భూములు తీసుకోవాల్సిందే : మాజీ సీఎం నల్లారి సంచలన వ్యాఖ్యలు

ఏపీకి ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే లేట్ అయింది అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు.;

Update: 2025-10-15 14:26 GMT

ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. ఆయన ఏకంగా మూడేళ్ళ పాటు సీఎం గా పనిచేశారు. ఆయన మంత్రి పదవి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్రంగా ప్రయత్నించి స్పీకర్ పదవితో సరి పుచ్చుకున్నారు. అయితే అదృష్టం ఆయనకు కలసి వచ్చి సీఎం గా అయిపోయారు. 2011 నుంచి 2014 దాకా ఆయన అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తరువాతనే ఆయన రాజకీయం ఏమీ కాకుండా అయిందని అంటారు. కాంగ్రెస్ కి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఆయన బీజేపీలో చేరినా మరో ఉన్నత పదవి అయితే దక్కలేదు. దాంతో ఆయన బీజేపీలో కీలక నేతగా ఉన్నా అపుడపుడు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తూనే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోలవరం లేట్ అంటూ :

ఏపీకి ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే లేట్ అయింది అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. తాను సీఎం గా ఉనపుడే పోలవరం ప్రాజెక్ట్ కి 16,500 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారు అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కి సహకరిస్తోంది కాబట్టి పూర్తి చేసే మేలు జరుగుతుందని అన్నారు. క్రిష్ణా జలాల మీద ఏపీకి ఉన్న హక్కులను కాపాడాలని ఒక్క నీటి చుక్క కూడా వదులుకోరాదని ఆయన కూటమి ప్రభుత్వానికి సూచించారు. అంతే కాదు కృష్ణా జలాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా న్యాయ పోరాటం చేయాలని అంతర్రాష్ట్ర నదీ జలాలపైన ఏపీ హక్కులను కాపాడుకుంటూ కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.

భూములు తీసుకోండి :

ఏపీలో ఐటీ మాత్రమే కాకుండా అక్వా ఆయిల్ ఫాం రంగాలను అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఐటీ కంపెనీలు ఒప్పందం ప్రకారం యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే వారికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలకు వందలాదిగా భూములు ఇవ్వడం జరుగుతోంది, ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మిధున్ రెడ్డి విషయంలో :

ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే 2024 ఎన్నికల్లో తన మీద రాజంపేటలో పోటీ చేసి గెలిచిన వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మీద కూడా కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్. లిక్కర్ కేసులో జైలులో ఉండి బెయిల్ మీద వచ్చిన మిధున్ రెడ్డిని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఐక రాజ్య సమితికి పంపిస్తుంది అని మీడియా ప్రశ్నలకు కిరణ్ తనదైన శైలిలో బదులిచ్చారు. పార్లమెంట్ వేరు కేంద్ర ప్రభుత్వం వేరు, న్యాయ శాస్త్రం ప్రకారం చూస్తే శిక్ష పడే వరకూ ఎవరినీ దోషిగా అనలేమని కిరణ్ చెప్పడం విశేషం. ఇక కోర్టులో కేసులు ఉన్న కారణంగా తాను లిక్కర్ స్కాం విషయంలో స్పందించనని ఆయన చెప్పడమూ విశేషం. తాను పక్కా సమైక్యవాదిని అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆనాడూ ఈనాడూ ఏనాడూ తన మట ఒక్కటే ఉమ్మడి ఏపీకే తన ఓటు అన్నారు. ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు మహారాష్ట్ర తర్వాత దేశంలో రెండవ స్థానంలో ఏపీ ఉండేదని ఇపుడు ఏపీ తెలంగాణా ఎక్కడ ఉన్నాయో చెప్పనక్కరలేదని ఆయన చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.

Tags:    

Similar News