కారు బ్యానెట్ పైకెక్కి బెదిరించినోడ్ని పట్టేసిన పోలీసులు

కూకట్ పల్లి రోడ్డు మీద వెళుతున్న కారును ఆపిన ఒకడు.. తాగిన మైకంలో కారు బ్యానెట్ ఎక్కి హల్ చల్ చేయటమే కాదు.. కోపంతో ఏదేదో సైగలు చేస్తూ.. చేత్తో కారు అద్దాన్ని కొట్టేస్తున్న పరిస్థితి.;

Update: 2025-07-24 04:09 GMT

ఓ రోజు క్రితం ఒక వీడియో వాట్సాప్.. సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది. నిజంగానే ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైతే మన పరిస్థితి ఏమిటి? అని హడలిపోయేలా ఉంది వీడియో. కూకట్ పల్లి రోడ్డు మీద వెళుతున్న కారును ఆపిన ఒకడు.. తాగిన మైకంలో కారు బ్యానెట్ ఎక్కి హల్ చల్ చేయటమే కాదు.. కోపంతో ఏదేదో సైగలు చేస్తూ.. చేత్తో కారు అద్దాన్ని కొట్టేస్తున్న పరిస్థితి. కారులో నుంచి జరుగుతున్న ఘటనను షూట్ చేస్తున్న భార్య.. డ్రైవ్ చేస్తున్న భర్తను హెచ్చరిస్తోంది. అతడ్ని కెలకొద్దని.

మొత్తంగా రోడ్డు మీద వెళుతున్న వారు కొందరు కల్పించుకొని..అతడ్ని కారు మీద నుంచి పక్కకు లాగేయటంతో ఆ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఈ వీడియో చూసిన చాలామందికి వచ్చిన సందేహం.. ఇలాంటి పరిస్థితే రేపొద్దున ఎప్పుడైతే ఎదురైతే.. తమ పరిస్థితి ఏమిటి? రోడ్డు మీద వెళుతున్న ఈ నలుగురు కల్పించుకోకపోతే.. కారు అద్దం బద్ధలైతే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? అని. కట్ చేస్తే.. ఈ వీడియో మీద కూకట్ పల్లి పోలీసులు స్పందించారు.

కారు బ్యానెట్ మీద ఎక్కి రచ్చ చేసినోడ్ని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఈ రచ్చ చేసినోడ్ని పట్టుకునేందుకు గూగుల్ పే సాయం చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. విశాఖపట్నం సమీపంలోని పెదగొగాని గ్రామానికి చెందిన 27 ఏళ్ల సింహాచలం నాయుడు ఓపెన్ వర్సిటీ ద్వారా బీఎస్పీ పూర్తి చేశాడు. నెల క్రితం హైదరాబాద్ కు వచ్చి మూసాపేట మెట్రో సమీపంలోని ఒక హాస్టల్ లో ఉంటూ వెల్డింగ్ పనులు చేస్తున్నాడు.

మంగళవారం సాయత్రం పీకల వరకు మద్యం తాగిన అతను రాత్రి తొమ్మిది గంటల వేళలో గుర్తు తెలియని జంట తమ కారులో ఎర్రగడ్డ నుంచి కూకట్ పల్లి వైపు వెళుతున్నారు. మెట్రో పిల్లర్ నంబరు 893 వద్ద వారి కారు అడ్డగించిన సింహాచలం కారు బ్యానెట్ మీదకు ఎక్కి.. డోర్ తీయాలంటూ బెదిరింపులకు దిగాడు. కారు అద్దాన్ని పగలకొట్టే ప్రయత్నం చేశాడు.

దీంతో కారులో ఉన్న దంపతులతో పాటు ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ టైంలో అదే దారిలో వెళుతున్న కొందరు యువకులు వచ్చి.. అతడ్ని కారు మీద నుంచి కిందకు దింపేసి పంపేశారు. ఈ వీడియో వైరల్ కావటంతో పోలీసులు ఈ ఘటనను సవాలుగా స్వీకరించి నిందితుడి ఆచూకీ కోసం గాలించారు. ఘటనా స్థలంలో సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు అక్కడే ఉన్న ఒక పాన్ డబ్బా యజమానిని అడిగితే జరిగిన ఘటనను చూశానని.. తన వద్ద సిగిరెట్లు.. మ్యాచ్ బాక్స్ తీసుకున్నట్లు చెప్పి.. గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరిపినట్లుగా పేర్కొన్నాడు. దీంతో.. ఆ ఫోన్ నంబరు ఆధారంగా నిందితుడ్ని కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు. మద్యం మత్తులో ఆ రచ్చ చేశాడని.. గంజాయి పరీక్ష చేస్తే నెగిటివ్ గా వచ్చినట్లుగా గుర్తించారు. ఏమైనా ఇలాంటి రచ్చ చేసే వారి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News