కోట్ల వారి అసంతృప్తి.. కారణాలు చాలానే.. !
నియోజకవర్గంలో ఒకప్పుడు ఉన్న డామినేషన్ ఇప్పుడు లేకపోవడం, టిడిపిలో వర్గ పోరు పెరిగిపోయిన నేపథ్యంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆవేదనతో ఉన్నారు.;
సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో డోను నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. టిడిపి టికెట్ పై పోటీ చేసి ఆయన గెలుపు గుర్రం ఎక్కినా.. అసంతృప్తితో ఆయన రగిలిపోతు న్నారు. సీనియర్ నాయకుడిగా తన మాటకు, తనకు విలువ లేకుండా పోతుంది అన్నది కోట్ల ఆవేదనకు కారణంగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఒకప్పుడు ఉన్న డామినేషన్ ఇప్పుడు లేకపోవడం, టిడిపిలో వర్గ పోరు పెరిగిపోయిన నేపథ్యంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆవేదనతో ఉన్నారు. అదే సమయంలో మంత్రివర్గంలోనూ తనకు చోటు లభించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత మందికి అవకాశం లభించే పరిస్థితి లేకుండా పోయిందని గతంలోనే చంద్రబాబు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి వివరించారు. కానీ కోట్ల మాత్రం తన అసంతృప్తిని తగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. స్థానికంగా పట్టు కోల్పోవడం, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోట్ల రాజకీయాలు ఒకింత ఆందోళన గానే సాగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కోట్ల భాగస్వామ్యం ఎక్కడా కనిపించడం లేదు.
కనీసం ఆయన బయటకు కూడా రావడం లేదు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే బయటకు రాలేకపోతున్నాను అని ఆయన చెబుతున్నా.. పార్టీలో మాత్రం అసంతృప్తి కారణంగానే కోట్ల బయటికి రావడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోవైపు డోన్ నియోజకవర్గంలో కేఈ ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు చెప్పకుండానే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుండడం... అధికారులు సైతం కేఈ చెప్పినట్టు వినడం వంటివి కూడా కోట్లకు మింగుడు పడడం లేదు.
పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోవడంలేదని తన కేడర్ బలహీన పడుతుందని తరచుగా వ్యాఖ్యానిస్తు న్నారు వచ్చే ఎన్నికల నాటికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటారు అనే ప్రయత్నం జోరుగా జరుగుతోంది. పార్టీ పరంగా కూడా వచ్చే ఎన్నికల నాటికి యువనాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశం కనిపిస్తుండడంతో కోట్ల సైలెంట్ కావడానికి ఇది కూడా కారణమని సమాచారం. ఏదేమైనా డోన్ రాజకీయాలు గతానికి భిన్నంగా జరుగుతున్నాయి అన్న ది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు ఉన్న దూకుడు రాజకీయాలకు ఇప్పుడు కోట్ల దాదాపు దూరంగానే ఉన్నారు.