కొలికపూడి మరీ అంత అమాయకుడా.. !
కొలికపూడి శ్రీనివాసరావు.. తిరువూరు ఎమ్మెల్యేగానే కాకుండా.. మంచి వాక్చాతుర్యం.. ఉన్న ఎస్సీ నాయకుడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏ పాయింట్ లేవనెత్తాలో.. ఆయనకు కొట్టిన పిండి!.;
కొలికపూడి శ్రీనివాసరావు.. తిరువూరు ఎమ్మెల్యేగానే కాకుండా.. మంచి వాక్చాతుర్యం.. ఉన్న ఎస్సీ నాయకుడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో ఏ పాయింట్ లేవనెత్తాలో.. ఆయనకు కొట్టిన పిండి!. అమరావతి రైతుల ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్లడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక టీవీ డిబేట్లలో గుక్క తిప్పకుండా.. మాట్లాడిన సామర్థ్యం కూడా ఆయన సొంతం. అలాంటి కొలిక పూడి.. ఇప్పుడు చాలా అమాయకంగా వ్యవహరించడంపై టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్లు గైడ్ చేయట్లేదట.. !
''సీనియర్లా.. మరేదైనానా?'' అంటూ.. ఓ టీవీడిబేట్‌లో టీడీపీ సీనియర్లపై నోరు పారేసుకున్న కొలికపూడి.. తాజాగా తనను సీనియర్లు ఎవరూ గైడ్ చేయడం లేదని.. ఆ కారణంగానే తప్పులపై తప్పులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన కొలికపూడి టీడీపీ సభ్యులకు దూరంగా సభలో ఓ మూల కూర్చున్నారు. ఈ క్రమంలోనే లాబీల్లో పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో తన బాధను పంచుకున్నారు.
తాను తప్పులపై తప్పులు చేయడానికి రెండు కారణాలను కొలికపూడి చెప్పుకొచ్చారు.
1) తాను కొత్త ఎమ్మెల్యే కావడంతో ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియడం లేదన్నారు. దీని వల్లే తప్పులపై తప్పులు జరుగుతున్నాయని వెల్లడించారు.
2) పార్టీలో సీనియర్లు ఎవరూ తనకు గైడ్ చేయడం లేదని.. ఈ కారణంగా కూడా.. తాను తప్పులు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అంటే.. తన తప్పులేదని.. ఇప్పటి వరకు జరిగినవన్నీ.. తన ప్రమేయం లేకుండానే జరిగాయన్నది ఆయన వివరణలోని సారాంశం.
అంత అమాయకుడా.. !
పోనీ.. కొలిక పూడి చెబుతున్నట్టు ఆయన అంత అమాయకుడనే అనుకుందాం. కానీ, పార్టీ పరంగా.. ఇటు చంద్రబాబు నుంచి అటు క్రమశిక్షణ సంఘం నుంచి కూడా ఆయనకు అనేక సందర్భాల్లో ఎలా వ్యవహ రించాలో చెప్పారు. ఏది తప్పో.. ఏది ఒప్పో కూడా.. వెల్లడించారు. ముఖ్యంగా తనకు రూ.కోట్ల మేరకు టికెట్ విక్రయించారని ఆరోపణలు చేసినసమయంలో మరింత ఎక్కువగానే ఆయనను హెచ్చరించారు. మరి అవి ఏమైపోయాయి?!. అప్పుడైనా తెలుసుకుని ఉండాలి కదా!. అనే దానికి.. కొలికపూడి ఎలాంటి సమాధానం చెబుతారన్నది చూడాలి. ఏదేమైనా కొలికపూడి అంత అమాయకుడు అయితే కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.