ట్యాంకర్‌పై రాయల్ ఎంట్రీ.. కూతురితో కలిసి కిమ్ జోంగ్ షో ఆఫ్!.
ఈ పర్యటనలో కిమ్ జోంగ్ ఉన్ కేవలం షికారు చేయడమే కాకుండా, తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.;
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్టైలే వేరు.. తాజాగా ఆయన తన కుమార్తె కిమ్ జు యేతో కలిసి ఒక భారీ మిలిటరీ ట్యాంకర్‌పై షికారు చేస్తూ కనిపించారు. తండ్రీకూతుళ్లు కలిసి యుద్ధ విన్యాసాలను పర్యవేక్షించడమే కాకుండా, ట్యాంకర్‌పై రాయల్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 13 ఏళ్ల ఈ చిన్నారిని కిమ్ తన వారసురాలిగా సిద్ధం చేస్తున్నారా? అనే సందేహాలకు ఈ ఫోటోలు మరింత బలాన్నిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం.
ట్యాంకర్‌పై తండ్రీకూతుళ్ల సందడి:
గురువారం ఉత్తర కొరియాలోని ఒక ఆర్మీ ట్రైనింగ్ యూనిట్‌లో కిమ్ జోంగ్ ఉన్ పర్యటించారు. ఈ సందర్భంగా దళాలు నిర్వహిస్తున్న లైవ్ ఫైరింగ్ డ్రిల్స్‌ను ఆయన దగ్గరుండి చూశారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కిమ్ తన కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కూర్చున్న ఫోటోలే! బ్లాక్ కోట్ వేసుకున్న కిమ్ ట్యాంకర్‌పై నవ్వుతూ కూర్చోగా, కిమ్ జు యే ట్యాంకర్ లోపల కూర్చుని బయటకు చూస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఒక దేశాధినేత తన చిన్నారిని వెంటబెట్టుకుని ఇలాంటి మిలిటరీ విన్యాసాల్లో పాల్గొనడం చర్చకు దారితీసింది.
యుద్ధ సన్నద్ధతకు కిమ్ పిలుపు:
ఈ పర్యటనలో కిమ్ జోంగ్ ఉన్ కేవలం షికారు చేయడమే కాకుండా, తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. శత్రువులను ఎదుర్కొనేందుకు యుద్ధ సన్నాహాలను త్వరగా పూర్తి చేయాలని ఆయన దళాలకు పిలుపునిచ్చారు. ఇక ఆధునిక యుద్ధ తంత్రాలను అలవాటు చేసుకోవాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇప్పుడు దేశ రక్షణలో ట్యాంకర్ల పాత్ర కీలకమని, అందుకే స్వయంగా వాటిని పరిశీలించేందుకు వచ్చానని ఆయన పేర్కొన్నట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
వారసురాలు కిమ్ జు యే?:
గత కొంతకాలంగా కిమ్ జు యే వార్తల్లో నిలుస్తూనే ఉంది. 2022 చివరలో మొదటిసారి ప్రపంచానికి పరిచయమైన ఈమె, అప్పటి నుండి తండ్రి వెంటే ఉంటోంది. క్షిపణి పరీక్షల దగ్గర నుంచి మిలిటరీ పరేడ్ల వరకు ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలోనూ కిమ్ ఆమెను వెంటబెట్టుకుని వెళ్తున్నారు. ఇక దక్షిణ కొరియా నిఘా సంస్థల అంచనా ప్రకారం.. కిమ్ తన తర్వాత దేశ పగ్గాలను ఈమెకే అప్పగించే అవకాశం ఉంది. ఇక అందుకే చిన్నతనం నుంచే ఆమెకు సైనిక వ్యవహారాలపై అవగాహన కల్పిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచ దేశాల్లో చర్చ:
కిమ్ కుమార్తె ఇటీవల స్నైపర్ రైఫిళ్లను ఎక్కిపెట్టిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ట్యాంకర్ మీద కనిపించడంతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 13 ఏళ్ల వయసులో ఇలాంటి పవర్ ఫుల్ షో ఆఫ్ చేయడం ద్వారా కిమ్ తన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఉత్తర కొరియాలో రహస్యంగా జరిగే ఇలాంటి పర్యటనలు, ఈసారి ఫోటోలతో సహా విడుదల కావడం వెనుక ఏదో ఒక బలమైన రాజకీయ కారణం ఉంటుందని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది.