చికిత్సకు ముందు తర్వాత.. ఫోటోలతో ప్రచారాలకు చెక్

వినూత్న మార్గాలతో రోగులను ఆకర్షించే విధానానికి పెద్దపీట వేస్తున్నారు. ఇలాంటి వేళలో.. తాజా మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

Update: 2026-10-08 09:24 GMT

చదివినంతనే సదరు ఆసుపత్రికి వెళ్లాలి. వీడియో చూసింనతనే ఫలానా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలన్న ఆసక్తిని రేకెత్తించే ప్రకటనల జోరు అంతకంతకూ పెరుగుతోంది. ‘ఈయనే ది బెస్ట్ డాక్టర్.. నా జబ్బును నయం చేశాడు’.. ‘చికిత్సకు ముందు ఇలా ఉంటే.. చికిత్స తర్వాత ఇలా మారాను’.. ‘మా వద్ద ఐవీఎఫ్ చేయించుకుంటే వందశాతం గ్యారంటీగా ఆరోగ్యకర బిడ్డ పుడుతుంది’.. ‘మా వద్ద ట్రీట్ మెంట్ చేయించుకుంటే క్యాన్సర్ నయమవుతుంది’.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఆసుపత్రులు.. పలువురు వైద్యులు తమను తాము ప్రమోట్ చేసుకునే తీరు భారీగా కనిపిస్తుంటుంది.

ఈ తరహా ప్రచారాలకు చెక్ పెడుతూ జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ఆసక్తికరంగా మారాయి. వైద్య రంగాన్ని పూర్తిగా వాణిజ్యంగా మార్చేస్తున్న పాడు రోజుల్లో .. ఈ తరహా మాయా ప్రచారాలకు చెక్ చెబుతూ ఈ తరహా ప్రచారాలకు అడ్డుకట్ట వేసేలా కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులు.. వైద్యుల నైతిక ప్రకటన.. ప్రచార సమాచార మార్గదర్శకాల పేరుతో ఒక సమగ్ర నోటీసును విడుదలైంది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది.

ఇంతకూ ఎన్ఎంసీ జారీ చేసిన మార్గదర్శకాల్లో ఏముంది? హెల్త్ కేర్ సంస్థలు తమను తాము ప్రచారం చేసుకోవటానికి అనుసరిస్తున్న పద్దతులు.. ప్రచారంతో రోగులను ఆకర్షించే తీరు ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అంతేకాదు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు.. తమ పేషెంట్ల ద్వారా తమ ఆసుపత్రి అంత పెద్దది.. ఇంత గొప్పదన్న ప్రచారం పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ హోరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. వినూత్న మార్గాలతో రోగులను ఆకర్షించే విధానానికి పెద్దపీట వేస్తున్నారు. ఇలాంటి వేళలో.. తాజా మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

- రోగుల చికిత్సకు ముందు చికిత్స తర్వాత ఉంటే ఫోటోలు.. సర్జరీ వీడియోలు.. స్కాన్ రిపోర్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదు.

- ఇతను అత్యుత్తమ వైద్యుడు.. నెంబర్ వన్ డాక్టర్.. నా జబ్బు ఎంత త్వరగా నయమైందో తెలుసా? అంటూ రోగుల చేత వీడియోలు.. రివ్యూలు ఇకపై చెప్పించకూడదు.

- రోగుల ప్రశంసలు.. రివ్యులను ప్రమోషన్ కోసం వినియోగించకూడదు.

- ప్రముఖులు.. సోషల్ మీడియా ఇన్ల్పుయెన్సర్లతో పెయిడ్ ప్రమోషన్లు చేయించటం తాజాగా జారీ చేసిన నిబంధనలకు విరుద్ధం.

- డీప్ ఫేక్.. ఏఐ సాయంతో క్రియేట్ చేసిన ప్రచార చిత్రాలు.. వీడియోలపై బ్యాన్

- మా వద్ద ఫలానా ఆరోగ్య సమస్యకు 100 శాతం ఫలితం ఖాయం లాంటి అతిశయోక్తులను క్లెయిమ్ చేయకూడదు.

- రోగి తనకు తానుగా వైద్యుల గురించి.. ఆసుపత్రుల గురించి గొప్పలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా.. అలాంటి ప్రచారాలు ఇకపై చెల్లవు. వైద్యులు కేవలం తమ విద్యార్హతలు.. సంప్రదింపుల సమయాలు.. సాధారణ ఆరోగ్య అవగాహన అంశాలపైన మాత్రమే సమాచారం ఇవ్వాలి.

- సోషల్ మీడియాలోనూ తమ అర్హతకు సంబంధించిన సమాచారాన్ని కేవలం అవగాహన పెంచేలా ఇవ్వొచ్చు.

ఇంతకూ ఈ మార్గదర్శకాలు ఎందుకు విడుదలయ్యాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. సుప్రీంకోర్టులో దాఖలైన ఒక కేసు విషయంలో జాతీయ వైద్య మండలి తాజాగా కఠిన మార్గదర్శకాల్ని జారీ చేసినట్లుగా చెబుతున్నారు. 2023లో సుప్రీంకోర్టులో నమోదైన కేసు.. తాజా మార్పునకు కారణంగా చెబుతున్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం లిమిటెడ్ ఆఫర్.. ఉచిత ఓపీడీ కన్సల్టేషన్.. డయాగ్రస్టిక్ టెస్టులపై క్యాష్ బ్యాక్.. ఇలా వ్యాపార కోణంలో చేసే ప్రచారాలకు చెక్ చెప్పారు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైద్య వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు.. రోగుల ఆరోగ్య ప్రయోజనాల మేరకు తాజా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇదంతా బాగానే ఉంది. ఎవరైనా వైద్యులు ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?తాజా మార్గదర్శకాల నేపథ్యంలో చట్టంలో ఏం చెబుతుంది? అన్న విషయంలోకి వెళితే.. మార్గదర్శకాల్ని ఉల్లంఘించే వైద్యులపై కఠినచర్యలు ఉండనున్నాయి. నిబంధనల్ని ఉల్లంఘించిన తీవ్రత ఆధారంగా వారి లైసెన్స్ ను మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు సస్పెండ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News