ఆమె రాజీనామా....బీజేపీ మేయర్ పీఠానికి షాక్
కేరళలో అధికారంలోకి వచ్చేస్తామన్నంతగా హడావుడి అయితే బీజేపీ చేసింది.
కేరళలో అధికారంలోకి వచ్చేస్తామన్నంతగా హడావుడి అయితే బీజేపీ చేసింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారం అని బీజేపీ చెప్పుకుని పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. అయితే తీరా ఫలితాలు చూస్తే భిన్నంగా వచ్చాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మూడు ఎమ్మెల్యే సీట్లు దక్కాయి 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేమోం చాతన్నూర్ కాళకూటం నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. గతంలో 2016లో కేరళలో తొలిసారిగా నేమోం సీటు మాత్రమే గెలవగా తాజా ఎన్నికల్లో మూడు స్థానాలు కైవసం చేసుకోవడం విశేషంగా చూడాలి. అయితే దీని కంటే ముందు కేరళకు గుండె కాయ లాంటి తిరువంతపురం కార్పోరేషన్ ని బీజేపీ గెలుచుకుంది.
తొలి మేయర్ జోష్ తో
అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ కీలకమైన తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ 50 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కి 29 సీట్లు వస్తే కాంగ్రెస్ కి 19 సీట్లు లభించాయి. ఈ కార్పొరేషన్ మొత్తం 101 మంది సభ్యులున్నారు. అధికారం చేపట్టాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 51. అయితే బీజేపీకి ఒక్క సీటు తక్కువగా ఉండడంతో స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో బీజేపీ మేయర్ ప్రమాణం చేశారు. గత కొన్ని నెలలుగా బీజేపీ పాలన తిరువనంతపురం కార్పోరేషన్ పరిధిలో సాగుతోంది. అయితే ఇపుడు ఈ మేయర్ సీటుకే ఎసరు పెట్టేలా బీజేపీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి
సీటుకే ఎసరు :
బీజేపీ నాయకుల తీరు మీద అసంతృపితో తిరువనంతపురం కార్పొరేషన్‌లోని శాస్తమంగళం వార్డు నుంచి ఆ పార్టీ తరఫున శ్రీలేఖ అనే మాజీ ఐపీఎస్, మహిళా నాయకులు రాజీనామాకి రెడీ అవుతున్నారు. ఆమె ఈ సీటుని భారీ మెజారిటీతో గెలిచారు. మరి ఎందుకు ఇంతలోనే రాజీనామా అంటే బీజేపీ నేతల తీరు నచ్చకనే అని అంటున్నారు. నిజానికి ఆమె కేరళ రాష్ట్ర డీజీపీగా పనిచేశారు. శక్తివంతమైన పోలీసు ఉన్నతాధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆమెని పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ తిరువనంతపురం మేయర్ సీటుని ఆఫర్ చేసిందని ప్రచారంలో ఉంది. ఆమె కూడా ఈ విషయాన్ని గతంలో చెప్పుకొచ్చారు. అయితే మేయర్ గా వీవీ రాజేశ్‌ను కి చాన్స్ ఇచ్చారు. దాంతో డీజీపీ లాంటి ఉన్నతాధికారిగా పనిచేసి జస్ట్ ఒక కార్పోరేటర్ గా తాను మిగలడం పట్ల శ్రీలేఖ తీవ్ర అసంతృప్తికి గురి అవుతూ వచ్చారు. అందుకే ఆమె తాజాగా తన రాజీనామా ప్రకటన చేశారు అని అంటున్నారు.
పీఠం జారినట్లే :
కార్పోరేటర్ పదవికి శ్రీలేఖ రాజీనామా చేస్తూ ఇప్పటికే మేయర్ వీవీ రాజేశ్ కి అందచేశారు. ఇక ఆమె తన రాజీనామా లేఖను సోమవారం జిల్లా కలెక్టర్ ని కలసి సమర్పిస్తారు. ఆ మీదట కార్పొరేషన్ కార్యదర్శికి రాజీనామా లేఖ సమర్పిస్తారు. ఆ తర్వాతే ఆమె రాజీనామా అధికారికంగా అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. అయితే బీజేపీకి తిరువనంతపురం కార్పొరేషన్‌లో 50 మంది కార్పోరేటర్లు మాత్రమే ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ మద్దతుతో అలా అధికారం నిలబడింది. ఇపుడు శ్రీలేఖ రాజీనామా చేస్తే సొంత బలం 49కి తగ్గిపోతుంది. ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చినా మ్యాజిక్ ఫిగర్ కి ఒక్క సీటు తగ్గుతుంది. దాంతో మేయర్ పీఠం జారిపోతుంది అన్న కలవరం అయితే కమలనాధులలో ఏర్పడింది అని అంటున్నారు.
బుజ్జగిస్తున్న బీజేపీ :
ఇదిలా ఉంటే మాజీ డీజీపీ శ్రీలేఖను బుజ్జగించేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. ఆమె రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. నిజానికి శ్రీలేఖ మూడు దశాబ్దాలకు పైగా కేరళ పోలీస్ విభాగంలో పనిచేశారు. తొలి మహిళా డీజీపీగా కేరళలో బాధ్యతలు చేపట్టి రికార్డు క్రియేట్ చేశారు. 2024 అక్టోబర్ లో ఆమె బీజేపీలో చేరారు. ఆమెకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని పార్టీ ఇచ్చింది. కానీ జస్ట్ కార్పోరేటర్ గా ఉంచడం పట్ల మాత్రం ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీ పెద్దలు ఏ హామీ ఇచ్చి ఆమె రాజీనామాను ఉప సంహరిచుకునేలా చేస్తారు అన్నదే చూడాల్సి ఉంది.