స్కూల్ ఎడ్యుకేషన్ లో మరో కీలక మార్పు.. మంత్రి లోకేశ్ ఇంట్రెస్టింగ్ డెసిషన్

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం వరకే పరిమితం కాదు. అది ప్రశ్నించడం, వాదించడం, చట్ట నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకోవడం అనే అవగాహనతోనే బలపడుతుంది.;

Update: 2025-09-27 12:25 GMT

విద్యాశాఖ మంత్రిగా ఏపీలో కీలక విద్యా సంస్కరణలు ప్రవేశపెడుతున్న మంత్రి లోకేశ్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన ఆలోచనను అసెంబ్లీలో ప్రస్తావించి సభ ఆమోదం కూడా పొందారు. దీంతో ఏపీ విద్యాశాఖలో లోకేశ్ మార్కు మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. తాజాగా లోకేశ్ మదిలో మెదిలిన ఆలోచనే ‘మాక్ అసెంబ్లీ’ చట్టాలు తయారీ, అమలు చేసే విధానంపై పిల్లలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి పాఠశాలలోనూ మాక్ అసెంబ్లీ నిర్వహించాలని మంత్రి లోకేశ్ నిర్ణయించారు. దీనికి శాసనసభ కూడా మద్దతు తెలిపింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ నిర్ణయాన్ని ప్రత్యేకంగా అభినందిందారు.

ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా పాఠశాలల్లో మాక్ అసెంబ్లీ నిర్వహించే ఆలోచనను మంత్రి లోకేశ్ సభ ముందు ఉంచారు. బడి పిల్లలను తీసుకువచ్చి మాక్ అసెంబ్లీలో కూర్చోబెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం ఎలా నడుస్తుందో అవగాహన కల్పించాలన్నది తన ఆలోచనగా మంత్రి లోకేశ్ వెల్లడించారు. చట్టాలు ఎలా అమలు అవుతాయన్నది మన భావితరాలకు తెలియాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయడం అవసరమని లోకేశ్ ప్రతిపాదించారు. దీంతో సభ్యులు అంతా హర్షధ్వానాలతో మంత్రి ప్రతిపాదనను స్వాగతించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మంత్రి లోకేశ్ ఆలోచన సరికొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని అభినందించారు.

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం వరకే పరిమితం కాదు. అది ప్రశ్నించడం, వాదించడం, చట్ట నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకోవడం అనే అవగాహనతోనే బలపడుతుంది. కానీ, ఈ అవగాహనకు మన విద్యావ్యవస్థలో ఇప్పుడు చోటు లేకపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి లోకేశ్ ఆలోచన ప్రకారం ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహిస్తే ఈ లోటు తీరనుంది. రాజ్యాంగం, చట్టసభలపై పిల్లలకు సంపూర్ణ అవగాహన లభిస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు అసెంబ్లీ వాతావరణంలో కూర్చొని ప్రత్యక్షంగా చర్చించడం, సలహాలు ఇవ్వడం వంటి ప్రక్రియలు వారిలో ఆలోచనను పెంచుతాయని అంటున్నారు. పుస్తకాల ద్వారా బోధించడం కంటే ఈ పద్దతి మెరుగైన ఫలితాన్ని ఇస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే మెగా పేటీఎం వంటి విప్లవాత్మక మార్పులతో పాఠశాల విద్యాశాఖలో సంస్కరణలు తీసుకువచ్చిన మంత్రి లోకేశ్ మాక్ అసెంబ్లీ ద్వారా మరో అడుగు ముందుకు వేసినట్లు అవుతుందని అంటున్నారు. మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పుస్తకాల బరువు తగ్గించడంతోపాటు చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా అమలు చేస్తున్నారు. దీనివల్ల పిల్లలు ఒత్తిడి లేకుండా చదువుకుంటున్నారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా లోకేశ్ ప్రతిపాదిస్తున్న మాక్ అసెంబ్లీ వల్ల పిల్లల్లో చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఆత్మనూన్యత దరి చేరకుండా ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో అవినీతిపై అవగాహన పారదర్శకతపై పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ప్రశ్నించడంపై ధైర్యంగా ఉంటారని అంటున్నారు. ఈ నిర్ణయం కేవలం ఒక విద్యా ప్రయోగం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పౌర శిక్షణ అని అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News