ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్.. ఏఐ రేసులో అమెరికా కొత్త అస్త్రం

ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించిన ప్రకారం.. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలతో కలిసి ‘హిస్టారిక్ వైట్ హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్’ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

Update: 2026-10-04 19:04 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తూ.. ప్రపంచ టెక్నాలజీ రేసులో అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వతం చేసే దిశగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్’ (ఎస్ఐఎఫ్) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇది కేవలం సాంకేతిక విభాగానికి మాత్రమే పరిమితమైన నిర్ణయం కాదు.. భవిష్యత్ ప్రపంచపు ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక సమీకరణాలను తిరగరాసే ఒక సంచలనాత్మక అధ్యాయం.

హిస్టారిక్ వైట్ హౌస్ అకార్డ్.. టెక్ దిగ్గజాలతో చారిత్రక ఒప్పందం

ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించిన ప్రకారం.. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలతో కలిసి ‘హిస్టారిక్ వైట్ హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్’ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మానవాళి సంక్షేమాన్ని, అమెరికా ప్రజల ప్రయోజనాలను ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుని సూపర్ ఇంటెలిజెన్స్ రూపుదిద్దుకోవాలని టెక్ సంస్థలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

పారిశ్రామిక విప్లవాన్ని మించిన మహత్తర మార్పు

ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన పారిశ్రామిక, డిజిటల్ విప్లవాల కంటే కూడా ఈ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అత్యంత శక్తివంతమైనదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏఐ అనేది ఇకపై కేవలం ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు... దేశ భవిష్యత్తును, శాస్త్రీయ పురోగతిని, సైబర్ రక్షణ వ్యవస్థను శాసించే వ్యూహాత్మక శక్తి. ఈ నూతన వ్యవస్థ ప్రభుత్వ రంగాలు, కీలక మౌలిక సదుపాయాలు, సాంకేతిక దిగ్గజాలు, పరిశోధనా సంస్థలు.. ప్రజాప్రయోజన వ్యవస్థలను ఒకే తాటిపైకి తెచ్చి అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకునేలా సమన్వయం చేస్తుంది.

రంగంలోకి దిగ్గజాల బృందం

ఈ కీలక సమూహాన్ని నడిపించేందుకు అత్యున్నత స్థాయి అధికారులతో ట్రంప్ ఒక సైన్యాన్ని సిద్ధం చేశారు.. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జే క్లేటన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ చైర్మన్ ఆండ్రూ ఫెర్గూసన్ , చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ & రీసెర్చ్-ఇంజినీరింగ్ అండర్ సెక్రటరీ ఎమిల్ మైఖేల్ , ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ స్కాట్ కుపోర్ లను నియమించారు.

ఈ నూతన శక్తి నేరుగా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ పర్యవేక్షణలోనే పనిచేస్తుంది. ఇది అమెరికా ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుపై ఉన్న గంభీరమైన కట్టుబాటును చాటిచెబుతోంది.

గ్లోబల్ ఏఐ రేస్.. నాయకత్వం దిశగా అడుగులు

ప్రపంచంలో చైనాతో సహా పలు దేశాలు ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రక్షణ, వైద్యం, శాస్త్ర పరిశోధన, ఆర్థిక ప్రగతి వంటి అత్యంత సున్నితమైన రంగాలలో ఆధిపత్యం సాధించాలంటే ప్రభుత్వ సమన్వయం అత్యవసరం. ప్రైవేట్ రంగానికి ఉన్న సాంకేతిక వేగాన్ని ప్రభుత్వ వ్యూహాత్మక బలంతో జోడించి.. సరికొత్త శిఖరాలను అధిరోహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యూహం. అభివృద్ధి సాధిస్తూనే... పౌరుల గోప్యత, భద్రత, ఉద్యోగ భద్రత వంటి సవాళ్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

కొత్త శకానికి స్వాగతం

‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్’ ఏర్పాటుతో సాంకేతిక విప్లవంలో ఒక నూతన శకం ప్రారంభమైంది. రాబోయే కాలంలో మానవ మేధస్సుకు సాంకేతిక శక్తి తోడై ప్రపంచ గమనాన్ని ఎలా మార్చబోతుందో వేచి చూడాలి. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవడమే ఈ చారిత్రక అడుగు వెనుక ఉన్న అసలు సందేశం.

Tags:    

Similar News