కేటీఆర్ లోకేష్ నోట ఒకే మాట....క్లారిటీ ఇచ్చేశారా ?

రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం చూస్తే కొన్ని విషయాల్లో పోలికలు స్పష్టంగా కనిపిస్తూంటాయి.

Update: 2026-10-05 03:25 GMT

రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం చూస్తే కొన్ని విషయాల్లో పోలికలు స్పష్టంగా కనిపిస్తూంటాయి. రాజకీయాల్లో పదవులు అవకాశాలు వారసత్వం ప్రాంతీయ పార్టీల వ్యూహాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ చర్చకు వస్తూ సరికొత్త పోలికలను తెస్తూ ఉంటాయి. ఇక చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తెలంగాణాలో బీఆర్ఎస్ ఉంటే ఏపీలో టీడీపీ వైసీపీ జనసేన ఉన్నాయి. ఇందులో వారసులతో ముందు వరసలోకి వచ్చిన పార్టీలుగా బీఆర్ఎస్ టీడీపీలను చెప్పుకోవాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మంత్రిగా తెలంగాణా ప్రభుత్వంలో పనిచేస్తే ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లోకేష్ మంత్రిగా పాలన ప్రస్తుతం సాగుతోంది. కాబోయే సీఎం ట్యాగ్ తో కేటీఆర్ లోకేష్ కొనసాగుతున్నారు.

కేసీఆర్ అంటూ :

ఇక 2023 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ కనుక గెలిచి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు అన్నది అందరికీ తెలిసిందే. కానీ అది జరగలేదు, అయితే 2028లో వచ్చే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతారు అన్నది ఆ మధ్య దాకా వినిపించిన మాట. కానీ ఇటీవలనే ఆ పార్టీలో కీలక మార్పు కనిపిస్తోంది. పైగా తెలంగాణా రాష్ట్ర రాజకీయాన్ని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ని ఇతర బలాలను అంచనా వేసుకుంటూ బీఆర్ఎస్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. అందుకే కేసీఆర్ నే ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయించుకుంది అని అంటున్నార్. అందుకే ఇటీవల కేరళలో జరిగిన కాంక్లేవ్ లో కేటీఆర్ తాను సీఎం క్యాండిడేట్ కాదని తేల్చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పి స్పష్టత ఇచ్చేశారు.

లోకేష్ నోట కూడా :

అయితే చిత్రంగా ఇదే మాట టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నోట కూడా వచ్చింది. ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఇలాంటి ప్రశ్న ఎదురైంది. దానికి లోకేష్ చాలా మెచ్యూర్డ్ గా బదులిచ్చారు. ఆయన్ని యాంకర్ అడిగినది ఏమిటి అంటే ఏపీ ముఖ్యమంత్రి కావాలని కోరిక లేదా అని. లోకేష్ బదులిస్తూ తాను విదేశాలలో విద్యను అభ్యసించాను అని ఏపీలో విద్యా విధానం రానున్న తరాలు అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దాలని ఉద్దేశ్యంతో విద్యా శాఖను తీసుకున్నాను అని బదులిచ్చారు. తనకు పదవుల కంటే ప్రజలకు సేవ చేయాలన్నదే మొదటి ప్రాధాన్యత అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దాంతో లోకేష్ సీఎం రేసులో ప్రస్తుతానికి లేరు అన్నది వెల్లడించారు అని అంటున్నారు. నిజానికి ఏపీలో కూడా లోకేష్ సీఎం అంటూ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అది ఈ టెర్మ్ లో జరుగుతుందని కొందరు అంటూంటే 2029లో మరోసారి కూటమి గెలిస్తే పక్కా అని కూడా అంటున్నారు. కానీ లోకేష్ మాత్రం సీఎం పదవి మీద స్పష్టత ఇస్తూ తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు అని అంటున్నారు.

అప్పుడేనా మరి :

మరి లోకేష్ కానీ కేటీఆర్ కానీ ఎపుడు ముఖ్యమంత్రులు అవుతారు అంటే దానికి సాధారణ శుభ ముహూర్తాలు మాత్రమే కాదు రాజకీయ ముహూర్తాలు కూడా కలసి రావాలని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ ని ముందు పెడితేనే తెలంగాణాలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఆయన తెలంగాణాను తెచ్చిన నాయకుడిగా జనంలో ఆదరణ కలిగిన వారుగా ఉన్నారు. అవన్నీ వర్కౌట్ అవుతాయనే కేసీఆర్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బీఆర్ఎస్ చెబుతూ వస్తోంది. ఏపీలో చూసినా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. అందువల్ల సీఎం గా చంద్రబాబు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఎంతో అనుభవం కలిగిన నేతగా, పరిపాలనా దక్షుడిగా చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ఎన్నికలకు వెళ్తే మరోసారి అధికారాంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇక ఒకసారి అధికారం దక్కితే అయిదేళ్ల పాటు ఉంటుంది. దాంతో ఏపీలో లోకేష్ అయినా లేదా తెలంగాణాలో కేటీఆర్ అయినా వచ్చే ఎన్నికల తరువాత తమ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాతనే సీఎంలుగా అయ్యేందుకు మార్గాలు సుగమం అవుతాయని అంటున్నారు. అలా రాజకీయంగా అన్ని విధాలుగా కలసివచ్చేదే అసలైన ముహూర్తం అని చెబుతున్నారు.

Tags:    

Similar News