లడ్డూ ఇష్యూ...అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీకేనా ?
ఈ దేశంలో ఉత్తరాదిన మతం అన్న దాని మీద ఎక్కువగా జనాలు స్పందిస్తారు. అదే దక్షిణాదికి వస్తే మాత్రం ఆ తరహా పాలిటిక్స్ పెద్దగా నడవవు.;
ఈ దేశంలో ఉత్తరాదిన మతం అన్న దాని మీద ఎక్కువగా జనాలు స్పందిస్తారు. అదే దక్షిణాదికి వస్తే మాత్రం ఆ తరహా పాలిటిక్స్ పెద్దగా నడవవు. చరిత్ర ఒక్కసారి చూసుకుంటే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. కేరళలో మొదటి నుంచి వామపక్షాలు బలంగా ఉన్నాయి. తమిళనాడులో ద్రవిడ పార్టీలదే ఆధిపత్యం. ఇక కర్ణాటక ఉమ్మడి ఏపీ అంతా కూడా బలమైన కాంగ్రెస్ వాదం చాన్నాళ్ళు నడచింది. ఇక సెక్యులర్ భావజాలాన్ని ఈ రాష్ట్రాలు ఎక్కువగా నమ్ముతాయి. మతం మీద రాజకీయాలు చేయడానికి ఇక్కడ పెద్దగా ఆస్కారం ఉండదు, అందుకే బీజేపీ ఉత్తరాదిన విస్తరించినా దక్షిణాదిన తన అడుగు బలంగా మోపలేకపోయింది. చిత్రమేంటి అంటే తమిళనాడులో ఎక్కువ హిందూ టెంపుల్స్ ఉన్నాయి. అలాగే కర్ణాటకలో మఠాలు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. ఏపీలోనూ అంతే. కానీ మతాన్ని కేవలం వ్యక్తిగతం చేసుకుని జీవించడమే జనాలు నేర్చుకున్నారు.
కులాల సమరంగానే :
ఇక ఏపీలో చూస్తే కులాల మీదనే రాజకీయం సాగుతుంది. ఇప్పటిదాకా అనేక ఎన్నికల్లో అదే జరిగింది. అయితే బీజేపీతో గతంలో జత కట్టినా 2024 నుంచి మాత్రం టీడీపీ టోన్ మారుతోంది. మతం విషయంలో బీజేపీకి ఎక్కువ పట్టుదలగా ఉంటుంది. కానీ హిందూత్వ వాదం, సనాతన ధర్మం అన్నది టీడీపీ జనసేన నోటి నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఇక బీజేపీ విషయం తీసుకుంటే హిందూత్వ విధానమే ఆ పార్టీ నినాదంగా ఉంటూ వస్తోంది అన్నది తెలిసిందే. కానీ ఇపుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కానీ అలాగే విపక్షంలోని వైసీపీ కానీ ప్రపంచ దేవుడు అయిన తిరుమల వెంకన్న లడ్డూ లడ్డూ కల్తీ జరిగింది అన్న దాని మీద బిగ్ డిబేట్ పెట్టాయి. ఈ విషయంలో ఎవరూ తగ్గేట్లుగా లేరు. దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా మతం పేరుతో విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ కార్డు ఎవరి మేలుకు :
నిజానికి బీజేపీ హిందూ కార్డుని వాడుతుందని అంతా అంటారు. ఆ పార్టీకి కలసి వస్తే అసలు ఊరుకునేది లేదు, కానీ దక్షిణాదిన అందునా ఏపీలో వర్కౌట్ అవకనే పొత్తు పార్టీగా జూనియర్ పార్టనర్ గా ఉండిపోయింది. అయితే చిత్రంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మధ్య హిందూత్వ అంశం తీవ్రంగా చర్చ సాగుతోంది. ఒకరిని మించిన తీరులో మరొకరు హిందూత్వ అజెండాను ముందుకు తెస్తున్నారు. సరిగ్గా రెండేళ్ళ క్రితం మొదలైన లడ్డూ వివాదం అయితే ఇపుడు ఏ మాత్రం సద్దుమణిగేలా లేదు. చూడబోతే ఇదే 2029 ఎన్నికల అజెండాగా మారినా మారవచ్చు అని అంటున్నారు. దాంతో హిందూత్వ మీద ప్రధాన పార్టీలు జనంలో పలుకుబడి కలిగినవి చర్చని తీవ్రతరం చేస్తే జనాల్లో మైండ్ సెట్ ని మార్చితే అది అంతిమంగా ఎవరికి లాభం అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.
బీజేపీ రెక్కలు విప్పుకుని :
ఈ విధంగా పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా ఏపీలో హిందూత్వ వాదం పేరుతో సున్నిత అంశాలను చర్చకు పెట్టి వాటినే ఆయుధాలుగా అస్త్రాలుగా చేసుకుంటూ అటూ ఇటూ పక్షాలు ముందుకు సాగితే ఏ మాత్రం పరిస్థితి సానుకూలం అయినా అది బీజేపీకే ప్లస్ అవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీ విషయానికి వస్తే జాతీయ పార్టీ. పైగా హిందూత్వకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఈ విషయంలో బీజేపీని వేలు పెట్టి చూపించే పరిస్థితి అయితే ఎవరికీ లేదు. పైగా ఏడారిలో సైతం కమలాన్ని వికసింపజేసే నేర్పు ఓర్పు బీజేపీకి నిండుగా ఉన్నాయన్నది కూడా అంతా అంటారు. ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో విధంగా జయించుకుంటూ వస్తున్న బీజేపీకి ఏపీలో బంగారు పళ్ళెంలో అవకాశం కనుక దక్కితే మాత్రం మొత్తం పొలిటికల్ సీన్ మారిపోతుంది అని అంటున్నారు. అపుడు ప్రాంతీయ పార్టీల ప్లేస్ లో జాతీయ పార్టీగా బలమైన స్థితి కలిగిన బీజేపీ ఏపీలో రాజపూజ్యాలు అందుకున్నా ఆశ్చర్యపోవాల్సింది లేదని అంటున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద పాలకులు ప్రతిపక్ష నేతలు ఫోకస్ పెట్టి సున్నితమైన అంశాలను అలా పక్కన పెడితేనే అందరితో పాటు వారికీ మేలు అని అంటున్నారు.