మధ్యప్రదేశ్ సర్కారు చేసిన పని తెలుగు రాష్ట్రాల్లో చేయలేమా?

తాజాగా ఉజ్జయిని.. ఓంకారేశ్వర్.. మహేశ్వర్.. మైహర్ సహా 19 పుణ్యక్షేత్రాల్లో మతపరమైన ప్రాంతాల్లో మద్యనిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.;

Update: 2025-04-02 04:01 GMT

‘మద్యపాన నిషేధం’ లాంటి నిర్ణయాలు చెప్పేందుకు.. మాట్లాడుకునేందుకు బాగానే ఉంటాయి కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాదు. అయితే.. ఈ నిర్ణయాన్ని అన్ని చోట్ల కాకున్నా.. పుణ్యక్షేత్రాలున్న ప్రాంతాల్లో కఠినంగా అమలు చేయటంలో తప్పు లేదు. కానీ.. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పెద్దగా ఫోకస్ చేసింది లేదు. తిరుమల లాంటి వేళ్ల మీద లెక్కించే పుణ్యక్షేత్రాల్లో మాత్రమే మద్యపాన నిషేధం మీద బ్యాన్ ఉంది. కానీ.. మిగిలిన పుణ్యక్షేత్రాల్లో అలాంటి పరిస్థితి లేదు.

దీనికి భిన్నంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మద్య నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉజ్జయిని.. ఓంకారేశ్వర్.. మహేశ్వర్.. మైహర్ సహా 19 పుణ్యక్షేత్రాల్లో మతపరమైన ప్రాంతాల్లో మద్యనిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మద్య నిషేధ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు.

ఈ జనవరి 24న జరిగిన మంత్రిమండలి భేటీలో ఆమోద ముద్ర వేశారు. ఈ నిర్ణయం ప్రకారం మధ్యప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాలున్న ఉజ్జయిని.. ఓంకారేశ్వర్.. మహేశ్వర్.. ముండలేశ్వర్.. మైహర్ తదితర నగరాలు.. పట్టణాల పరిధితో పాటు ఎంపిక చేసిన గ్రామ పంచాయితీల పరిధిలో మద్యం దుకాలు.. బార్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాదిరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అతి పెద్ద పుణ్యక్షేత్రాల్లో మద్య నిషేధాన్ని అమలు చేసే దిశగా ఎందుకు ఆలోచన చేయకూడదు?

తెలంగాణలో భద్రాచలం.. యాదాద్రి.. కొమురవెల్లి.. కొండగట్టు.. బాసర.. లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. ఏపీలోని అరసవెల్లి.. అన్నవరం.. శ్రీకాళహస్తి.. తిరుపతి.. శ్రీశైలం.. మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాల్లో మద్యనిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తే నష్టమేంటి? అన్నది ప్రశ్న. మద్యం సేవించాలనుకునే వారు.. ఆ పుణ్యక్షేత్రాలకు బయట ఉన్న ప్రాంతాలకు వెళ్లి తమ అవసరాల్ని తీర్చుకుంటారు. అదే సమయంలో పుణ్యక్షేత్రాల పవిత్రను కాపాడేందుకు వీలు కలుగుతుంది.

Tags:    

Similar News