బీజేపీ, మిత్రపక్షాల నేతల పిల్లలే 'బొద్దింకలు'.. సీజేపీకి కేశినేని చిన్ని కూతురి మద్దతు
సోషల్ మీడియాలో తన పోస్టుపై పెద్ద ఎత్తున కథనాలు రావడంతో కేశినేని స్నిగ్ధ వెంటనే స్పందించి తన ఫేస్‌బుక్ వేదికగా పూర్తి వివరణనిచ్చారు.
సోషల్ మీడియా ప్రభంజనం ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి సంబంధించి రోజుకొక విశేషం బయటపడుతోంది. నీట్ పేపరు లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమించగా, ఆ కార్యక్రమంలో అధికార పార్టీ నేతల పిల్లలు కూడా పాలుపంచుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. తమ తల్లిదండ్రులు ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ కేంద్ర విద్యాశాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యుల పిల్లలు కూడా నిరసనగళం వినిపించడం హాట్ టాపిక్ అవుతోంది. ఇలా సీజేపీకి మద్దతు ప్రకటించి విద్యార్థులకు బాసటగా నిలిచిన వారిలో ఏపీలోని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కుమార్తె స్నిగ్ధ పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా పేపరు లీకుతోపాటు కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ స్నిగ్ధ పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుమార్తె స్నిగ్ధతోపాటు ఒడిశాలోని బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చితా సచిన్ రాహర్, అసోంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న కేశబ్ మహంత కూతురు దిబిసా మహంత ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. స్నిగ్ధ హైదరాబాద్ లోని హెచ్.సీ.యూలో చదువుకుంటున్నారు. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకముందు విద్యార్థులకు మద్దతుగా స్నిగ్ధ గట్టిగా పోరాడారని చెబుతున్నారు. అంతేకాకుండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఆమె పెట్టిన ఫేస్ బుక్ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో ‘సార్ రాజీనామా లేఖకు డ్రాఫ్ట్ చేయాలా? గ్రామర్లీ లింక్ పంపిస్తా’ అంటూ స్నిగ్ధ రాశారు.
ఇక ఒడిశాలోని బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చిత సైతం నీట్ పేపరు లీకేజీని తీవ్రంగా నిరసించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన అర్చిత పెట్టిన పోస్టు కూడా వైరల్ అవుతోంది. మా ఇంట్లో అందరూ డీపీ (ధర్మేంద్ర ప్రధాన్)కు మద్దతు చెబుతున్నారు. నేను మాత్రం విద్యార్థుల పక్షానే ఉంటానంటూ అర్చిత పోస్టు పెట్టారు. ఇక విద్యార్థుల ఒత్తిడితో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రం కూడా ఒడిశానే కావడం గమనార్హం. సొంత రాష్ట్రంలోనూ ఆయన రాజనీమా చేయకపోవడంపై విద్యార్థుల నుంచి నిరసన ఎదుర్కొన్నారని అర్చిత ఉదంతం తెలియజేస్తోందని అంటున్నారు. అదేవిధంగా అస్సాం మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిశా ఏకంగా విద్యార్థులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడమే కాకుండా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టుపై స్నిగ్ధ స్పందిస్తూ అప్పట్లో విద్యార్థుల సమస్యపై మాట్లాడటంలో తప్పేముందని వ్యాఖ్యానించారు. "మన దేశంలో జరుగుతున్నది చూస్తుంటే నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఇటీవలి పరీక్షల నిర్వహణలో విఫలమైన ఒక మంత్రి జవాబుదారీతనాన్ని ప్రశ్నించినందుకు, విద్యార్థులపై క్రూరంగా ప్రవర్తించారు. సమాధానాలు చెప్పడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు మేం ఎవరికి చెప్పుకోవాలి? నేను విద్యార్థుల పక్షాన నిలబడతాను. జవాబుదారీతనం, సమాధానాలు డిమాండ్ చేస్తున్నాం" అని ఆమె పేర్కొన్నారు.
అయితే, ఈ విషయమై రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో తన పోస్టుపై పెద్ద ఎత్తున కథనాలు రావడంతో కేశినేని స్నిగ్ధ వెంటనే స్పందించి తన ఫేస్‌బుక్ వేదికగా పూర్తి వివరణనిచ్చారు. తాను హాజరైన విద్యార్థి నిరసన కార్యక్రమాన్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి, అర్థవంతమైన పరిష్కారాలు కోరడానికి పూర్తి హక్కు ఉందని తాను గట్టిగా నమ్ముతున్నందుకే ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని స్పష్టం చేశారు. తన మద్దతు ఎల్లప్పుడూ ఆ ఉద్యమానికి, విద్యార్థుల సంక్షేమానికి మాత్రమేనని, ఏ రాజకీయ అజెండాకు కాదని తేల్చిచెప్పారు.
అదే సమయంలో, విద్యార్థుల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో కట్టుబడి ఉన్నారని గుర్తుచేశారు. అనేక సందర్భాల్లో ప్రధాని విద్యార్థులతో మమేకమై, చర్చలను ప్రోత్సహించి, విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి, దేశవ్యాప్తంగా యువతకు మెరుగైన అవకాశాలను కల్పించే కార్యక్రమాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ చర్చ కేవలం విద్యార్థులు, వారి సమస్యలు మరియు అర్థవంతమైన పరిష్కారాల వైపే ఉండాలి తప్ప, అసలు ఉద్దేశం నుంచి దృష్టి మరల్చే రాజకీయ కథనాలకు ఇది వాహకం కారాదని కోరుతూ స్నిగ్ధ తన వివరణను ముగించారు.