బీసీ సీఎం వస్తున్నారు... మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు !
రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఏపీలో తెలంగాణాలోని మొత్తం జనాభాలో వారు సగానికి పైగా ఉన్నారు అని అంచనా ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఏపీలో తెలంగాణాలోని మొత్తం జనాభాలో వారు సగానికి పైగా ఉన్నారు అని అంచనా ఉంది. ఈ మేరకు ఆంధ్రా తెలంగాణా లో అధికారిక నివేదికల ప్రకారం బీసీలు అత్యధికం అని స్పష్టమైంది. అయితే చిత్రంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీల నుంచి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అయిన వారు లేరు. 1953లో ఏపీ ఏర్పడింది. 1956లో ఉమ్మడి ఏపీగా రూపుదిద్దుకుంది. అరవై ఏళ్ళ పాటు కలిసి ఉన్నా కూడా బీసీలకు సీఎం చాన్స్ రాలేదు, 2014లో విడిపోయిన తరువాత మూడు ఎన్నికలు జరిగాయి. అయితే బీసీలు మాత్రం ముఖ్యమంత్రులు కాలేదు. బీసీ వర్గాల నుంచి ఇదే ప్రధాన డిమాండ్ గా ముందుకు వస్తోంది. ప్రతీ పార్టీ బీసీ నినాదం వరకే పరిమితం అవుతోంది. కానీ సీఎం గా చేస్తామని చెప్పడం లేదు.
కాంగ్రెస్ రెడీ అవుతోందా :
ఇక ఏపీ అయినా తెలంగాణా అయినా కాంగ్రెస్ రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నది ముద్ర పడిపోయింది. వైఎస్సార్ తరువాత కూడా కిరణ్ కుమార్ రెడ్డికే చాన్స్ ఇచ్చింది అని గుర్తు చేస్తారు. ఇదిలా ఉంటే తాజాగా శంషాబాద్ లో జరిగిన ఓబీసీ సింహగర్జన సభలో తెలంగాణా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సీఎం రాష్ట్రానికి వస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది జరిగి తీరుతుందని ఆయన ధీమాగా చెప్పారు. తాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె అలాగే అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యంతోనే ఈ మాట చెబుతున్నాను అని అన్నారు. బీసీ సీఎం కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఇస్తారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం విశేషం. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సభలో మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ట్రంప్ కార్డుగానే :
బీసీ సీఎం అన్నది ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు ట్రంప్ కార్డుగానే వినియోగించుకుంటున్నాయని విమర్శలు ఉన్నాయి. తమకు అవకాశం ఉన్న సమయంలో ఎపుడూ ఆ పని చేయడం లేదని కానీ ప్రకటనలు అయితే ఇస్తూంటాయని అంటున్నారు. ఈ మధ్యనే బీజేపీ ఎంపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ 2028లో అధికారంలోకి వస్తే బీసీ సీఎం వస్తారు అని కామెంట్స్ చేశారు. తమ పార్టీ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి కట్టుబడి ఉందని అన్నారు. దాంతో బీజేపీ బీసీ కార్డుతో వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటోందని అంటున్నారు. ఇపుడు కాంగ్రెస్ కూడా బీసీ సీఎం అని కీలక ప్రకటన చేయడం పట్ల చర్చ సాగుతోంది.
బీసీ జనాభా ఇలా :
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీ జనాభా గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా అంటే 50.59 శాతంగా బీసీలు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ మొత్తం జనాభా 5 కోట్ల 31 లక్షల 39 వేల 56 ఉంటే అందులో బీసీల జనాభా 2 కోట్ల 69 లక్షలుగా ఉందని చెబుతున్నారు. తెలంగాణ సమగ్ర కుల సర్వే చేసిన తర్వాత బీసీ జనాభా వివరాలు చూస్తే మొత్తం జనాభా 3 కోట్ల 54 లక్షల 77 వేల 554గా ఉంటే అందులో బీసీల జనాభా 56.33 శాతంగా ఉంది. దాంతో బీసీ సీఎం డిమాండ్ అయితే తెలంగాణాలో ఎక్కువగా ఉంది. మరి కాంగ్రెస్ నుంచి తొలి బీసీ సీఎం వస్తారా అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. బీసీ కార్డుని ఏ పార్టీ ఉపయోగించుకుంటుంది అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా బీసీ సీఎం అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణా కాంగ్రెస్ లో అతి పెద్ద చర్చకు తావిస్తున్నాయి.