అవంతి పొలిటికల్ గ్యాప్...జనసేన పిలుస్తొందా ?
భీమిలీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ నాయకుడు అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు మీద మరో మారు చర్చ సాగుతోంది.
భీమిలీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ నాయకుడు అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు మీద మరో మారు చర్చ సాగుతోంది. ఆయన వైసీపీకి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని రెండేళ్ళు కావస్తోంది. దాంతో ఆయన ఇపుడు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. అవంతి శ్రీనివాస్ కి తన మొత్తం రెండు దశాబ్దాల కెరీర్ లో చూసుకుంటే ఇంత గ్యాప్ ఎపుడూ ఏర్పడలేదు. ఆయన అనూహ్యంగా ప్రజా రాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2009లో తొలిసారి భీమిలీ ఎమ్మెల్యే అయిపోయారు. ఇక 2014 నాటికి టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచి అయిదేళ్ల పాటు ఢిల్లీ రాజకీయాల్లో గడిపారు. 2019 నాటికి వైసీపీలో చేరి మళ్లీ భీమిలీ నుంచి రెండవసారి గెలిచి ఏకంగా జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. అలా మూడేళ్ల పాటు ఆ హోదాలో ఉన్నారు.
ఓటమి తరువాతనే :
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ పడిన అవంతి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలు అయ్యారు. నాటి నుంచే ఆయనకు రాజకీయ కష్టాలు వచ్చాయి. వైసీపీలో తొలి ఆరు నెలలు సైలెంట్ గా ఉన్న ఆయన 2024 డిసెంబర్ లో ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతో అని చెప్పి పార్టీకి గుడ్ బై కొట్టేశారు. ఆయన ప్రస్తుతం తన విద్యా సంస్థలను చూసుకుంటూ వస్తున్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీ వేదికల మీద అసలు కనిపించడం లేదు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్తు మీద రకరకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. ఇక ఇటీవల భీమిలీ రాజకీయాలో కీలక మార్పులు వచ్చాయి. వైసీపీ భీమిలీ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాస్ టీడీపీలో చేరిపోయారు.
వైసీపీలోకి అనుకున్నా :
దాంతో అవంతి శ్రీనివాస్ తిరిగి వైసీపీలోకి వస్తారు అని అంతా భావించారు. ఆయన రావాలని వైసీపీలో ఉన్న వారు కూడా కోరుకున్నారు. కానీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను అక్కడ ఇంచార్జిగా నియమిస్తూ వైసీపీ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో అవంతికి వైసీపీతో శాశ్వతంగా తలుపులు మూసుకుని పోయాయని అంటున్నారు. ఆయనకు ఇపుడు రెండే ఆప్షన్లు ఉన్నాయని అంటున్నారు. జనసేన బీజేపీలలో ఏదో ఒక పార్టీలో ఆయన చేరక తప్పదని అంటున్నారు. టీడీపీలో గంటా ఉన్నారు, ఆయన పోటీ చేయకపోతే వారసుడు గంటా రవితేజాని బరిలోకి దించుతారు. దాంతో టీడీపీలో రీ ఎంట్రీ కష్టమని తేలుతోంది.
జనసేన ఆఫర్ :
ఇక అవంతి శ్రీనివాస్ చేరాలి అనుకుంటే జనసేనలో చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. రెండు సార్లు భీమిలీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఆయన వస్తానంటే జనసేన చేర్చుకోవడం ఖాయమని అంటున్నారు. అయితే కూటమిలో పొత్తులు ఉన్నంతకాలం భీమిలీ టికెట్ అయితే దక్కే చాన్స్ అవంతికి లేదని అంటున్నారు. అదే సమయంలో జనసేనలో చేరితే వేరే నియోజకవర్గంలో అయినా పోటీకి ప్రయత్నం చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఆయన జనసేనలో చేరడం ఖాయమని అంటున్నారు. ఒక వేళ జనసేనలో కాకపోతే బీజేపీలో కూడా చేరేందుకు ఆయనకు మరో అవకాశం ఉంది. కానీ బీజేపీలో చేరితే టికెట్ విషయంలో ఎదురు చూడాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద అవంతి ముందు రెండు పొలిటికల్ ఆప్షన్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే డీలిమిటేషన్ కనుక జరిగితే అవంతికి వైసీపీ టీడీపీలో సైతం అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద మరి కొంత కాలం వేచి చూస్తారా లేదా ఇపుడే ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.