గుడ్ మార్నింగ్ అంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే !
ఆయన ఇంటి పేరే గుడ్ మార్నింగ్ గా మార్చేసుకున్నారు. అంతటి పాపులారిటీ ఆయన చేపట్టిన ఆ కార్యక్రమం తెచ్చిపెట్టింది.;
ఆయన ఇంటి పేరే గుడ్ మార్నింగ్ గా మార్చేసుకున్నారు. అంతటి పాపులారిటీ ఆయన చేపట్టిన ఆ కార్యక్రమం తెచ్చిపెట్టింది. ఆయన ఎవరో కాదు అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఆయన కాంగ్రెస్ నుంచి తన రాజకీయాలను స్టార్ట్ చేశారు. 2004లో తొలిసారి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి ఆ టెర్మ్ లోనే 2007 ప్రాంతంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేసారు అది ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. ఉదయాన్నే అధికారులను వెంట బెట్టుని ప్రజల వద్దకు వెళ్ళడం వారి సమస్యలను అక్కడే విని సంబంధిత అధికారులకు దాని మీద పరిష్కారాలను సూచించడం ద్వారా కేతిరెడ్డి ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మారు మోగిన పేరు :
ఈ కార్యక్రమం ఎంతలా పాపులర్ అయింది అంటే రెండు రాష్ట్రాలలో కూడా ఆయన్ని బాగా వెలుగులోకి తెచ్చింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి ప్రతీ రోజూ క్రమం తప్పకుండా చేసే పర్యటనకు మొత్తం చర్చకు దారి తీశాయి. అలా తన జన బలాన్ని పెంచుకుని వైసీపీ టైం లో కూడా ఆయన గెలిచారు. 2019 నుంచి 2024 మధ్యలో ఆయన అనేక కార్యక్రమాలను జనం మధ్యనే ప్రకటించారు. అలా తన గెలుపు ఖాయమని అనుకున్న వేళ అనుకోని విధంగా బీజేపీ పొత్తులో ఆ సీటు తీసుకుంది. ఆ పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ పోటీ చేసి విజయం సాధించడమే కాకుండా మంత్రి కూడా అయిపోయారు.
వైరాగ్యంతో కేతిరెడ్డి :
ఇక ఆ తరువాత గడచిన రెండేళ్ళుగా కేతిరెడ్డి అయితే ధర్మవరంలో కనిపించలేదు, తాను ప్రజలకు ఎంతో చేశాను అని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారి ముంగిటకే చేర్చాను అని గుడ్ మార్నింగ్ అని వారి వద్దకే వెళ్ళి ఎంతో అందుబాటులో ఉన్న తనను ఓడించారని ఎన్నికల ముందు వచ్చిన వారికి ఓటు వేసి అయిదేళ్ళూ జనంతో ఉన్న తనను పక్కన పెట్టారని తీవ్ర ఆవేదన చెందారు, ఇలాగైతే రాజకీయాల్లో కష్టమని అనేక వీడియోలు చేశారు. తాను కూడా ఎన్నికల ముందే ఓట్లు అడిగేందుకు వస్తాను అని కూడా అన్నారు. అలా కేతిరెడ్డి హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటూ వచ్చారు. అయితే అధినాయకత్వం ఆయనను జనంలో ఉండాలని కోరడంతో పాటు రెండేళ్ళ కూటమి పాలనకు దగ్గర పడడంతో తిరిగి నియోజకవర్గంలోకి రావాలని చూస్తున్నారు.
న్యూ ఇయర్ డెసిషన్ :
తాను మళ్ళీ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని జనంలోకి వస్తున్నాను అని కొత్త ఏడాది వేళ ఈ మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. ప్రజలు ఈసారి ఎవరేమిటి అన్నది తెలుసుకుంటారని ఆయన చెప్పడం విశేషం. ఎన్నో హామీలు ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు ఏమీ చేయలేదని సత్యకుమార్ యాదవ్ పని తీరుని విమర్శించారు. అందుకే తాను ప్రజలలో ఉంటాను అని వారికి అండగా ఉంటాను అని చెబుతున్నారు. ఒక మంచి రోజు చూసుకుని గుడ్ మార్నింగ్ ధర్మవరం రీ స్టార్ట్ చేస్తాను అని ఆయన చెబుతున్నారు. 2029లో తాను తప్పకుండా గెలుస్తాను అని ఆయన చెబుతున్నారు. మొత్తానికి కేతిరెడ్డిలో రాజకీయ వైరాగ్యం పోయి జనం మధ్యకు రావాలని అనుకోవడం మంచి పరిణామం అని అటు పార్టీ పెద్దలు ఇటు క్యాడర్ కూడా సంతోషిస్తున్నాయట. మరి కొత్తగా కేతిరెడ్డి స్టార్ట్ చేస్తే ఈ గుడ్ మార్నింగ్ ఎలా ఉంటుంది, ఏ రకమైన ప్రచారానికి నోచుకుంటుంది అన్నది చూడాల్సిందే.