గోదావ‌రి జ‌లాల‌తో గురు ద‌క్షిణ‌: కేటీఆర్‌

గురు ద‌క్షిణ‌గా గోదావ‌రి జిలాల‌ను ఏపీకి అప్ప‌గించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప‌ర్య‌టించార‌ని బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు.;

Update: 2025-07-16 17:54 GMT

గురు ద‌క్షిణ‌గా గోదావ‌రి జిలాల‌ను ఏపీకి అప్ప‌గించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప‌ర్య‌టించార‌ని బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. `ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది! 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్ట య్యింది.` అని ఆయ‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్య మంత్రిగా గెలిపించినందుకు.. బూడిద తెలంగాణ ప్రజలకి.. ద‌క్కింది.. అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా ఢిల్లీలో జ‌రిగిన ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రుల స‌మావేశంపై కేటీఆర్ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ స‌మావేశంలో ఏపీ ప్ర‌తిపాదిత బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించార‌ని సీఎం రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ, గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమే ఆయ‌న ఢిల్లీకి వెళ్లార‌ని అన్నారు. అందుకే తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చార‌ని ఎద్దేవా చేశారు. `జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా?`` అని ప్ర‌శ్నించారు. కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో…ఈరోజుతో తేలిపోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

``నీ గురువుపై విశ్వాసం చూపించడానికి..తెలంగాణ విధ్వంసం కావలసిందేనా? ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు. తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో.

జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో. ఒక్క మాట గుర్తు పెట్టుకో…ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావు. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం. ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పకపడతాం.`` అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాగా.. అస‌లు త‌మ స‌మావేశంలో బ‌న‌క‌చ‌ర్ల ప్ర‌స్తావ‌న‌కానీ.. చ‌ర్చ‌కానీ రాలేద‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిని అజెండాలో కూడా చేర్చ‌లేద‌న్నారు.

Tags:    

Similar News