జైలు గోడల మధ్య సంచలన హంతకురాలి నిజాలు!
ప్రస్తుతం ఓహియో మహిళల జైలులో ఉన్న మెకెంజీ షిరిల్లాకు అక్కడ ఉన్న ఖైదీలు ఓ వింతైన, భీతి గొలిపే మారుపేరును పెట్టారు.
అమెరికాలో సంచలనం సృష్టించిన ఓ దారుణ కారు ప్రమాదం- దానికి ఓ అందమైన యువతి చుట్టూ అల్లుకున్న కథనాలు తాజాగా అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. 2022లో ఓహియో రాష్ట్రంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, దానికి కారణం యాదృచ్ఛికమైన ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యాకాండ అని కోర్టు తేల్చింది. ఈ కేసులో దోషిగా తేలిన మెకెంజీ షిరిల్లా అనే యువతి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన `ది క్రాష్` అనే డాక్యుమెంటరీ ద్వారా ఈ ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఆమె జైలు జీవితానికి సంబంధించిన కొన్ని భయంకరమైన నిజాలు బయట పడుతున్నాయి.
ప్రస్తుతం ఓహియో మహిళల జైలులో ఉన్న మెకెంజీ షిరిల్లాకు అక్కడ ఉన్న ఖైదీలు ఓ వింతైన, భీతి గొలిపే మారుపేరును పెట్టారు. ఈ విషయాన్ని ఆమెతో పాటు జైలులో ఉండి, కొంతకాలం ఆమెతో సన్నిహితంగా మెలిగిన మాజీ స్నేహితురాలు షయాన్ టోపింగ్ ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. జైలులో ఒక రోజు తమ మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ తనపై వస్తోన్న కొన్ని పుకార్లను స్పష్టం చేసే క్రమంలో మెకెంజీ చాలా సాధారణంగా నవ్వుతూ, `ఇక్కడ నన్ను అందరూ `షిరిల్లా ద కిల్లా` (హంతకురాలు) అని పిలుస్తారు` అని పేర్కొన్నట్లు తెలిపింది. తాను చేసిన ఘోర నేరం పట్ల ఆమెకు ఎలాంటి పశ్చాత్తాపం లేదనే విషయాన్ని మారుపేరు, ఆమె ప్రవర్తన స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది.
ఈ భయంకరమైన మారుపేరును మెకెంజీ ఎంతో గర్వంగా నవ్వుతూ చెప్పుకోవడం చూసిన తర్వాత షయాన్ టోపింగ్ ఆలోచనల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. అంతవరకు మెకెంజీని ఓ మంచి వ్యక్తిగా భావించిన షయాన్, ఆమెలోని క్రూరమైన కోణాన్ని నెమ్మదిగా గ్రహించింది. కేవలం తనను ఆకర్షించడం కోసమే మెకెంజీ తనలోని మంచి ముఖాన్ని ప్రదర్శించిందని, నిజానికి ఆమె మనస్తత్వం చాలా ప్రమాదకరమైనదని షయాన్ అర్థం చేసుకుంది. జైలు గోడల మధ్య నడిచే ఇలాంటి సంబంధాలు ,అక్కడి నేరస్థుల నిజమైన నైజం ఎంత భిన్నంగా ఉంటాయో ఈ ఉదంతం నిరూపిస్తోంది.
అసలు ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే జూలై 2022లో అప్పటికి కేవలం 17 ఏళ్ల వయసున్న మెకెంజీ షిరిల్లా తన కారును గంటకు దాదాపు 100 మైళ్ల వేగంతో తీసుకెళ్లి ఓహియోలోని ఓ ఇటుకల గోడకు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆమె ప్రియుడు డొమినిక్ రుస్సో (20) , వారి స్నేహితుడు డేవియన్ ఫ్లానాగన్ (19) అక్కడికక్కడే మరణించారు. మెకెంజీ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. ఆ తర్వాత జరిగిన పోలీసు విచారణలో, ఆమె తన ప్రియుడితో ఉన్న సత్సంబంధాలు దెబ్బతినడం వల్లే పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టిందని ప్రాసిక్యూటర్లు కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఈ కేసు విచారణలో వెల్లడైన మరికొన్ని విషయాలు మెకెంజీ యొక్క వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె మరణించిన ప్రియుడి సోదరుడికి ఒక సందేశం పంపంది. డొమినిక్ శవపేటికలో తమ ఇద్దరి ఫోటోలను ఉంచాలని, తద్వారా అతను ఎప్పటికీ తనతోనే ఉంటాడని పేర్కొంది. ఒకవైపు ఇద్దరి ప్రాణాలు తీసి, మరోవైపు ఇలాంటి వింతైన కోరికలు కోరడం తీవ్రమైన స్వాధీనతా తత్వాన్ని సూచిస్తుంది. జైలులో కూడా ఓ మీన్ గర్ల్ గా అక్కడి తోటి ఖైదీలు అభివర్ణించడం గమనార్హం.