2 గంటల ప్రెస్ మీట్.. రేవంత్ ను ఒక్క మాట అనని కిషన్ రెడ్డి?

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం తనపై మాటల దాడి చేసే వారిని.. విమర్శలతో ఉతికి ఆరేసేవారిని.. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేసే వారిని ఏ రాజకీయ నేత వదలని కాలం.

Update: 2026-06-09 04:22 GMT

మాటకు మాట సమాధానంగా మారుతున్న కాలమిది. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం తనపై మాటల దాడి చేసే వారిని.. విమర్శలతో ఉతికి ఆరేసేవారిని.. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేసే వారిని ఏ రాజకీయ నేత వదలని కాలం. నువ్వు ఒకటంటే.. నేను మూడు అంటా అనే పరిస్థితి. అలాంటి వేళలో.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించిన అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యూహం ఇప్పుడో ఫజిల్ గా మారింది. గడిచిన రెండు.. మూడు రోజులుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. తెలంగాణ డెవలప్ మెంట్ ను ఆయన అడ్డుకుంటున్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

అంతేనా.. తాను ఢిల్లీకి వెళ్లి.. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు.. అనుమతుల గురించి ఒప్పించి వస్తే.. తాను వెళ్లిన రెండు మూడు రోజులకే కిషన్ రెడ్డిని వారిని కలిసి.. తెలంగాణ సీఎం చెప్పినట్లు చేస్తే.. వారికే మైలేజ్.. మీరేమి పనులు చేయొద్దంటూ కిషన్ రెడ్డి కోరుతున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా సోమవారం రాత్రి వేళ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు. ఇంచుమించు ఇదే తరహాలో శని..ఆదివారాల్లోనూ కిషన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు.. ఆరోపణలు చేస్తున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులకు కిషన్ రెడ్డి కార్యాలయం నుంచి ఒక మీడియా భేటీ ఉన్నట్లుగా మెసేజ్ వచ్చింది. సీఎం రేవంత్ వ్యాఖ్యల వేళ.. కిషన్ రెడ్డి పెడుతున్న ప్రెస్ మీట్ కాబట్టి.. రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు ఉంటాయన్న అంచనాతో.. మిగిలిన రోజులకు భిన్నంగా పలువురు సీనియర్లు ఎంతో ఆసక్తిగా ఈ మీడియాభేటీకి వెళ్లారు. హైదరాబాద్ లోని ఫిలింనగర్ లోని కల్చరల్ క్లబ్ వేదికగా నిర్వహించిన కిషన్ రెడ్డి మీడియాభేటీ దాదాపుగా రెండు గంటలకు పైనే సాగింది.

షాకింగ్ అంశం ఏమంటే.. ఇంత సుదీర్ఘంగా సాగిన ఈ మీడియా భేటీలో రాజకీయాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతేనా.. అసలు రాజకీయ అంశాలతో సంబంధం లేకుండా.. తన పోర్టుఫోలియోకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. ఆయా అంశాల్ని వివరిస్తూ మీడియా భేటీని పూర్తి చేశారు. పశ్చిమాసియాలో సాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంధన దిగుమతులు.. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై తమ ప్రభుత్వం ఎలాంటి ఫోకస్ పెట్టిందన్న వివరాలతో పాటు.. బొగ్గు నుంచి సిన్ గ్యాస్ ఉత్పత్తి దిశగా జరుగుతున్న పరిశోధనల గురించి వెల్లడించారు.

మొత్తంగా తన సుదీర్ఘ మీడియా భేటీలో రాజకీయాల గురించి పల్లెత్తు మాట ప్రస్తావించని వైనం మీడియా ప్రతినిధులకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకరిద్దరు సీఎం రేవంత్ చేసిన తీవ్ర విమర్శలు.. సంచలన ఆరోపణలను ప్రస్తావించబోతే.. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న సమావేశంగా పేర్కొనటం చూస్తే.. ఈ మౌనం వ్యూహాత్మకమా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం చేస్తున్న విమర్శల డోసు రోజురోజుకు పెరుగుతోంది. మరి.. ఆయన చేస్తున్న ఆరోపణలకు కిషన్ రెడ్డి ఎప్పుడు సమాధానం ఇస్తారు? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న.

Tags:    

Similar News