పాతికేళ్ల పెద్దదైన బ్రిగెట్టాతో మెక్రాన్ లవ్ స్టోరీ ఎలా మొదలైంది?
ఇలాంటివి ప్రేమ ఉదంతాలు మన దేశంలో చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి. అందునా.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారి ప్రేమకథలు చాలా చాలా తక్కువగా వినిపిస్తుంటాయి.;
ఇలాంటివి ప్రేమ ఉదంతాలు మన దేశంలో చాలా చాలా అరుదుగా కనిపిస్తాయి. అందునా.. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారి ప్రేమకథలు చాలా చాలా తక్కువగా వినిపిస్తుంటాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తన సతీమణి బ్రిగెట్టాతో కలిసి వియత్నాం పర్యటనకు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న అనూహ్య ఘటన.. అది కాస్తా కెమేరా కంటికి కనిపించటంతో వీరిద్దరి మధ్య బంధంపై ప్రపంచ వ్యాప్త వార్తగా మారింది. దీనికి కారణం వియత్నాం పర్యటన కోసం వారు ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ అయిన వేళలో.. ఫ్లైట్ డోర్ తీసే వేళకు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఆయన సతీమణి తోసినట్లుగా కనిపించటం తెలిసిందే.
దీంతో.. వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే.. తమ మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవంటూ ఆయన వివరణ ఇస్తూ.. అది తమ మధ్య జరిగిన సరదా సన్నివేశంగా పేర్కొన్నారు. అదే సమయంలో తమ ఇద్దరి చుట్టూ స్టోరీలు అల్లిన వైనాన్ని తప్పు పట్టారు. ఇక్కడే ఈ ఇద్దరి జంటకున్న విలక్షణత.. ప్రత్యేకతను ప్రస్తావించాలి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కు ఇప్పుడు 47 ఏళ్లు కాగా.. ఆయన సతీమణి బ్రిగెట్టాకు అక్షరాల 72 ఏళ్లు. అంటే.. మెక్రాన్ కంటే ఆమె 25 ఏళ్లు పెద్దది. అదెలా సాధ్యం? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది?వారి ప్రేమకథ ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. కాసేపు వర్తమానం నుంచి గతానికి ప్రయాణం కావాల్సిందే.
ఫ్రాన్స్ లోని అమియెన్స్ పట్టణంలోని కేథలిక్ లైసీ లా ప్రావిడెన్స్ లో మెక్రాన్.. బ్రిగెట్టా తొలిసారి కలుసుకున్నారు. అది కూడా 1993లో. అప్పటికి బ్రిగెట్టాకు 39 ఏళ్లు కాగా.. మెక్రాన్ కు 15 ఏళ్లు. అప్పట్లో బ్రిగెట్టా హైస్కూల్లో టీచర్ గా పని చేసేవారు. మెక్రాన్ ఆ స్కూల్లో స్టూడెంట్. అప్పటికే ఆమెకు ఆండ్రీ లూయిస్ అనే బ్యాంకర్ తో పెళ్లైంది.వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె, మెక్రాన్ ఇద్దరు క్లాస్ మేట్స్. అంటే.. తన పెద్ద కూతురు వయసున్న కుర్రాడితో బ్రిగెట్టా ప్రేమలో పడ్డారన్న మాట.
వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ఎప్పుడు.. ఎలా ప్రేమగా మారిందన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆ తర్వాతి ఏడాది అంటే 1994లో మెక్రాన్.. బ్రిగెట్టా ఇద్దరూ ఒక స్విమ్మింగ్ పూల్ లో కలిసి స్నానం చేస్తున్నప్పుడు.. బ్రిగెట్టా కుటుంబ సభ్యుల కంట్లో పడ్డారు. దీంతో.. భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. టీన్స్ లో ఉన్న పిల్లాడ్ని అప్పటికే నలభై ఏళ్ల వయసులో ఉన్న బ్రిగెట్టా ఎలా ప్రేమించారన్న సందేహం వస్తుంది. దానికి ఆమె ఇచ్చిన సమాధానం.. పదిహేనేళ్ల వయసులోనే మెక్రాన్ పాతికేళ్ల కుర్రాడిలా బిహేవ్ చేసేవాడని.. అతడి మెచ్యూరిటీ ఎక్కువగా చెబుతారు.
ఉన్నత చదువుల కోసం మెక్రాన్ సొంతూరును వదిలేసి పారిస్ వెళ్లారు. అయినప్పటికి కూడా బ్రిగెట్టాతో తనకున్న రిలేషన్ ను మాత్రం వదులుకోలేదు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ ప్రేమకథ 2007లో పెళ్లితో మరోఅధ్యాయం మొదలైంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతారు. బ్రిగెట్టా తన మొదటి పెళ్లిని 1974లో ఏ బీచ్ లో అయితే చేసుకున్నారో.. మెక్రాన్ తో పెళ్లి కూడా అదే బీచ్ లో చేసుకోవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
పెళ్లైన తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెక్రాన్ గురించి మాట్లాడుతూ.. తమ ప్రేమ ఎక్కువ కాలం సాగదని తాను మొదట్లో భావించేదానినని.. మెక్రాన్ వయసుకు తగ్గ వారు సీన్లోకి వస్తే తనను వదిలేస్తాడేమోనన్న అభిప్రాయాన్ని ఆమె సరదాగా వ్యక్తం చేసేవారు. కానీ.. అలా జరగలేదు. 2014లో మెక్రాన్ ఫ్రాన్స్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతడికి సపోర్టు చేయటం కోసం తన ఉద్యోగానికి రిజైన్ చేసిన ఆమె.. మెక్రాన్ కు మద్దతుగా నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లోనూ వీరి జంట ప్రత్యేకంగా మారింది. వీరిపై బోలెడన్ని కథనాలు పబ్లిష్ అయ్యాయి. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన మీడియా కథనాల మీద స్పందిస్తూ.. తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఇప్పటికి చెక్కు చెదరట్లేదని మరోసారి స్పష్టం చేశారు మెక్రాన్.