కొడాలి నానికి రిలిఫ్..వారానికి 2సార్లు కాదు.. ఒక్కసారే
ఈ కేసుకు సంబంధించి గతంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కొడాలి నానికి.. న్యాయస్థానం సూచన మేరకు గుడివాడ కోర్టుకు వెళ్లారు.;
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కం ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి కాస్తంత ఊరట లభించిందని చెప్పాలి. ఇప్పటివరకు వారానికి రెండుసార్లు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన దానికి బదులుగా.. వారానికి ఒక్కసారే పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాల్సి ఉంటుంది. టీడీపీ కార్యాలయం మీదా.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మీదా పెట్రోల్ పాకెట్లతో దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో కొడాలి నని ప్రతి మంగళవారం.. శనివారం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది.
ఈ కేసుకు సంబంధించి గతంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన కొడాలి నానికి.. న్యాయస్థానం సూచన మేరకు గుడివాడ కోర్టుకు వెళ్లారు. అక్కడ షరతులతో కూడిన బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రతి మంగళవారం.. శనివారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాలని ఆదేశించింది. అయితే.. తాజాగా దీనికి ఒక రోజుకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ప్రతి వీకెండ్ వేళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా కోర్టులు సంబంధిత కేసులో ఛార్జిషీటు దాఖలు చేసే వరకు కానీ.. రెండు నెలల వ్యవధితో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తారు. ఈ కేసులో రెండు నెలల కాల వ్యవధి పూర్తైనప్పటికి ఛార్జిషీట్ దాఖలు చేయని కారణంగా మరో 2 వారాల పాటు కొడాలి నాని పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. వైసీపీ మాజీ మంత్రులు నానిల ద్వయం ఇద్దరూ గుడివాడలో భేటీ అయ్యారు. కొడాలి నాని.. పేర్ని నానిలు ఇద్దరు గుడివాడలోని కొడాలి నాని ఇంట్లో భేటీ అయ్యారు. చాలా కాలం తర్వాత ఇద్దరు నానిలు భేటీ కావటం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.