48 గంట‌లు గ‌డిచాయి.. అన్నంత ప‌నిచేసిన‌ కేటీఆర్

అనుకున్న‌ట్టుగానే 48 గంట‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా బండి నుంచి ఎలాంటి స్పంద‌నా రాక‌పోవ‌డంతో తాజాగా కేటీఆర్ ఆయ‌న‌కు లీగ‌ల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించారు.;

Update: 2025-08-12 09:25 GMT

''48 గంట‌లు స‌మ‌యం ఇస్తున్నా. ఈలోగా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. లేక‌పోతే లీగ‌ల్ నోటీసు ఇస్తా. ప‌రువు న‌ష్టం దావా వేస్తా'' అంటూ.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయ‌కుడు బండి సంజ‌య్‌కు బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అనుకున్న‌ట్టుగానే 48 గంట‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా బండి నుంచి ఎలాంటి స్పంద‌నా రాక‌పోవ‌డంతో తాజాగా కేటీఆర్ ఆయ‌న‌కు లీగ‌ల్ నోటీసులు పంపించారు. ఈ నోటీసుల్లో కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించారు.

1) నా పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేశారు. వీటిని వెన‌క్కి తీసుకుని, త‌క్ష‌ణ‌మే బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి.

2) ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో మా కుటుంబం పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి.

3) కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. భ‌విష్య‌త్తులోనూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌రాదు.

4) ప్ర‌జా ప్ర‌తినిధిగా అస‌త్య ఆరోప‌ణ‌లు త‌గ‌వు. త‌క్ష‌ణ‌మే వాటిని వెన‌క్కి తీసుకోవాలి.

5) ఈ లీగ‌ల్ నోటీసుకు స్పందించ‌క‌పోతే.. క్రిమిన‌ల్ కేసు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అని కేటీఆర్ తాను పంపించిన లీగ‌ల్ నోటీసులో ప్ర‌ధానంగా పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన‌ట్టుగా ప్ర‌స్తుత ప్ర‌భుత్వం భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచార‌ణ చేస్తోంది. ఈ విచార‌ణ‌లో భాగంగా రెండు రోజుల కింద‌ట కేంద్ర మంత్రి, ఈ కేసులో త‌న ఫోను కూడా ట్యాపింగ్ చేశార‌ని ఆరోపిస్తున్న బండి సంజ‌య్‌ను అధికారులు పిలిచి విచారించారు. సుమారు 4 గంట‌ల పాటు 36 ప్ర‌శ్న‌లు సంధించిన‌ట్టు ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. విచార‌ణ అనంత‌రం.. మీడియాతో మాట్లాడారు.

ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ స‌హా.. అప్ప‌టి మంత్రి కేటీఆర్‌పైనా బండి సంజయ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప‌డ‌క గ‌ది క‌బుర్లు కూడా విన్నార‌ని, త‌న ఇంట్లో ప‌ని వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశార‌ని అన్నారు. ఇక‌, కేసీఆర్ కుమార్తె క‌విత‌, అల్లుడు అనిల్ స‌హా బీఆర్ఎస్ అప్ప‌టి మంత్రులు, నేత‌ల ఫోన్ల‌ను కూడా ట్యాప్ చేశార‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారులు ప‌ట్టుకున్న కోట్ల రూపాయ‌లు ఫామ్ హౌస్‌లో నిల్వ చేశార‌ని ఆరోపించారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే కేటీఆర్ నోటీసులు ఇస్తాన‌ని హెచ్చ‌రించి.. అన్నంత ప‌నీ చేశారు.

Tags:    

Similar News