అతిధిని అవమానించటమా? అగ్రరాజ్యం బలుపుపై విమర్శలు

అమెరికా అధ్యక్షుడు వస్తున్న కారణంగా.. ఆయన వాహన శ్రేణి రావటానికి కాస్త ముందుగా రోడ్డు మీద ఎవరిని ఎక్కడకు కదలకుండా అలా ఫ్రీజ్ చేసిన ఉదంతం చోటు చేసుకుంది.;

Update: 2025-09-24 06:15 GMT

అగ్రరాజ్య అహంకారం.. అగ్రరాజ్య బలుపు.. ఇలాంటి మాటలు చదివినప్పుడు అంతలా అమెరికా మీద వ్యతిరేకత ఎందుకు? ఊరికే అమెరికా మీద ఆడిపోసుకుంటారు? లాంటి వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి.అయితే.. అగ్రరాజ్యమనే అహంకారం ఆ దేశ నరనరాన ఎంతలా ఉంటుందన్న విషయాన్ని కొందరు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు.. అదో రొదలా ఉంటుందే తప్పించి.. అమెరికాను అంతలా తప్పు పట్టటాన్ని చాలామంది ఇష్టపడరు. తాజాగా ఆ అహంకారం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా కనిపించే సన్నివేశం అమెరికాలోనే చోటు చేసుకుంది.

అమెరికా అధ్యక్షుడు వస్తున్న కారణంగా.. ఆయన వాహన శ్రేణి రావటానికి కాస్త ముందుగా రోడ్డు మీద ఎవరిని ఎక్కడకు కదలకుండా అలా ఫ్రీజ్ చేసిన ఉదంతం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సామాన్యులు మాత్రమే కాదు.. ఆ దేశానికి అతిధిగా.. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు సైతం రోడ్డు మీద నిలబడిపోయిన వైనం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ.. ఇలాంటి అనుభవమే ట్రంప్ కు ఎదురై ఉంటే? సదరు దేశం మీద ఎలాంటి చర్యలు తీసుకొని ఉండేవారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు.

ఇంతకూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఒక దేశాధ్యక్షుడ్ని రోడ్డు మీద పోలీసు ఆపేసిన వేళ.. ఆయన ఎలా వ్యవహరించారు? ఆయన స్పందన ఏమిటి? అన్నది ఆసక్తికకరం. ఒక స్థాయి నేతను ఎవరైనా పోలీసు కానిస్టేబుల్ ఆపితే.. సదరు నేత ఎంతలా రియాక్టు అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది మరో దేశాధ్యక్షుడి హోదాలో ఉండి.. రోడ్డు మీద అలా నిలుచొని ట్రంప్ వాహన శ్రేణి కోసం వెయిట్ చేయాల్సిన ఇబ్బందికర పరిస్థితుల్లో మెక్రాన్ ఎలా రియాక్టు అయ్యారన్నది కూడా ముఖ్యమే. ఇంతకూ అలాంటి పరిస్థితి ఎలా ఏర్పడిందన్న విషయంలోకి వెళితే..

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఐక్యరాజ్య సమితి నిర్వహణ కోసం అత్యధిక నిధులు కేటాయించే దేశం కూడా అగ్రరాజ్యమేనన్న విషయం తెలిసిందే. ఈ కారణంతో ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడికి ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఆయన ఐక్యరాజ్య సమితిని సందర్శించటానికి వచ్చిన సందర్భంలో రోడ్డు మీద ఉన్న వాహనాల్ని ఎక్కడికక్కడ ఫ్రీజ్ చేస్తారు. అడుగు కూడా ముందుకు వేయనివ్వరు.

ఈ ఫ్రీజ్ లో ఇరుక్కున్న వ్యక్తి ఎంతటి వాడైనప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేసే అవకాశం ఉండదు. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ వచ్చారు. వాహనాల్ని వదిలేసి సాదాసీదాగా తన అనుచర గణంతో రోడ్డు దాటే వేళలో మెక్రాన్ ను అమెరికా పోలీసు ఆపేశారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు ట్రంప్ వస్తున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘సారీ ప్రెసిడెంట్. ప్రతిదీ స్తంభించిపోయింది. ఇప్పుడొక వాహన శ్రేణి వస్తోంది. ప్లీజ్ అర్థం చేసుకోండి’ అంటూ అధ్యక్షుడి కాన్వాయ్ వస్తున్న విషయాన్ని తెలపకుండానే ఆయన విషయాన్ని చెప్పేశారు.

తాను ఫ్రాన్స్ ఎంబసీకి వెళ్లాల్సి ఉందని చెప్పినా.. సదరు పోలీసు తానేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా చెబుతూ.. వారందరిని ఆపేశారు. దీంతో.. విషయాన్ని అర్థం చేసుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నేరుగా ఫోన్ చేశారు. ‘మీ కోసం ఇక్కడ ప్రతిదీ స్తంభించిందిపోయింది తెలుసా’ అంటూ బిగ్గరగా నవ్వుతూ మాట్లాడిన సందర్భాన్ని అక్కడున్న వాళ్లు వీడియోగా తీశారు. ఇది కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టెలిఫోన్ సంభాషణ ఇరు దేశాల నేతలూ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నట్లుగా ఫ్రాన్స్ అధికార వర్గాలు తెలియజేశాయి. ఒక దేశాధ్యక్షుడు.. తమ దేశానికి అతిధిగా వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న సోయి లేకపోవటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అమెరికా అధ్యక్ష హోదాలో ఉన్న వారెవరూ.. మెక్రాన్ మాదిరి సింఫుల్ గా ఉండరు. కాబట్టి వారికి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కావన్న మాట కొందరు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి గౌరవాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఆ దేశానికి వచ్చిన వేరే దేశ అధ్యక్షుడు/ప్రధాని గౌరవ మర్యాదలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా అగ్రరాజ్యం మీద ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Tags:    

Similar News