షాకింగ్... లౌవ్రే మ్యూజియంలో చోరీ ఎన్ని వందల కోట్లో తెలుసా?
దీంతో.. రోజూ వేల మంది సందర్శకులతో కిటకిటలాడే పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం ఆ రోజు మూసివేయబడింది.;
అక్టోబరు 19న పారిస్ లోని ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో.. రోజూ వేల మంది సందర్శకులతో కిటకిటలాడే పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం ఆ రోజు మూసివేయబడింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. దొంగలు సీన్ నది వైపు నుండి మ్యూజియంలోకి ప్రవేశించి, గూడ్స్ లిఫ్ట్ ద్వారా గదిలోకి ప్రవేశించి, బైక్ లపై పారిపోయారు. ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి రచిదా దాటి సోషల్ మీడియా పోస్ట్ లో ఈ సంఘటనను ధృవీకరించారు.
మ్యూజియంలో ఓ వైపు నిర్మాణం జరుగుతుండగా.. అక్కడి నుంచి దుండగులు లోపలికి చొరబడ్డారు. మ్యూజియం లోని నెపోలియన్ కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులోని తొమ్మిది వస్తువులను దొంగలించారు. వీరు వాటిని తీసుకుని వెళ్తుండగా.. అందులోని ఓ ఆభరణం మ్యూజియం బయట పడిపోయిందని అధికారులు తెలిపారు. మిగిలిన ఆభరణాల విలువ భారత కరెన్సీలో సుమారు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
అవును... ఫ్రాన్స్ అత్యంత భద్రత కలిగిన ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలోకి చొరబడిన దుండగులు కేవలం నిమిషాల వ్యవధిలో విలువైన ఆభరణాలు దొంగలించి పరారవ్వగా... ఈ దోపిడీ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో వారు దొంగిలించిన నగల విలువ సుమారు రూ.895 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఇది కరుడు గట్టిన దొంగల ముఠా పింక్ పాంథర్స్ పని అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పింక్ పాంథర్స్ పనే అనడానికి ఆధారాలున్నాయి!:
పారిస్ లోని లౌవ్రే మ్యూజియంలో జరిగిన సాహసోపేతమైన చోరీ శైలి చూస్తుంటే.. అది పింక్ పాంథర్స్ ముఠా విలక్షణమైన శైలిని గుర్తు చేస్తుందని.. ది స్వీనీ మాజీ ఆపరేషనల్ చీఫ్ బారీ ఫిలిప్స్ అభిప్రాయపడ్డారు. లక్ష్యంగా చేసుకున్న నిధి గతంలో పింక్ పాంథర్ నెట్ వర్క్ చేసిన పనులకు పూర్తిగా సరిపోతుందని.. వారు పెయింటింగ్ లు, కళాఖండాల కోసం వెళ్లరని.. అధిక విలువ కలిగిన ఆభరణాలనే దొంగతనం చేస్తారని అన్నారు.
ఈ దాడిలో దొంగిలించబడిన అమూల్యమైన రత్నాలు ఇప్పటికే అంతర్జాతీయంగా అక్రమంగా రవాణా చేయబడ్డాయని తెలిపారు! జాకెట్లలో ముసుగు ధరించిన నలుగురు చొరబాటుదారులు లౌవ్రే గ్యాలరీ ఆఫ్ అపోలోకు చేరుకుని కేవలం ఏడు నిమిషాల్లో ఈ పని పూర్తి చేశారని తెలిపారు. సైనిక చర్య తరహాలో వీరి చోరీలు అత్యంత ప్రొఫెషనల్ గా ఉంటాయని అన్నారు!
ఈ సందర్భంగా స్పందించిన ఆర్ట్ రికవరీ ఇంటర్నేషనల్ సీఈఓ క్రిస్ మారినెల్లో.. దొంగలను వెంటనే పట్టుకోకపోతే దొంగిలించబడిన ఆభరణాలు రూపం మారిపోతాయని, ఇక వాటిని గుర్తించడం సాధ్యం కాకపోవచ్చని హెచ్చరించారు.
ఎవరీ పింక్ పాంథర్స్ గ్యాంగ్..?:
ఈ పింక్ పాంథర్స్ దొంగల ముఠా గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ చోరీలకు పాల్పడింది. అందరూ చూస్తుండగానే దొంగతనాలు చేయడం.. నిమిషాల వ్యవధిలో పని పూర్తి చేయడం.. కేవలం ఆభరణాలు, వజ్రాలనే దోచుకోవడం వీరి నైజం. ఈ గ్యాంగ్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 35 దేశాల్లో దాదాపు 500 మిలియన్ డాలర్ల ఆభరణాలను దొంగిలించినట్లు ఆధారాలున్నాయని చెబుతున్నారు.
వీరి ముఠాలో ఎక్కువ మంది తూర్పు ఐరోపా దేశస్థులే ఉండగా... కొన్ని రంగాల్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులను, అథ్లెటిక్ యువతను, మాజీ సైనికులను రిక్రూట్ చేసుకుని చోరీలకు పాల్పడుతుంటారు. వీరిలో ఎక్కువ మంది ఇలా మాజీ సైనికులు కావడంతో.. మిలిటరీ తరహా క్రమశిక్షణతో, పక్కా ప్లానింగ్ తో, వీలైనంత తక్కువ సమయంలో, ఎక్కువ విలువైన ఆభరణాలు దోపిడీ చేయడం ఈ గ్యాంగ్ అలవాటని అంటున్నారు.
వీరు ఒకసారి చోరీ పూర్తయిన తర్వాత వెంటనే నకిలీ పాస్ పోర్టులతో దేశం దాటేస్తారు. వీరికి అంతర్జాతీయంగా నెట్ వర్క్ ఉంది. ఇక దొంగతనం చేసిన ఆభరణాలను కరిగించడం.. వజ్రాలను వాటి ఆకృతి మార్చడం చేసి, అనంతరం మార్కెట్లో విక్రయిస్తుంటారని చెబుతారు. వీరి దొంగతనం శైలి అత్యంత వేగంగా ఉంటుందని చెబుతూ.. అందుకు దుబాయ్ లోని ఓ మాల్ లో చేసిన దొంగతనాన్ని ఉదాహరణగా చూపిస్తారు.
ఇందులో భాగంగా.... దుబాయ్ లోని ఓ మాల్ లోని నగల దుకాణంలోకి కార్లతో దూసుకెళ్లిన ఈ గ్యాంగ్... చేతికందినన్ని వజ్రాలు, ఆభరణాలు తీసుకుని కేవలం 45 సెకన్లలో అక్కడి నుంచి పరారయ్యింది. ఇదే క్రమంలో... ప్రముఖ హాలీవుడ్ చిత్రం 'పింక్ పాంథర్' లో చూపించిన ఓ ట్రిక్ లాంటిదే చేసి 2003లో లండన్ లోని ఓ నగల దుకాణంలో వజ్రాలను చోరీ చేశారు. అప్పటి నుంచి ఈ గ్యాంగ్ కు పింక్ పాంథర్ అని పేరొచ్చింది.
ఈ మ్యూజియంలో ఎన్నో ప్రధాన ఆకర్షణలు!:
లౌవ్రే మ్యూజియంలో మెసొపొటేమియా, ఈజిప్ట్, శాస్త్రీయ ప్రపంచం నుండి యూరోపియన్ కళాకారుల వరకు ఎన్నో పురాతన వస్తువులు, మరెన్నో శిల్పాలు, చిత్రలేఖనాలతో పాటు సుమారు 33,000 కంటే ఎక్కువ కళాఖండాలు ఉన్నాయి. ఈ మ్యూజియంలోని ప్రధాన ఆకర్షణలలో మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ ఉన్నాయి. .
కాగా... ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే మ్యూజియంగా లౌవ్రే కు పేరుంది. ఇక్కడకు రోజుకు కనీసం 30,000 మంది సందర్శకులు వస్తుంటారు. ఈ మ్యూజియంలో గత కొన్ని సంవత్సరాలుగా మోనాలిసాతో సహా అనేక దొంగతనాల ప్రయత్నాలు, దొంగతనాలు జరిగాయి. వాటిలో కొన్ని రికవరీ కాగా, 'ది వేవ్' చిత్రలేఖనం మాత్రం తిరిగి దొరకలేదు!