లోకేశ్ Vs వైసీపీ.. పుష్ప స్టైల్ లోనే కౌంటర్, ఇంట్రెస్టింగ్

ఏపీ రాజకీయాలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ అధికార, ప్రతిపక్షాలు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.;

Update: 2026-02-20 16:30 GMT

ఏపీ రాజకీయాలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ అధికార, ప్రతిపక్షాలు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. విపక్షం వైసీపీ అసెంబ్లీకి హాజరుకాకపోయినా, మండలిలో చర్చల ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం సైతం ఇటు అసెంబ్లీ, అటు మండలిలో వైసీపీపై మాటల దాడి చేస్తోంది. ముఖ్యంగా టీడీపీ లడ్డూ కల్తీ, హెరిటేజ్, కూటమి పెద్దల విదేశీ పర్యటనలపై ఇరుపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ లో కొనసాగుతోంది. వైసీపీ విమర్శలపై మంత్రి లోకేశ్ సెటైరిక్ గా స్పందించడం, దానికి కౌంటరుగా వైసీపీ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించడం చర్చకు దారితీస్తోంది.

మంత్రి లోకేశ్ విదేశీ పర్యటలను వైసీపీ తప్పుపడుతోంది. ముఖ్యంగా గత ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన ఇండియా-పాక్ టీ20 క్రికెట్ మ్యాచ్ చూసేందుకు లోకేశ్ ప్రత్యేకంగా వెళ్లడాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. మాజీ సీఎం జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇంట్లో టీవీలో చూస్తే సరిపోతుంది కదా? అంటూ ఎత్తిచూపారు. అయితే తన సొంత ఖర్చులతో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళితే తప్పేంటి? అని ఎదురుదాడి చేసిన మంత్రి లోకేశ్ పుష్ప సినిమా స్టైల్ లో ‘ఎక్స్’లో సెటైరిక్ పోస్టు రాశారు.

‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా? వైఎస్ జగన్’’ అంటూ మాజీ సీఎంను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు మంత్రి లోకేశ్. రెండు రోజుల క్రితం లోకేశ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. తాను సొంత డబ్బులు ఖర్చు పెడితే మీకెంటి ఇబ్బంది? అంటూ లోకేశ్ ప్రశ్నించడంపై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ జరిగింది. అయితే దీనిపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందిస్తూ మంత్రికి పుష్ప స్టైల్ లోనే కౌంటర్ వేశారు.

'ఆ దుడ్లు చూసుకునే కదా ఇంతలా పులిపిక్కిపోతాండావు? ఇందాపూర్-హెరిటేజ్‌ల డెయిరీ మధ్య లింక్ ఏంటి? సిండికేట్ నడిపే వారికి ఏదీ సొంతం ఉండదు.. కమీషన్‌పైనే నడుస్తుంది' అంటూ వైసీపీకి చెందిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి లోకేశ్ పుష్ప స్టైల్ లో వైసీపీపై అటాక్ చేస్తే, వైసీపీ కూడా అదే సినిమా డైలాగ్ తో జవాబు చెప్పడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ అంశం అసెంబ్లీకి సమాంతరంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని అంటున్నారు.

Tags:    

Similar News