త్వరలోనే చిన్న శ్రీనుకు టీడీపీ పగ్గాలు ?
విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చిన్న శ్రీను చేతిలోకి రాబోతున్నాయి. నేడో రేపో దీనిని సంబంధించిన కీలక ప్రకటన టీడీపీ అధినాయకత్వం నుంచి రానుంది అని తెలుస్తోంది.
విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చిన్న శ్రీను చేతిలోకి రాబోతున్నాయి. నేడో రేపో దీనిని సంబంధించిన కీలక ప్రకటన టీడీపీ అధినాయకత్వం నుంచి రానుంది అని తెలుస్తోంది. గత నెలలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన చిన్న శ్రీనుకు నేరుగా చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబుని అలాగే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కలసి వచ్చిన చిన్న శ్రీను జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి పూర్తి స్థాయిలో తెలియచేశారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రస్తుతం జిల్లాలో ఉన్న వైసీపీలో అత్యధిక శాతం చిన్న శ్రీను అనుచరులుగా ఉన్నారు. వారంతా టీడీపీలోకి రావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో చిన్న శ్రీను చేతికే పార్టీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది అని అంటున్నారు.
స్థానిక ఎన్నికలలోనే :
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని చిన్న శ్రీనుతో భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇక చిన్న శ్రీను టీడీపీలో చేరిన వెంటనే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను సీనియర్ నేతలను అందరినీ కలుసుకుని వారితో మర్యాదపూర్వకమైన సమావేశాలు నిర్వహించారు. అందరితో కలసి పనిచేస్తామని కూడా ఆయన చెబుతూ వస్తున్నారు. ఇక చిన్న శ్రీను వెంట తాము ఉంటామని వైసీపీలో చాలా మంది చెబుతున్నారు. దాంతో ఎంత త్వరగా చిన్న శ్రీనుకు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే అంత తొందరగా వైసీపీని జిల్లాలో ఖాళీ చేయించే పని మొదలవుతుందని భావిస్తున్నారు.
రెండు పదవుల నుంచి :
ఇక ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున ఉన్నారు. ఆయన ఈ పదవితో పాటు డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం పార్టీలో చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ ఇపుడు చిన్న శ్రీనుని ఆ పదవి వరించబోతుంది అని అంటున్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో చిన్న శ్రీనుకు ఉన్న రాజకీయ పట్టు వైసీపీని గట్టిగా ఆకర్షించే సత్తా ఆయనకు ఉండడంతో విజయనగరం జిల్లాలో టీడీపీ మరింత పటిష్టం అవుతుందని హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆయనకు అర్జంటుగా జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు.
కీలకంగా మారుతారా :
చిన్న శ్రీను నిన్నటి వరకూ వైసీపీకి చెందిన బడా నేత. ఆయన ఇపుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉంటే జిల్లా రాజకీయాల్లో కీలకం అవుతారు అని అంటున్నారు. టీడీపీని మరోసారి 2029 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకుని వస్తామని ఇప్పటికే చిన్న శ్రీను ప్రకటించారు. జిల్లా టీడీపీ నేతలందరితో కో ఆర్డినేట్ చేసుకుని ముందుకు సాగుతామని కూడా ఆయన చెబుతూ వస్తున్నారు. ఇక చిన్న శ్రీను రాక పట్ల మొదట్లో కొంత అసంతృప్తి నేతల్లో ఉందని వినిపించినా అధినాయకత్వం ఏరి కోరి ఆయన్ని ముందుకు తీసుకుని వస్తున్న క్రమంలో అంతా కలసి పనిచేయాలని నిర్ణయించుకుంటున్నారు. మొత్తం మీద వైసీపీలో దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన చిన్న శ్రీను ఇపుడు టీడీపీ పక్షాన నిలిచి బలమైన ప్రత్యర్ధిగా మారితే అది వైసీపీకి రాజకీయంగా పెను సవాల్ గా మారుతుందని అంటున్నారు.