కాంగ్రెస్‌లో పెను ప్రకంపనలు: కొండా – పొంగులేటి వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు!

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.;

Update: 2025-10-16 04:48 GMT

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మొదలైన మేడారం టెండర్ల వివాదం, అనూహ్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రమేయం వరకు చేరింది. ఈ వ్యవహారంపై సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన సంచలన ఆరోపణలు కాంగ్రెస్‌లో పెద్ద దుమారం రేపాయి.

* మేడారం టెండర్ల వివాదం, హైకమాండ్‌కు ఫిర్యాదు

వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేడారం అభివృద్ధి పనుల టెండర్లలో అతిగా జోక్యం చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖ శాఖకు చెందిన 71 కోట్ల రూపాయల విలువైన టెండర్లను పొంగులేటి తన సన్నిహితులకు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సురేఖ వర్గం ఆరోపించింది. దీంతో మంత్రి కొండా సురేఖ ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడమే కాకుండా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సైతం లేఖ రాసి హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రుల మధ్య వరుస వివాదాలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ పంచాయతీపై హైకమాండ్‌కు పూర్తి నివేదిక పంపినట్లు ప్రచారం సాగుతోంది.

* అర్ధరాత్రి కొండా ఇంటి వద్ద హైడ్రామా

మంత్రుల వివాదం కొనసాగుతుండగానే, కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ వ్యవహారం తెరపైకి వచ్చింది. డెక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై సుమంత్‌పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ నివాసానికి చేరుకున్నారు.

ఈ పరిణామం అర్ధరాత్రి హైడ్రామాకు దారితీసింది. పోలీసులు సరైన కారణాలు చూపించకుండా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించగా, మంత్రి కుమార్తె కొండా సుస్మిత వారిని అడ్డుకున్నారు.

* సుస్మిత సంచలన ఆరోపణలు

పోలీసుల రాకను అడ్డుకున్న కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. "మా అమ్మను టార్గెట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటమే మేము చేసిన తప్పా? బీసీ మంత్రి అయిన మా అమ్మపై కొందరు రెడ్డి మంత్రులు కుట్ర పన్నుతున్నారు," అని సుస్మిత ఘాటుగా వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా సుమంత్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, వేం నరేందర్ రెడ్డి సహా పలువురు నేతల ప్రమేయం ఉందని ఆమె నేరుగా పేర్లను ప్రస్తావించారు. అంతేకాకుండా, సుమంత్‌పై నమోదైన ఫిర్యాదులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేరు వినిపించినప్పటికీ, ఉత్తమ్ తనకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పడం ఈ కేసుపై మరింత అనుమానాలకు తావిస్తోంది.

*ఉద్రిక్తత, మాయమైన ఓఎస్డీ

పోలీసులు, మీడియా సమక్షంలో ఉద్రిక్తత నెలకొనగా, కొండా సురేఖ తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ను తన కారులో తీసుకెళ్లిపోయినట్టు మీడియాలో ప్రచారమైంది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

మొన్నటిదాకా కేవలం శాఖాపరమైన విభేదాలుగా ఉన్న కొండా-పొంగులేటి వివాదం, ఇప్పుడు పోలీస్ ఎంట్రీ.. సుస్మిత ఆరోపణలతో సీఎం కార్యాలయం (CMO) వరకు చేరడం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు, పార్టీ అంతర్గత సంక్షోభాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాష్ట్ర రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.



Tags:    

Similar News