ఏడు నెలల్లో మీ డబ్బు డబుల్.. విజయవాడలో రూ.400 కోట్ల మోసం!
మరోవైపు మొత్తం 400 కోట్లు వసూలు చేశారని బాధితులు చెబుతున్నట్లు కథనాలు వస్తుంటే, తాను రూ.155 కోట్లు మాత్రమే వసూలు చేశానని వ్యాపారి చెప్పడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.;
లక్షకు రెండు లక్షలు, కోటికి రెండు కోట్లు అంటూ నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడో వ్యాపారి. దాదాపు వంద మంది నుంచి సుమారు రూ.400 కోట్లు వసూలు చేసి రెండు నెలలుగా కనిపించకుండాపోయాడని బీబీసీ ఓ కథనం ప్రచురించింది. డబ్బులు తీసుకున్న వ్యక్తి కనిపించకుండా పోవడంతో తాము మోసపోయామని ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వ్యాపారంలో నష్టం వచ్చిందని తాను వసూలు చేసిన డబ్బు తిరిగి చెల్లించలేనని చెబుతూ తెలంగాణలోని ఎల్బీ నగర్ కోర్టులో దివాళా పిటిషన్ వేశాడు ఆ వ్యాపారి. దీంతో రూ.400 కోట్లు పెట్టుబడిగా పెట్టిన వారంతా లబోదిబోమంటున్నారు. తన బాధితులు దాదాపు 112 మంది అంటూ నష్టపోయిన వ్యాపారి కోర్టులో పేర్లతో సహా వివరాలు సమర్పించగా, ఇద్దరు మాత్రమే ఫిర్యాదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు, పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం విజయవాడ నగరానికి చెందిన నిడుమోలు వెంకట సత్య లక్ష్మి కిరణ్ అనే వ్యక్తి 2014లో యు పిక్స్ క్రియేషన్స్‌ను ఏర్పాటు చేశాడు. సినిమాలకు యానిమేషన్ సాఫ్ట్ వేర్ అందిస్తుంటానని, ఆ రంగంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని తనకు తెలిసిన ఇతర వ్యాపారులకు చెప్పాడు. ఏడేళ్ల క్రితం గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి వద్ద రూ.10 లక్షలు తీసుకుని ముందుగా చెప్పినట్లే ఏడు నెలల్లో రెట్టింపు డబ్బులు ఇచ్చాడు. ఇలా ఏడేళ్లుగా నమ్మకంగా లావాదేవీలు నిర్వహించిన లక్ష్మి కిరణ్ కొంతకాలంగా చెల్లింపులు ఆపేశాడు.
అతడిపై నమ్మకంతో విజయవాడ, గుంటూరు, నరసారావుపేటకు చెందిన పలువురు వ్యాపారులు కోట్లలో పెట్టుబడులు పెట్టారు. తొలుత లావాదేవీలన్నీ సక్రమంగా నిర్వహించినా కొద్దికాలంగా చెల్లింపులు ఆపేయడంతో పెట్టబడిదారులు ఒత్తిడి పెంచారని చెబుతున్నారు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడమే కాకుండా కార్యాలయాన్ని తెరవకపోవడంతో బాధితులు అనుమానం వచ్చి లక్ష్మి కిరణ్ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఇద్దరు బాధితులు సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించగా, అక్కడ కేసు నమోదైంది.
ఇదే సమయంలో తాను ఎక్కడికీ పారిపోలేదని, వ్యాపారంలో నష్టం రావడంతో చెప్పిన ప్రకారం చెల్లించలేకపోయానని, కొంత సమయం ఇస్తే అందరికీ సెటిల్ చేస్తానంటూ వ్యాపారి లక్ష్మి కిరణ్ సెల్ఫీ విడుదల చేశాడు. దీంతో పెట్టుబడిదారులు కొంత శాంతించిన ఇంతలోనే తాను దివాళా తీసినట్లు లక్ష్మి కిరణ్ కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేయడంతో అందరిలో ఆందోళన పెరిగిపోయింది. అయితే లక్ష్మి కిరణ్ ఐపీ పిటిషన్ లో మొత్తం 102 మంది వద్ద 155.95 కోట్లు తీసుకున్నానని పేర్కొన్నాడు. అయితే తాము మోసపోయామని ఇద్దరే ఫిర్యాదు చేయడం గమనార్హం.
మరోవైపు మొత్తం 400 కోట్లు వసూలు చేశారని బాధితులు చెబుతున్నట్లు కథనాలు వస్తుంటే, తాను రూ.155 కోట్లు మాత్రమే వసూలు చేశానని వ్యాపారి చెప్పడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెట్టుబడి పెట్టిన వారిలో ఎక్కువ మంది తమ బ్లాక్ మనీనే లక్ష్మీ కిరణ్ కు ఇవ్వడం వల్ల బయటకు చెప్పుకోలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు వ్యాపారి లక్ష్మి కిరణ్ ఐపీ పెట్టినా తాము చట్టపక్రారం కేసు నమోదుచేసి ఆయనను అరెస్టు చేస్తామని సత్యనారాయణ పురం పోలీసులు చెబుతున్నారు. అయితే లక్ష్మి కిరణ్ అరెస్టుతో తమ జాతకాలు బయట పడతాయని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.