పెళ్లిలో నాన్‌వెజ్‌ విందు బ్యాన్‌.. కారణం ఇదే!

గ్రామంలో ఎప్పుడు పెళ్లి అయినా పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం వరుడి కుటుంబం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.

Update: 2026-10-08 07:14 GMT

ఇండియాలో పెళ్లి అనగానే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది విందు భోజనం అనడంలో సందేహం లేదు. పెళ్లి తంతు పూర్తి అయినా కాకున్నా టైమ్‌ కి విందు భోజనం పెట్టి వచ్చిన అతిథులను సంతృప్తి పర్చేందుకు పెళ్లి నిర్వహిస్తున్న ఇరు కుటుంబాలు చాలా ఖర్చు చేయడం మనం చూస్తూ ఉంటాం. డబ్బున్న వారు పదుల రకాల వంటకాలు ఏర్పాటు చేసి పెళ్లి విందు ఇస్తారు. అంబానీ, అదానీ రేంజ్ ధనవంతుల పెళ్లి విందుల్లో వందల రకాల మెను ఉంటుంది. మిడిల్ క్లాస్ వారు కూడా మినిమం నాన్‌ వెజ్‌తో పెళ్లి విందును ఇవ్వడం మనం ఇండియాలో చూస్తూ ఉంటాం. చాలా కుటుంబాలు పెళ్లి కోసం, పెళ్లి తర్వాత ఇవ్వాల్సిన విందు కోసం అప్పులు చేసి తిప్పలు పడ్డ ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆ పెళ్లి విందు లపై ఒక గ్రామం నిషేధం విధించింది. పెళ్లిలో నాన్‌ వెజ్ విందు ఉండకూడదు అని గ్రామ పెద్దలు తీర్మానించారు.

కర్ణాటకలోని ఒక గ్రామంలో...

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హరగి అనే గ్రామంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు పంటలు వేయలేదు, వేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. రాబోయే రెండు ఏళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, కరువు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆ ఊరు రైతులు, గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అనవసర ఖర్చులు చేయవద్దని పెద్దలు తీర్మానించారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఇచ్చే నాన్‌ వెజ్‌ విందు కార్యక్రమాలను పూర్తిగా నిషేదించారు. ఆ గ్రామంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ప్రకారం పెళ్లి జరిగిన తర్వాత వరుడి కుటుంబం పెద్ద ఎత్తున నాన్‌ వెజ్‌తో గ్రామస్తులు అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలా విందు ఏర్పాటు చేయకుంటే ఆ గ్రామంలో సదరు ఫ్యామిలీని చిన్నచూపు చూస్తారు.

పెళ్లిలో నాన్‌వెజ్ విందు బ్యాన్‌...

గ్రామంలో ఎప్పుడు పెళ్లి అయినా పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేయడం కోసం వరుడి కుటుంబం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఇక మీదట అలా జరగకూడదు అని, ఈ కరువు పరిస్థితుల్లో లక్షల రూపాయలతో వరుడి ఫ్యామిలీ ఎలా వింధు ఇస్తుందనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. కేవలం నిషేధించి వదిలి వేయకుండా ఒకవేళ వరుడు ఫ్యామిలీ నిషేధం ను ఉల్లంఘించి విందు ఏర్పాటు చేస్తే రూ.లక్ష ఫైన్‌ విధించనున్నారు. అంతే కాకుండా ఎవరైతే ఆ విందులో పాల్గొంటారో వారికి రూ.50 వేల చొప్పున ఫైన్‌ విధిస్తామని పెద్దలు తీర్మానించారు. ఈ తీర్మానం ను గ్రామంలో ఏ ఒక్కరు ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు.

కరువుతో రైతులు...

కరువు పరిస్థితుల నేపథ్యంలో గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటున్నారు. ఇప్పుడు ఉన్న రేట్ల నేపథ్యంలో నాన్‌వెజ్‌ విందుకు వరుడి కుటుంబం కనీసం పది లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత మొత్తం ఈ కరువు పరిస్థితుల్లో కచ్చితంగా అప్పుగానే వరుడి కుటుంబం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే పెద్దలు ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఊరు తీసుకున్న నిర్ణయంను అభినందిస్తున్నారు.

Tags:    

Similar News