సైనిక అధికారులకు ఆయుధాల బహుమతి… కిమ్ కుమార్తె హాజరు హాట్ టాపిక్!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిని సిద్ధం చేసే పనిలో పడ్డారా ? అంటే నిజం అనిపిస్తుంది.;
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిని సిద్ధం చేసే పనిలో పడ్డారా ? అంటే నిజం అనిపిస్తుంది. ఇటీవల సైనిక అధికారులకు స్నైపర్ రైఫిళ్లను బహుమతిగా ఇచ్చిన కార్యక్రమంలో ఆయన కుమార్తె కిమ్ జు యే అక్కడికి కావడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. కేవలం అతిథిగా రాడమే కాకుండా, స్వయంగా రైఫిల్‌తో ఎయిమ్ చేస్తున్న ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ పగ్గాలు చేపట్టేందుకు ఆమెకు ఇప్పుడే శిక్షణ ఇస్తున్నారా? అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇప్పుడు ఆ విశేషాలు తెలుసుకుందాం..
వారసత్వ పగ్గాల దిశగా అడుగులు:
దక్షిణ కొరియా నిఘా సంస్థ అంచనాలు వేసినట్లుగానే, కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె జు యేను తదుపరి అధినేత్రిగా నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వర్కర్స్ పార్టీ కార్యక్రమంలో భాగంగా సైనిక అధికారులకు వారి విధేయతకు గుర్తుగా కిమ్ తుపాకులను బహుమతిగా ఇచ్చారు. ఇక ఈ సందర్భంగా కిమ్ జు యే కూడా రైఫిల్‌ను గురిపెట్టి చూస్తున్న దృశ్యాలు ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. గతంలో కేవలం తండ్రితో కలిసి క్షిపణి ప్రయోగాలను వీక్షించిన జు యే, ఇప్పుడు నేరుగా ఆయుధాలను చేతిలోకి తీసుకోవటం వంటి అంశాలు ఆమెకు సైనిక వ్యవహారాల్లో పట్టు పెంచుతున్నారనే సంకేతాలను ఇస్తోంది.
నమ్మకమైన అధికారులకు నజరానాలు:
ఉత్తర కొరియాలో ప్రతి ఐదేళ్లకోసారి జరిగే వర్కర్స్ పార్టీలో కిమ్ తనదైన శైలిలో పట్టు నిరూపించుకున్నారు. తనకు అత్యంత నమ్మకంగా పనిచేస్తున్న సైనిక, ప్రభుత్వ అధికారులకు స్నైపర్ రైఫిళ్లను కానుకగా ఇచ్చి వారిని ఉత్సాహపరిచారు. మరోవైపు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా పార్టీలో కీలక శక్తిగా ఎదుగుతున్నారు. ఇటీవల ఆమెకు పదోన్నతి లభించడంతో, పార్టీ అంతర్గత వ్యవహారాలు, పరిపాలనా బాధ్యతలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు కుమార్తెకు శిక్షణ, మరోవైపు సోదరి పర్యవేక్షణతో కిమ్ కుటుంబం దేశంపై తన పట్టును మరింత బిగిస్తోంది.
ఉత్తర కొరియా భవిష్యత్తు నాయకురాలు?:
ఇక చాలా కాలంగా కిమ్ వారసుడు ఎవరనే ఉత్కంఠకు జు యే ఎంట్రీతో దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. చిన్న వయసులోనే కూతురు సైనిక విన్యాసాలు, అధికారిక హోదాల్లో తండ్రి పక్కనే కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా ఆయుధాల బహుమతి కార్యక్రమం కేవలం అధికారులను మెప్పించడానికి మాత్రమే కాకుండా, భవిష్యత్తులో దేశ సైన్యాన్ని నడిపే శక్తి జు యేకు ఉందని చాటి చెప్పడమే కిమ్ ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నియంతృత్వ దేశంలో ఈ యువతి అడుగులు ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.