కిషన్ రెడ్డిపై యుద్ధానికి రేవంత్ పక్కా హోంవర్కు?
హైదరాబాద్ మహానగరంలో మెట్రో విస్తరణకు సంబంధించి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సరికొత్త మలుపు తిరిగినట్లుగా చెప్పాలి.
హైదరాబాద్ మహానగరంలో మెట్రో విస్తరణకు సంబంధించి తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సరికొత్త మలుపు తిరిగినట్లుగా చెప్పాలి. జపాన్ నుంచి నిధులు వచ్చినప్పటికి వాటిని రాష్ట్రానికి మళ్లించకుండా అడ్డుకోవటం.. అందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ తీరు చూస్తే.. ఈ మొత్తం ఎపిసోడ్ మీద పూర్తిస్థాయిలో హోంవర్కు చేసిన తర్వాతే రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది.
ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద తప్పించి.. మిగిలిన కేంద్రమంత్రుల మీద కానీ.. ప్రధాని నరేంద్ర మోడీ మీద కానీ.. కేంద్రప్రభుత్వం మీద కాని పల్లెత్తు మాట అనలేదు. కిషన్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నప్పుడు.. మిగిలిన కేంద్ర మంత్రులు ఏమీ చేయలేకపోతున్నారనే మాట సీఎం రేవంత్ నోటి నుంచి వస్తోంది. అన్నింటికి కిషన్ రెడ్డి మాత్రమే కారణం తప్పించి.. ఇంకెవరు కాదన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు సీఎం రేవంత్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తనవైపు తప్పులు ఉంచుకొని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద విరుచుకుపడితే.. సీఎం రేవంత్ కు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కాబోలు.. పక్కాగా హోంవర్కు చేసి.. రాష్ట్రం తరఫున ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే.. కిషన్ రెడ్డి మీద సమర శంఖాన్ని పూరించినట్లుగా కనిపిస్తోంది. మెట్రో అంశంపై సీఎం రేవంత్ హోంవర్కు చేశారన్న దానికి నిదర్శనంగా పలు అంశాల్ని ప్రస్తావిస్తున్నారు.
సాధారణంగా కేంద్రం నిధులు ఆపేందుకు రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ లేదంటే ఎఫ్ఆర్ బీఎం పరిమితులను సాకుగా చూపించే వీలుంది. అందుకే రేవంత్ ఈ డీల్ ను నేరుగా కాకుండా ఎల్ అండ్ టీ సంస్థ.. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్.. ఐఆర్ఎఫ్ సీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం ద్వారా రీఫైనాన్సింగ్ రూట్ లో డిజైన్ చేయటం గమనార్హం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అప్పు తీసుకున్నట్లుగా ఉండదు. ప్రాజెక్టును టేకోవర్ చేసే ప్రక్రియ కిందకు వస్తుంది. ఈ టెక్నికల్ లూప్ హోల్ ను పక్కాగా ప్లాన్ చేసిన తీరు చూస్తే.. రాష్ట్రాన్ని టార్గెట్ చేయటం కష్టమవుతుంది.
అంతేకాదు రాష్ట్రం తరఫున చెల్లించాల్సిన రూ.1400 కోట్ల మార్జిన్ మనీ మాత్రమే కాదు రూ.84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి రశీదుల వివరాల్ని తన వద్ద ఉంచుకోవటం రేవంత్ హోం వర్క్ కు నిదర్శనంగా చెప్పాలి. ఈ నిధులు మొత్తం ఐఆర్ఎఫ్ సీ అకౌంట్ లోకి చేరాయన్న విషయాన్ని నిర్దారించుకున్న తర్వాతే ప్రెస్ మీట్ పెట్టటం గమనార్హం. తాజా ప్రెస్ మీట్ లో ఎల్ అండ్ టీ నష్టాలకు.. తాము జపాన్ నుంచి తీసుకొచ్చిన వడ్డీ రేటును గణాంకాల ద్వారా వివరించటమే కాదు.. ఏటా రూ.150 కోట్ల వడ్డీ ఆదా చేస్తున్న సునిశితమైన విషయాన్ని ప్రస్తావించిన వైనం చూస్తే.. రేవంత్ ఈ అంశంపై పూర్తిస్థాయి హోంవర్కు చేసినట్లుగా చెప్పాలి.
ఇక్కడే రేవంత్ చతురతకు నిదర్శనంగా మరో అంశాన్ని ప్రస్తావించాలి. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ఫర్లేదు. తమకు నో అబ్జెక్షన్ సర్టిపికేట్ ఇవ్వాలని కోరారు. ఇలా చేస్తే.. అవసరమైతే వంద శాతం రాష్ట్ర నిధులతోనే తాము మెట్రో విస్తరణ చేపడతామని చెప్పటం ద్వారా.. తనకు ప్లాన్ బి ఉందన్న విషయాన్ని చెప్పేశారు. తాను కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన తర్వాత.. భూసేకరణ విషయంలో రేవంత్ సర్కారు ఫెయిల్ అయ్యే వీలుందన్న వాదన తెర మీదకు వస్తే.. తాను డిఫెన్స్ లో పడే వీలుంది. అందుకే.. తాజా ప్రెస్ మీట్ లో భూసేకరణ సమస్యలు ఫేజ్ 2లో ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటిని ఎలా అధిగమించాలని తాము భావిస్తున్నామో అన్న విషయాన్ని డీపీఆర్ తో సహా లీగల్ టీంను రెఢీ చేసుకొని మరీ ప్రెస్ మీట్ పెట్టినట్లుగా స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే.. కిషన్ రెడ్డి మీద యుద్ధం ఆషామాషీగా.. సింఫుల్ గా తీసుకోలేదని.. చాలా జాగ్రత్తగా హోంవర్కు చేసిన తర్వాతే చేశారన్న విషయం సీఎం రేవంత్ ప్రెస్ మీట్ ను చూస్తే అర్థమవుతుందని చెప్పాలి.