దాటి.. సరిహద్దులు దాటుకొని అమెరికా వెళ్లాలనేది కోట్లాది మంది భారతీయ యువతీ యువకుల నెరవేరని.. నెరవేరే స్వప్నం. రాత్రింబవళ్ళు కష్టపడి ఐటీ చదువులు చదివి.. తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని.. "అమెరికాలో ఉద్యోగం" అనే ఏకైక లక్ష్యంతో ఎన్నో త్యాగాలు చేసి ముందుకు సాగుతారు మన దేశపు ప్రతిభావంతులు. కానీ ఇప్పుడు ఆ కలల సామ్రాజ్యానికి అనుకోని రీతిలో పెద్ద గండం వచ్చిపడింది. ప్రతి ఏటా వేలాది మంది ఇండియన్ ఐటీ నిపుణులకు ఆశాకిరణంగా నిలిచే హెచ్1బీ వీసా ప్రోగ్రామ్‌పై అమెరికా మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది.

అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ చట్టసభ సభ్యులు ఇటీవల "హెచ్1బీ వీసా ఫ్రాడ్ క్రాక్ డౌన్ యాక్ట్’’ పేరుతో ఒక సంచలనాత్మక బిల్లును ప్రవేశపెట్టారు. వీసా ప్రక్రియలో అక్రమాలకు పాల్పడే సంస్థలు, నకిలీ ఉద్యోగ ఆఫర్లు సృష్టించే బాడీ-షాపింగ్ కంపెనీలకు గట్టి బుద్ధి చెప్పడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపుదిద్దుతున్నారు. ఈ వార్త వినగానే ఎంతో మంది టెక్కీలు.. వారి కుటుంబాలు తీవ్ర కలవరానికి గురవుతున్నాయి.

రూ.2.4 కోట్ల జరిమానా.. పదేళ్ల కఠిన నిషేధం..

ప్రస్తుతం ఉన్న అమెరికా నిబంధనల ప్రకారం హెచ్1బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడే కంపెనీలపై గరిష్ఠంగా 35,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉండేది. కానీ కొత్తగా తీసుకొస్తున్న చట్టం అమల్లోకి వస్తే ఈ జరిమానా ఏకంగా 2.5 లక్షల డాలర్లకు పెరుగుతుంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2.1 కోట్ల నుండి రూ.2.4 కోట్ల వరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జరిమానాతోనే కాకుండా నిబంధనలు దాటే కంపెనీలపై నిషేధ కాలాన్ని ప్రస్తుత 3 ఏళ్ల నుంచి ఏకంగా 10 ఏళ్లకు పెంచే ప్రతిపాదన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఇంతటితో ఆగకుండా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం ఫేక్ డాక్యుమెంట్లు, తప్పుడు సమాచారం ఉపయోగించే ప్రదేశాల్లో సాధారణ ఫైన్‌లను 50,000 డాలర్ల వరకు హెచ్చరిస్తున్నారు. తప్పుడు జాబ్ ప్రొఫైల్స్, నకిలీ ఆఫర్ లెటర్లు పెట్టి ఉద్యోగులను అడ్డదారిన పంపే కొన్ని స్టాఫింగ్ కంపెనీలు చేస్తున్న తప్పుల వల్ల రాత్రింబవళ్ళు నిజాయితీగా కష్టపడే అర్హులైన నిపుణుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.

భారతీయ కుటుంబాల గుండెల్లో గుబులు

హైదరాబాద్, బెంగళూరు నుంచి సిలికాన్ వ్యాలీ వరకు భారతీయ టెక్కీలు అమెరికా ఐటీ రంగానికి వెన్నుముకగా నిలిచారు. ముఖ్యంగా భారతదేశానికి చెందిన ఐటీ సర్వీసెస్ కంపెనీలు, కన్సల్టెన్సీల ద్వారా అమెరికా వెళ్దామని ఆశపడే ఎంతోమంది మధ్యతరగతి యువకుల భవిష్యత్తుపై ఈ ప్రతిపాదిత చట్టం నీలినీడలు పరుస్తోంది. ఒకవైపు విమానమెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని తపించే యువత, మరోవైపు తమ పిల్లల భద్రత, ఉద్యోగ భరోసా కోసం ఆందోళన చెందే తల్లిదండ్రుల కళ్ళల్లో ఇప్పుడు భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

అయితే ఈ వార్త విని పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రవేశపెట్టిన బిల్లు మాత్రమే. ఇంకా చట్టంగా మారలేదు. అమెరికా చట్టసభల్లో సుదీర్ఘమైన చర్చలు, తదుపరి శాసన ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది. కానీ రాబోయే రోజుల్లో వీసా నిబంధనలు మరింత కఠినతరం కావడం ఖాయం. కష్టపడి నిజాయితీగా పనిచేసే ప్రతిభావంతులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందనే నమ్మకంతో పాటు.. ఈ కొత్త పరిణామాలను భారతీయ నిపుణులు నిశితంగా గమనిస్తూ అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.

Tags:    

Similar News