కొడాలి నాని రాజకీయ సన్యాసం నిజమేనా ?
వైసీపీ ఫైర్ బ్రాండ్, మూడేళ్ళ పాటు జగన్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని రాజకీయాల నుంచి విరమించుకుంటారా అన్న చర్చ సాగుతోంది.;
వైసీపీ ఫైర్ బ్రాండ్, మూడేళ్ళ పాటు జగన్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని రాజకీయాల నుంచి విరమించుకుంటారా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ ఓటమి తరువాత ఆయన గుడివాడకు రావడం బాగా తగ్గించేశారు. ఆయన హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు.
ఈలోగా ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన ముంబై దాకా వెళ్ళి మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తారు అన్న ప్రచారం సాగుతున్న క్రమంలో ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ అయినట్లుగా చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో కొడాలి నాని అమెరికా పర్యటన ఉంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా ఉంది. మరో వైపు చూస్తే కొడాలి నాని మీడియా ముందుకు రావడం లేదు, వైసీపీ మీద జగన్ మీద గతంలో ఈగ వాలనివ్వని ఈ ఫైర్ బ్రాండ్ ఇపుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. తనకు ఇష్టమైన నేత అత్యంత సన్నిహితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని అరెస్ట్ చేసినపుడు విజయవాడ జైలులో ఆయనను పరామర్శించేందుకు అధినేత జగన్ తో కలసి వచ్చారు. అయితే నాడు ఆయనకు ములాఖత్ అవకాశం దక్కలేదు.
ఆ తరువాత నాని మళ్ళీ ఏపీలో కనిపించినది లేదు అనే చెప్పాలి. ఇక గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము దూకుడు రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకుంటున్నారు. నాని అనుచరులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. వైసీపీకి నడిపించే నాధుడు లేక అవస్థలు పడుతోంది.
మరో పదిహేను రోజులలో ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి అవుతుంది. వైసీపీ ఓటమికి కూడా ఏడాది అవుతుంది. దాంతో ఏడాది పాటు అసెంబ్లీ నియోజకవర్గాలలో పెద్దగా కనిపించని ఇంచార్జిల విషయంలో వైసీపీ సీరియస్ గానే యాక్షన్ లోకి దిగుతోంది అని అంటున్నారు. పార్టీ బతికి బట్టకట్టాలీ అంటే అక్కడ నాయకత్వం ఉండాలని భావిస్తోంది అని అంటున్నారు.
దాంతో గుడివాడలో కూడా వైసీపీ తరఫున కొడాలి నాని ప్లేస్ లో కొత్త ఇంచార్జి వస్తారని అంటున్నారు. నాని అనారోగ్య సమస్యలతో పాటు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. 2004 నుంచి 2019 దాకా వరసగా నాని నాలుగు సార్లు గుడివాడ నుంచి గెలిచారు. ఇరవై ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఎదురులేకుండా పనిచేశారు. మంత్రిగా మూడేళ్ళ పాటు పనిచేశారు.
దాంతో ఆయనకు ఈ రాజకీయ జీవితం సంతృప్తిని ఇచ్చిందని అంటున్నారు. 2024లో ఓటమి పాలు కావడంతో ఆయన ఇక తన రాజకీయానికి స్వస్తి పలుకుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఆయన మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది అని చెబుతున్నారు. లుకౌట్ నోటీసులు కేసులు కనుక తెమిలితే మాత్రం నాని అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అవుతారని ప్రచారం అయితే సాగుతోంది.
మరి ఈ ప్రచారంలో నిజమెంత నాని రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక 2029లో మళ్ళీ పోటీకి దిగుతారా అన్నది చూడాలి. అయితే నాని అయితే ఈ మధ్యలో గుడివాడకు వచ్చి డైలీ పాలిటిక్స్ చేసే అవకాశాలు అయితే లేనందువల్ల ఆయన ప్లేస్ లో వైసీపీ ఇంచార్జిని నియమించడం ఖాయమన్న మాట వినిపిస్తోంది.